హాల్, కిచెన్, పూజ గది, బెడ్ రూమ్, డ్రాయింగ్ రూమ్, బాత్రూమ్.. సాధారణంగా ఒక ఇంట్లో ఏర్పాటు చేసే గదులివి. వీటిల్లో బాత్రూమ్ మినహా అన్నింటినీ అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవాలనుకుంటారు. బాత్రూమ్ విషయానికొస్తే.. శుభ్రంగా మినహా ఇంటీరియర్ చేయించాలని ఎవరూ అనుకోరు! కానీ, ప్రస్తుత రోజుల్లో ట్రెండ్ మారింది. బాత్రూమ్ను కూడా మిగతా గదుల్లాగే అందంగా, ఆకర్షణీయంగా మార్చేస్తున్నారు. నిజం చెప్పాలంటే.. బాత్ రూమ్‌లో వాడే ప్రతి శానిటరీ ఉత్పత్తుల కోసం లక్షలు ఖర్చు చేస్తున్నారు కూడా!
మ్యూజిక్ వింటూ వచ్చిన పని కానియ్!
బాత్రూమ్లో మహా అయితే ఏముంటాయి? షవర్, టాయిలెట్ బేసిన్, వాష్ బేసిన్, ఇతరత్రా ఏర్పాట్లుంటాయి. కొంత ఉన్నోళ్ల ఇళ్లలో అయితే టబ్, షవర్ ఎన్‌క్లోజర్స్ వంటివి ఉంటాయి. కానీ, నేటి యువతరం శానిటరీ ఉత్పత్తులకు సాంకేతికతను జోడించాయి. బ్లూటూత్ అనుసంధానమైన షవర్, సెన్సార్‌తో కూడిన టాయిలెట్స్, ఫ్యూసెట్స్, ఎలక్ట్రానిక్ బేసిన్స్, బటన్ షవర్స్, బ్లూటూత్ బ్రాత్రూమ్ స్పీకర్, వాల్ హుంగ్ డబ్ల్యూసీ వంటివి ఏర్పాటు చేసుకోవడంలో ఆసక్తి చూపిస్తున్నారు. బ్లూటూత్, సెన్సార్ల అనుసంధానిత శానిటరీ ఉత్పత్తులు కొనుగోలుదారులకు మ్యూజిక్ వింటూ బాత్రూమ్ సౌకర్యాలను వినియోగించుకునే వీలు కలిగిస్తున్నాయన్నమాట.
700 మిలియన్ డాలర్ల పరిశ్రమ..
దేశంలో శానిటరీ వేర్ ఉత్పత్తుల మార్కెట్ సుమారు 700 మిలియన్ డాలర్లుగా ఉంటుందని, ఇందులో కిడ్స్ శానిటరీ విపణి రూ.3 వేల కోట్లుగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రోకా, జాన్సన్, హింద్‌వేర్, టోటో, సెరా, కరోమా, కోహ్లెర్, గోల్ఫ్, జాగ్వార్, గ్రోహె, అమెరికన్ స్టాండర్డ్ వంటి ప్రముఖ కంపెనీలు శానిటరీ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి.
ఇంటీరియర్‌లో బాత్రూమ్ భాగం..
ఇంటీరియర్‌లో బాత్రూమ్ డిజైనింగ్ కూడా ఒక భాగమైపోయింది. స్మార్ట్ లివింగ్ కాన్సెప్ట్ వచ్చాక.. ప్రజలు తమ జీవనశైలిలోనూ స్మార్ట్ను జోడించడం మొదలుపెట్టారు. బాత్రూమ్లో విద్యుత్, నీటి పరిరక్షణ వంటి అంశాలపై దృష్టిపెట్టారని రోకా బాత్రూమ్ ప్రోడక్ట్స్ ప్రై.లి. ఎండీ కేఈ రంఘనాథన్ తెలిపారు. కాంటెంపరరీ బాత్రూమ్లో స్పేస్ తక్కువగానే ఉంటుంది కానీ, సరికొత్త డిజైన్స్, ఆవిష్కరణలు, ఆకృతులతో స్థలాకృతి పెద్దగా అనిపిస్తుంటుంది. ఫ్రెష్ ఎయిర్, వాటర్‌తో బాత్రూమ్ నుంచి బయటికొచ్చిన వాళ్లకు రోజు మొత్తం ఉల్లాసంగా, సరికొత్త ఉత్తేజాన్ని నింపుతుందని నిపుణులు చెబుతున్నారు.