Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఫ్లాట్‌ ఖరీదు రూ.5 కోట్లు!

దేశంలో ఏటా ఖరీదైన గృహాల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 3,626 అల్ట్రా లగ్జరీ ఫ్లాట్లు విక్రయం కాగా.. హైదరాబాద్‌ 204 గృహాలున్నాయి. గతేడాదితో పోలిస్తే లగ్జరీ ఫ్లాట్ల కొనుగోళ్ల వృద్ధి 12 శాతం. ఇక, రూ.కోటి నుంచి రూ.5 కోట్ల మధ్య ఖరీదైన ఫ్లాట్లు 7,416 అమ్ముడుపోగా.. నగరం వాటా 456 యూనిట్లు. ఏడాది కాలంలో ఈ విభాగం వృద్ధి 15 శాతం!
హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, ముంబై, ఎన్‌సీఆర్, పుణె నగరాల్లో రూ.25 లక్షల్లోపుండే అందుబాటు గృహాల అమ్మకాలు 8 శాతం, గతేడాదితో పోలిస్తే 16 శాతం వృద్ధిని సాధించాయని ఓ రీసెర్చ్‌ సంస్థ నివేదిక వెల్లడించింది. రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల గృహాల అమ్మకాలు గతేడాది త్రైమాసికంతో పోలిస్తే 1 శాతం వృద్ధి, ఏడాదితో పోలిస్తే మాత్రం 3 శాతం తగ్గాయి. రూ.కోటి నుంచి రూ.2 కోట్ల గృహాల అమ్మకాలు త్రైమాసికంతో పోలిస్తే 9 శాతం, ఏడాదితో పోలిస్తే 15 శాతం వృద్ధి, రూ.2 కోట్లకు మించిన అల్ట్రా లగ్జరీ గృహాల విక్రయాలు త్రైమాసికంతో పోలిస్తే 13 శాతం, ఏడాదితో పోలిస్తే 12 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
పశ్చిమ జోన్‌లోనే ఎక్కువ..
ఐటీ కంపెనీలకు కేంద్ర బిందువైన పశ్చిమ జోన్‌లోనే లగ్జరీ అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు, కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. గచ్చిబౌలి, మాదాపూర్, మణికొండ, నార్సింగి, గండిపేట్‌ వంటి ప్రాంతాల్లో ఈ తరహా నిర్మాణాలు జరుగుతున్నాయి. ‘‘సుమారు 6 వేల చ.అ. నుంచి వీటి విస్తీర్ణాలుంటాయి. హోమ్‌ ఆటోమేషన్,  24 గంటలు నీళ్లు, విద్యుత్‌. కట్టుదిట్టమైన భద్రత. లగ్జరీ క్లబ్‌హౌజ్, స్విమ్మింగ్‌ పూల్, ఏసీ జిమ్, థియేటర్‌ వంటి అన్ని రకాల అత్యాధునిక వసతులుంటాయి. అయితే వసతులకు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఓ డెవలపర్‌ తెలిపారు. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే నగరంలో భూముల ధరలు తక్కువగా ఉండటం, వాతావరణం అనుకూలంగా ఉండటం, కాస్మోపాలిటన్‌ సిటీ, స్థానిక ప్రభుత్వ విధానాలూ వంటివి కూడా ప్రీమియం కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఎన్నారైలు, అధిక వేతనాలుండే ఐటీ, ఫార్మా ఉద్యోగులు, వ్యాపార సంస్థల యజమానులు, ఉన్నతాధికారులు ఈ ఖరీదైన గృహాలను కొనుగోలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంఓ స్టార్టప్స్, ఈ–కామర్స్, లాజిస్టిక్‌ కంపెనీలు ఉద్యోగులూ ఈ జాబితాలో చేరారు.
కొనుగోళ్ల వృద్ధికి కారణాలివే..
పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ), స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి (రెరా) బిల్లులతో స్థిరాస్తి రంగంలో పారదర్శకతను తీసుకొచ్చింది. దీని ఫలితమే రియల్టీకి ప్రవాసులు, హెచ్‌ఎన్‌ఐల పెట్టుబడులు రావటం. అమెరికాతో సహా ఇతర ప్రపంచ దేశాల మార్కెట్లు ప్రతికూలంలో ఉండటంతో అయా దేశాల్లోని ప్రవాసులను మన దేశంలో పెట్టుబడులు పెట్టేలా చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గృహ వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం, మూలధన రాబడి, పన్ను ప్రయోజనాలు వంటివి కూడా కొనుగోళ్ల పెరుగుదలకు కారణాలని ఓ డెవలపర్‌ తెలిపారు. స్వల్పకాలంలో అధిక రాబడి కారణంగా కొందరు లగ్జరీ గృహాలను కొనుగోలు చేస్తుంటే, మరికొందరేమో ఆధునిక వసతులు, భద్రత వంటి కారణంగా పాత గృహాలను అమ్మేసి మరీ లగ్జరీ ఫ్లాట్లను కొంటున్నారని చెప్పారు.

Related Posts

Latest News Updates