తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం భూ సంస్కరణ ఆహ్వానించదగ్గ పరిణామమే. కానీ, దాని కంటే ముందుగా భూ రికార్డులను సంస్కరించాలని, లేకపోతే భూ సంస్కరణ సాధ్యమయ్యే పని కాదని కేంద్ర సమాచార మాజీ కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో ‘రెవెన్యూ పాలనలో సంస్కరణలు, భూ రికార్డులు, హక్కులు’ అనే అంశంపై నిర్వహించిన ఒక్క రోజు జాతీయ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. రోజురోజుకూ భూమి విలువ పెరుగుతుండటంతో దేశ వ్యాప్తంగా వివాదాలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటికే న్యాయస్థానాల్లో 3 కోట్లకుపైగా కేసులు పెండింగ్లో ఉంటే అందులో 66 శాతం కేసులు భూ వివాదాలకు సంబంధించినవేనని అన్నారు. యేటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భూములను అమ్ముతూ వేల కోట్ల రూపాయలను అర్జిస్తున్నాయని వీటికి సరైన ఆడిట్ కూడా లేదని అన్నారు. రెవెన్యూ యంత్రాంగానికి అనేక విధులు అప్పగించి అవినీతి చేయడానికి ఆస్కారం కల్పించారని ఇప్పుడు రెవెన్యూ విభాగాన్ని తప్పుపట్టడం ఏంటని ప్రశ్నించారు.
రెట్లు పెరగడం వల్లే వివాదాలు..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి మాట్లాడుతూ భూముల రేట్లు పెరగడంతో వివాదాలు ఎక్కువయ్యాయని ప్రభుత్వ లెక్కల ప్రకారం భూమికి ఒక ధర ఉంటే క్రయవిక్రయాలు జరిగే రేటుకు పొంతన ఉండటం లేదని రానున్న రోజుల్లో గాడిలో పడుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ప్రభుత్వమే క్రయవిక్రయాలు చేపట్టాలి..
ఈ సదస్సులో పాల్గొన్న కేసీఆర్ ముఖ్య ప్రజాసంబంధాల అధికారి జ్వాలా నరసింహారావు మాట్లాడుతూ భూ సమస్యలపై, భూరికార్డులపై పూర్తి అవగాహన ఉన్న ముఖ్యమంత్రి గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు సమస్యలు రాకుండా అనేక సంస్కరణలు ప్రవేశ పెట్టారన్నారు. భూ వివాదాలు తగ్గాలంటే భూమి క్రయవిక్రయాలు ప్రభుత్వమే చేయాలని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ సదస్సలో వైస్ ఛాన్సిలర్ ప్రొఫెసర్ కె. సీతారామారావు, రిజిస్ట్రార్ సి. వెంకటయ్య, అకడమిక్ డైరెక్టర్ ఎ. సుధాకర్, డాక్టర్ పల్లవి తదితరులు పాల్గొన్నారు.