Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

మెట్రో మార్గంలో రియల్టీ వృద్ధి!

సౌకర్యం, కనెక్టివిటీ.. ఇవే మెట్రో రైలు ప్రత్యేకతలు. రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధి చెందేందుకు కావాల్సినవి కూడా ఇవే. అంటే ప్రయాణ సౌకర్యం, అందుబాటు ధర ఉన్న ప్రాంతాల్లోని గృహాలకే డిమాండ్‌ ఉంటుందని దీనర్థం. మెట్రో రైల్‌ పరుగులు పెడుతున్న మార్గంలో రియల్‌ ఎస్టేట్‌ జోష్‌లో ఉంది.
మెట్రోకు ముందు.. తర్వాత
హైదరాబాద్‌ స్థిరాస్తి రంగాన్ని మెట్రోకు ముందు, మెట్రోకు తర్వాత అని విభజించే రోజులొచ్చేశాయి. మెట్రోకు ముందు గురించి మాట్లాడితే.. 95 శాతం ఉద్యోగ అవకాశాలు, వృద్ధి కేవలం పశ్చిమ ప్రాంతంగానే జరిగేవి. దీంతో ఇన్నాళ్లూ ఆయా ప్రాంతాల్లో ఇల్లు కొనేందుకో లేక అద్దెకుండేందుకో కొనుగోలుదారులు ఆసక్తి చూపించేవారు. ఇప్పుడు మెట్రో తర్వాత గురించి మాట్లాడితే.. మెట్రో కారణంగా తూర్పు, పశ్చిమ ప్రాంతాలు అనుసంధానమయ్యాయి. అంటే ఇన్నాళ్లూ పశ్చిమ ప్రాంతాల్లోని ఆఫీసులకు వెళ్లేందుకు ఆపసోపాలు పడ్డ ఉద్యోగులు ఇప్పుడు ఇతర ప్రాంతాల్లో అందుబాటు గృహాలను కొనుగోలు చేసి హ్యాపీగా మెట్రోలో ప్రయాణించేస్తారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే పశ్చిమంలో ధరలెక్కువ. మెట్రోతో కనెక్టివిటీ సులువు కావడంతో తక్కువ ధరకు ఎక్కువ విస్తీర్ణంలోని ఫ్లాట్లను, ఇండిపెండెంట్‌ గృహాలు కొనుగోలు చేసే వీలుంటుంది. మొత్తం మీద మెట్రో పరుగులతో హైదరాబాద్‌ నలువైపులా అందుబాటు గృహాలకు డిమాండ్‌ పెరుగుతుందన్నమాట. అదీ మ్యాటర్‌!
అందుబాటు గృహాలకు డిమాండ్‌..
రియల్టీ అమ్మకాలకు ప్రధాన వనరులు ఐటీ ఉద్యోగులే. కానీ, 60 శాతానికి పైగా ఐటీ ఉద్యోగులు రూ.40 వేల లోపు వేతనాల వాళ్లే. వీరందరూ ఐటీ హబ్‌లకు చేరువలో నివాసాలను కొనుగోలు చేయలేని పరిస్థితి. దీంతో ఇన్నాళ్లూ ఆయా ప్రాంతాల్లో అద్దెలకు ఉండటమో లేక శివారు ప్రాంతాల్లో తక్కువ ధరల్లో ఇళ్లను కొనుగోలు చేసి రోజూ ఎంఎంటీఎస్, బస్సు, క్యాబ్స్‌లో ప్రయాణించేవాళ్లు. కానీ, ఇప్పుడు మెట్రోతో ఐటీ హబ్‌ కనెక్టివిటీ పెరిగింది. దీంతో పశ్చిమ ప్రాంతాల్లో అద్దెకుండటం బదులు ఇతర ప్రాంతాల్లో ఇల్లు కొనేందుకు ముందుకొస్తారని నిపుణులు చెబుతున్నారు.


మెట్రో కారిడార్లలో ధరలెక్కువ..
మెట్రో ఉన్న ప్రాంతాలకు, లేని ప్రాంతాలకు మధ్య ధరల్లో 15 శాతం తేడా ఉంటుంది. ఉదాహరణకు కొంపల్లి, సైనిక్‌పురి ప్రాంతాల్లో చ.అ.కు ధర రూ.2,500లుగా ఉంటే.. మెట్రో కారణంగా ఉప్పల్‌ ప్రాంతంలో చ.అ.కు రూ.3,500లుగా ఉందన్నారు. మెట్రో కారిడార్లే కాకుండా స్టేషన్‌ నుంచి 3–5 కి.మీ. దూరంలోని నివాసాలకూ డిమాండ్‌ ఉంటుందన్నారు. ఉదాహరణకు కూకట్‌పల్లి మెట్రో వద్ద చ.అ.కు రూ.4,500లుగా ఉంది. అదే 3 కి.మీ. దూరంలో ఉన్న గాజులరామారంలో చ.అ.కు రూ.3,500 వరకుంది. అంటే కొంత దూరమైన అందుబాటు ధరల్లో అది కూడా ప్రీమియం గృహాలను కొనుగోలు చేసే వీలుంటుంది. మెట్రోతో నివాసాలకే కాకుండా వాణిజ్య, ఆఫీసు సముదాయాలకూ గిరాకీ ఉంటుంది. ఆయా కారిడార్లలోని చిన్న షాపింగ్‌ మాల్స్‌కు స్కై వాల్‌ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో నేరుగా మెట్రో నుంచి ఆయా షాపింగ్‌ మాల్స్‌కు వెళ్లే వీలుంటుంది.

Related Posts

Latest News Updates