ప్రస్తుతం మన దేశంలో 633 కోట్ల చ.అ.ల్లో 4,794 హరిత భవనాలున్నాయి. 2022 నాటికి వెయ్యి కోట్ల చ.అ.లకు చేర్చాలన్నది లక్ష్యం. విభాగాల వారీగా పరిశీలిస్తే.. 12.50 లక్షల నివాస భవనాలు, 250 ఫ్యాక్టరీలు, 1,600 కార్యాలయాలు, 45 టౌన్షిప్స్, 335 ట్రాన్సిట్స్, 13 గ్రామాలు, 8 నగరాలు గ్రీన్ బిల్డింగ్స్గా గుర్తింపు పొందాయి. తెలంగాణలో హరిత భవనాల గణాంకాలను పరిశీలిస్తే.. 13 కోట్ల చ.అ.ల్లో 310 ఐజీబీసీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అసెండస్ వీఐటీ పార్క్, హెచ్ఎంఆర్ఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఆర్బీఐ సీనియర్ ఆఫీసర్స్ క్వాటర్స్ వంటివి వీటిల్లో కొన్ని. ఇటీవలే ట్రాన్సిట్ విభాగంలో 17 హైదరాబాద్ మెట్రో స్టేషన్లు గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ పొందాయి.300 బిలియన్ డాలర్లకు పరిశ్రమ..ఫ్లయాష్ బ్రిక్స్, వాల్ అండ్ రూఫ్ ఇన్సులేషన్, లో వీఓసీ పెయింట్స్, సీఆర్ఐ సర్టిఫైడ్ కార్పెట్స్, ఎఫ్ఎస్సీ సర్టిఫైడ్ వుడ్, గ్లాస్ వంటివి హరిత భవనాల నిర్మాణ సామగ్రి. వాటర్లెస్ యూరినల్స్, సీఓ2 సెన్సార్, విండ్ టవర్స్ వంటివి గృహ ఉత్పత్తుల కిందికి వస్తాయి. 90 శాతం హరిత భవనాల నిర్మాణ సామగ్రి మన దేశంలోనే లభ్యమవుతున్నాయి. 2025 నాటికి దేశంలో హరిత భవనాల నిర్మాణ సామగ్రి పరిశ్రమ 300 బిలియన్ డాలర్లకు చేరుతుందని పరిశ్రమ వర్గాల అంచనా.ఇతర రాష్ట్రాల్లో రాయితీలు..దేశంలోని చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వాలు హరిత భవనాలకు రాయితీలను అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఐజీబీసీ గుర్తింపు పొందిన భవనాలకు పర్మిట్ ఫీజులో 20 శాతం, స్టాంప్ డ్యూటీ సర్చార్జీలో 20 శాతం తగ్గుదల ఉంది. అలాగే చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ), భారీ పరిశ్రమలకు మూలధన పెట్టుబడి మీద 25 శాతం సబ్సిడీ కూడా ఉంది. ఇతర రాష్ట్రాల్లో గమనిస్తే.. రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్ 5 శాతం అదనపు ఫ్లోర్ ఏరియా రేషియో (ఎఫ్ఏఆర్), మహారాష్ట్ర, జార్ఖండ్లో 3–7 శాతం, హర్యానాలో 9–15 శాతం, హిమాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్లో 10 శాతం ఎఫ్ఏఆర్ ఉంది.– కేంద్ర ప్రోత్సాహకాలు గమనిస్తే.. ఐజీబీసీ గుర్తింపు పొందిన ఎంఎస్ఎంఈలకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ ప్రమోషన్ (డీఐపీపీ), కేంద్ర పరిశ్రమ శాఖ నుంచి రూ.2 లక్షల వరకు నగదు ప్రోత్సాహకం ఉంది. అలాగే సిడ్బీ బ్యాంక్ నుంచి వడ్డీ రేట్లలో మినహాయింపు కూడా ఉంది.– గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అనుమతులు త్వరగా వస్తాయి.