Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

బేగంపేట మినర్వా వెనక అక్రమ నిర్మాణం

హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలు యదేచ్ఛగా వెలుస్తున్నాయి. అధికారులు, ప్రజా ప్రతినిధుల నుంచి ఆశిస్సులు ఉండటంతో అక్రమదారులు రెచ్చిపోతున్నారు. తాజాగా నగరం నడిబొడ్డున అక్రమ నిర్మాణం శరవేగంగా ముస్తాబవుతున్నా.. అధికారులు చోద్యం చూస్తున్నారు.
బేగంపేట మినర్వా వెనక..
బేగంపేట సర్కిల్‌లోని మినర్వా కాంప్లెక్స్‌ వెనుక ఓ అక్రమ నిర్మాణం జరుగుతుంది. అక్కడకు వెళ్లి జీహెచ్‌ఎంసీ అధికారులు పనులు ఆపేశారు. అంతే కొద్ది నిమిషాల్లోనే అధికారులకు ఓ విజిలెన్స్‌ ఉన్నతాధికారి నుంచి ఫోన్‌ వచ్చింది. ‘మా వాళ్ల పనులు ఆపేశారంటా సామాగ్రీ తీసుకుని వెళ్లారంటా వెంటనే వాళ్ల సామాన్లు ఇచ్చేసి అటు వైపు వెళ్లవద్దు వెళితే∙బాగుండదు’ అంటూ ఆ అధికారి నుంచి హెచ్చరిక.
ఎస్పీరోడ్‌లోనూ అంతే..
ఎస్పీ రోడ్‌లో ఓ బహుళ అంతస్తు భవనం నిర్మాణం జరుగుతుంది. వర్షాకాలం కావడంతో పనులు ఆపేయండి లేకపోతే పక్క భవనాలకు ప్రమాదం ఉంటుంది. మీ అనుమతుల పత్రాలు తీసుకుని రండని నోటీసులు ఇచ్చారు జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు. మాకే నోటీసులు ఇస్తారా, ప్రిన్సిపల్‌ సెక్రటరీతో మాట్లాడండి, కమిషనర్‌తో మాట్లాడతారా అంటూ అధికారులకు బెధిరింపులకు పాల్పడి… అనుమతులు రాకుండానే ఎట్టకేలకు పనులు చేపట్టారు. ఇది బేగంపేట సర్కిల్‌ పరిధిలో అక్రమణదారుల బెధిరింపు. కంచె చేను మేస్తే కాపేమి చేయగలడు అన్నట్లుంది జీహెచ్‌ఎంసీలో ఉన్నతాధికారులు పరిస్థితి.
రాజకీయ, అధికారుల అండదండలు..
బేగంపేట సర్కిల్‌ పరిధిలో ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. ఒక వైపు అధికారులు నోటీసులు ఇచ్చి కూలగొడతామని ప్రకటిస్తున్నా వాటిని నిలువరించడం మాత్రం జరుగడం లేదు. అధికారులు నోటీసులు ఇచ్చే లోపు అవి మావే అంటూ కింది స్థాయి ప్రజా ప్రతినిధుల నుంచి ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు వారికి వత్తాసు పలుకుతున్నారు. దీంతో ఆక్రమణలను నిలువరించడంలో అధికారులు విఫలం అవుతున్నారు. ఆక్రమణలు వెలిసేందుకు ఉన్నత స్థాయి పలుబడి కారణం అయితే కానీ ఏదైనా సంఘటనలు జరిగితే మాత్రం దానికి కిందిస్థాయి సిబ్బంది, అధికారులను బలిచేయడం ఆనవాయితీగా మారింది. సర్కిల్‌ పరిధిలో కొంత మంది కార్పొరేటర్‌ స్థాయి ప్రజా ప్రతినిధులు అక్రమ నిర్మాణ దారులతో బేరసారాలు చేసి అవి జరుగపోతే ఆక్రమణలను కూల్చేయమనడం అటు తర్వాత అధికారలు కూల్చేయడానికి వెళితే బేరం కుదిరి వద్దని వారించడం వారే చేస్తుండటంతో సర్కిల్‌ అధికారుల పరిస్థితి ఆడకత్తెరలో పోకచెక్కలా తయారైంది.
అక్రమ నిర్మాణాల్లో ఉన్నతాధికారులు బిజీ..
ఈ సర్కిల్‌లో జరిగే అక్రమ నిర్మాణాలకు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు సంబంధించినవి ఉంటున్నాయి. కేవలం గ్రౌండ్‌తో పాటు రెండు అంతస్తులకు అనుమతులు తీసుకుని వంద గజాల స్థలం కూడా లేకున్నా నాలుగు నుంచి ఐదంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. పది అడుగుల విస్తీర్ణం రోడ్డు కూడా లేకున్నా అక్కడ ఐదంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. ఎస్పీరోడ్‌లో ఇటీవల ఓ బహుళ అంతస్తు భవనం అనుమతులు ఫైల్‌ రాకముందే పనులు ప్రారంభించారు. దీంతో దీని పక్కన ఉన్న భవనం బీటలు బారింది. అధికారులు హడావిడిగా అందులో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించారు. అంతకు ముందు రోజు ఒక వేళ వర్షం పడివుంటే ఊహించని ప్రాణ నష్టం జరిగి ఉండేది. స్థానిక అధికారులు నోటీసులు ఇచ్చినా ఉన్నతాధికారుల జోక్యంతో పనులు చేపట్టారు. ఈ ఘటన జరిగాక హడావిడిగా అనుమతులు తెచ్చుకోవడం గమనార్హం. ఇలా విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు చేపడుతుండటంతో స్థానికులకు ఇబ్బందులు తప్పడం లేదు. చిన్నచిన్న స్థలంలోనే బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తుండటంతో మంచినీరు, డ్రైనేజీ తదితర సమస్యలు ఉత్ఫన్నమవుతున్నాయి. దీనికి తోడు పెద్ద స్థాయిలో ఉండే అధికారులే ఇలా అక్రమ నిర్మాణాలను చూసి చూడనట్లు వదలి వేయాలని అనధికారిక ఆదేశాలు ఇస్తుండటం గమనార్హం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఇలా అక్రమ నిర్మాణాల విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటే బాగుంటుందని స్థానికులు అంటున్నారు.

Related Posts

Latest News Updates