సింగపూర్ నుంచి ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్‌కు వస్తున్నాయి. అనరాక్ క్యాపిటల్ నివేదిక ప్రకారం 2015–18 మధ్య కాలంలో హైదరాబాద్‌కి రూ.10.500 కోట్లు (1.5 బిలియన్ డాలర్లు) పీఈ పెట్టుబడులు వచ్చాయని తెలిపింది. ఇందులో సుమారు రూ.6125 కోట్లు (875 మిలియన్ డాలర్లు) సింగపూర్ పీఈ ఇన్వెస్టర్ల నుంచి వచ్చాయని తెలిపారు. అసెండస్, ఎక్స్యాండర్, జీఐసీ వంటి కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాయి. ఆయా కంపెనీల నుంచి సుమారు రూ.5250 కోట్ల పీఈ పెట్టుబడులు వచ్చాయి.
2018లో బెంగళూరు, చెన్నై నగరాల కంటే హైదరాబాద్‌లో అత్యధికంగా పీఈ పెట్టుబడులు వచ్చాయి. హైదరాబాద్‌లో 7700 కోట్ల పీఈ ఇన్వెస్ట్మెంట్ వస్తే.. బెంగళూరులోకి 2940 కోట్లు, చెన్నైలోకి 4690 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. 2019 తొలి త్రైమాసికంలో ఇప్పటివరకు హైదరాబాద్‌లో యూఏఈకు చెందిన లేక్‌షేర్ రిటైల్ విభాగంలో రూ.308 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చూస్తే.. భాగ్యనగరంలో అసెండస్ చాలా వరకు పెట్టుబడులు కమర్షియల్ ప్రాపర్టీల్లోనే పెట్టింది. ఫోనిక్స్ గ్రూప్‌లో 204 మిలియన్ డాలర్లు, వేవ్‌రాక్ ప్రాజెక్ట్‌లో జీఐసీ 77 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే.
2015–18 మధ్య కాలంలో దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలోకి రూ.90 వేల కోట్ల పీఈ పెట్టుబడులు వచ్చాయి. ఇందులో సింహభాగం ఇన్వెస్ట్మెంట్స్ సింగపూర్ కేంద్రంగానే జరిగాయి. అమెరికాకు చెందిన ఇన్వెస్టర్ల నుంచి సుమారు 48 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.