మల్కాజ్గిరి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం దినదినగండంలా సాగుతోంది. శాశ్వత సబ్‌రిజిస్ట్రార్ లేక రిజిస్ట్రేషన్ల మీద ప్రభావం పడుతోంది. ఇన్చార్జి సబ్‌రిజిస్ట్రార్ నియమిస్తే.. వచ్చిన అధికారేమో పట్టుమని వారం రోజులు కూడా విధులు నిర్వహించడం లేదు. సెలవులపై వెళ్లుతుండటంతో సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి.
శామీర్‌పేట, నారాపల్లి నుంచి..
వినాయకానగర్ డివిజన్ వాజ్‌పేయినగర్‌లోని మల్కాజిగిరి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ఉంది. మల్కాజిగిరి ఇన్చార్జి సబ్‌రిజిస్ట్రార్ విజయ్ గత శనివారం దేవరకొండకు బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో శామీర్‌పేట్ సబ్‌రిజిస్ట్రార్ శేషాద్రిచందూను మల్కాజిగిరి ఇన్చార్జిగా అధికారులు నియమించారు. బాధ్యతలు స్వీకరించిన తరువాత రెండు మూడు రోజులు తప్ప ఆయన ఎక్కువ సెలవుల్లో ఉన్నారనే విమర్శలు వినిపిస్తోన్నాయి. తాజాగా మంగళవారం నారపల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి సీనియర్ అసిస్టెంట్ స్వామికి ఇక్కడ ఇన్చార్జి సబ్‌రిజిస్ట్రార్ బాధ్యతలు అప్పగించారు. దీంతో రెగ్యులర్ సబ్‌రిజిస్ట్రార్ లేకపోవడం.. ఇన్చార్జి సబ్‌రిజిస్ట్రార్ సెలవుల్లో ఉండటం వల్ల ఇళ్లు, భూముల రిజిస్ట్రేషన్లు మందకోడిగా జరుగుతున్నాయి. ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ ఆదాయం తగ్గటంతోపాటు రిజిస్ట్రేషన్లలో ఆలస్యంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఉన్నతాధికారులు రెగ్యులర్ సబ్‌రిజిస్ట్రార్‌ను నియమించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.