Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

పునాది తీస్తే చాలు! కార్పొరేటర్ల పైసా వసూల్‌!!

హైదరాబాద్‌లో కార్పోరేటర్లు రెచ్చి పోతున్నారు. పైసా వసూళ్లే లక్ష్యంగా అడ్డదారులు తొక్కేస్తున్నారు. భవన నిర్మాణాల కోసం పునాది తవ్వితే చాలు.. డబ్బుల కోసం రాయ‘భేరాలు’ మొదలు పెట్టి అందిన కాడికి దోచేస్తున్నారు. నగరంలో 50 శాతానికి పైగా మహిళా కార్పోరేటర్లున్నా.. వారి భర్తలు, సమీప బంధువులే అన్నీ తామే చక్రం తిప్పేస్తున్నారు. తాజాగా ఉప్పల్‌ డివిజన్‌ పరిధిలో ఓ ప్రై వేటు స్కూలు యజమానిని బెదిరించిన కేసులు ఉప్పల్‌ కార్పేరేటర్‌ భర్త, ఆమె పీఏపై ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కావటమే ఇందుకు సజీవ ఉదాహరణ!
జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో..
గతంలో చైతన్యపురిలోనే వసూళ్ల కోసం బెదిరింపులతో అక్కడి కార్పోరేటర్‌పై సైతం కేసు నమోదైంది. సాధారణ ఎన్నికలకు ముందు ప్రభుత్వ పెద్దల నుండి హెచ్చరికలు రావటంతో జాగ్రత్త పడ్డ కార్పోరేటర్ల మళ్లీ తాజాగా తమ డివిజన్లలో వార్డు మెంబర్లు, పీఏలకు టార్గెట్లు పెట్టీ మరీ వసూళ్లకు తెగబడుతున్న వైనం నగరంలో కలకలం రేపుతోంది. ఎల్బీనగర్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, ముషీరాబాద్, కూకట్‌పల్లి, రాజేంద్రనగర్‌ తదితర నియోకజవర్గాల్లో పరిస్థితి దారుణంగా మారింది. కార్పోరేటర్లకు ప్రత్యేక నిధులంటే ఏమీ లేకపోవడానికి తోడు జీహెచ్‌ఎంసీకి ముందస్తు ఎన్నిక ప్రచారంతో పాటు, వారి పదవీ కాలం సైతం దగ్గర పడుతుండటంతో దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకునే ఆలోచనతో కొందరు కార్పోరేటర్ల అన్నీ తామై వ్యవహరిస్తున్న ఫిర్యాదులు భారీగా వెల్లువెత్తుతున్నాయి.
మిషన్‌ కలెక్షన్‌..
ఎల్బీనగర్‌ నియోకజవర్గంలో నలుగురు కార్పోరేటర్ల పరిస్థితి దారుణంగా మారింది. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో ఓ కార్పోరేటర్‌పై కేసు నమోదు కాగా, తన భార్య పదవిని అడ్డుపెట్టుకున్న ఓ కార్పోరేటర్‌ తానే రంగంలోకి దిగి కలెక్షన్‌ కింగ్‌గా మారిపోయాడు. మరో మహిళా కార్పోరేటర్‌ మాత్రం తన భర్తకు ఆవకాశం ఇవ్వకుండా తన డివిజన్‌లో ఎక్కడ నిర్మాణం ప్రారంభమైన తనకు సమాచారం వచ్చేందుకు ఏకంగా ముగ్గురు మనుషులను పెట్టుకున్నారన్న ఫిర్యాదులున్నాయి. ఇటీవలే ఎంఎల్‌ఏ సుధీర్‌రెడ్డి పలువురు కార్పోరేటర్లకు సూచనలు చేసినా.. కొందరు వాటిని చెవినపెట్టలేదని సమాచారం. ఇక ఉప్పల్‌ నియోకజవర్గంలో నలుగురు కార్పోరేటర్లది సైతం ఇష్టారాజ్యంగానే ఉన్నట్లు ఫిర్యాదులున్నాయి. ఈ నియోజకవర్గంలో బహుళనాయకత్వం ఉండటంతో ఒకరి మాట, మరొకరు వినే స్థితి కనిపంచటం లేదు.
కుత్బుల్లాపూర్‌లో ఘోరం..
కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో మాత్రం నిర్మాణాలతో పాటు వెంచర్ల అక్రమాలకు సైతం కొందరు కార్పోరేటర్ల తెరలేపుతున్నారు. గాజులరామారం మహదేవపురం ప్రాంతంలో ఎస్‌ఎఫ్‌సి కు సంబంధించిన ప్రభుత్వ భూ వివాదంలో ముగ్గురు కార్పొరేటర్లు రియల్టర్‌కు భారీ టెండర్‌ వేసి సరికొత్త వాహనాలు సైతం కొనుగోలు చేసినట్లు సమాచారం.ఇదే నియోజకవర్గంలో తన అడిగినంత మొత్తం ఇవ్వని ఓ నిర్మాణాన్ని అధికారులతో కూల్చి వేయించిన కార్పోరేటర్‌ భర్త, ఆపై నగదు ముట్టాక, చూసీచూడనట్లు వెళ్లాలని అదే అధికారులకు చెప్పటం విశేషం. పారిశ్రామికవాడను ఆనుకుని ఉన్న ప్రాంతంలో కార్పోరేటర్‌ భర్తే నేరుగా స్వయంగా రంగంలోకి దిగి, మొత్తాలు ఫిక్స్‌ చేస్తున్నారు. ఇటీవల ఫాక్స్‌సాగర్‌ సమీపంలో వెలిసిన గోదాముల నిర్మాణంలోనూ భారీ వసూళ్లు చేసినట్లు ఫిర్యాదులున్నాయి.
కార్పొరేటరే బిల్డర్స్‌గా..
మల్కాజిగిరి నియోజకవర్గంలో ఓ కార్పోరేటర్‌ భర్త తానే బిల్డర్‌ కావటంతో అన్ని సెటిల్‌మెంట్లు ఆయన కనుసన్నుల్లోనే కానిచ్చేస్తున్నారు. మరో డివిజన్‌లో మాత్రం కార్పోరేటర్‌ భర్తతో పాటు కుమారుడు సైతం జోక్యం చేసుంటున్న ఫిర్యాదులున్నాయి. బండచెరువు ప్రాంతంలో నిర్మాణాల కోసం భారీ మొత్తాలు డిమాండ్లు పెడుతున్నట్లు ఆరోపణలున్నాయి. కూకట్‌పల్లి నియోజకవర్గంలో ముగ్గురు కార్పోరేటర్ల పేర్లు చెబితేనే స్థానిక జనం హడలి పోతున్నారు.ఓ కార్పోరేటర్‌ స్థానిక చెరువుల్లో నిర్మాణాలను ప్రోత్సహిస్తుండగా, మరో కార్పోరేటర్‌ ప్రభుత్వ భూమికి ప్రై వేటు నెంబర్‌ వేసి చేస్తున్న భూ విక్రయాలకు కేంద్ర బిందువుగా మారారు. శేరిలింగంపల్లి నియోజకరవ్గంలో ఓ ముఖ్య నాయకుడు దత్తత తీసుకున్న డివిజన్‌లో అక్రమ నిర్మాణాలన్నీ కార్పోరేటర్‌ కనుసన్నల్లోనే సాగిపోతున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

Related Posts

Latest News Updates