Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

మోదీ 2.ఓ బడ్జెట్‌ రియల్టీకి ఏం తీసుకొచ్చింది?

అందుబాటు గృహాలను (అఫడబుల్‌ హౌజింగ్‌) దృష్టిలో పెట్టుకొని బడ్జెట్‌ను మోదీ 2.ఓ బడ్జెట్‌ను రూపొందించారు. ఆర్ధికాభివృద్ధిలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి అత్యంత కీలకం. మౌలిక సదుపాయాల అభివృద్ధే ప్రభుత్వ ఎజెండా. దీన్నే ఫోకస్‌ చేస్తూ నిర్మలా సీతారామన్‌ తొలి బడ్జెట్‌ను రూపొందించారు.
లాజిస్టిక్, వేర్‌హౌజ్‌లకు ఊతం..
పారిశ్రామిక కారిడార్లు, ప్రత్యేకమైన సరుకు రవాణా కారిడార్లు, రైల్వే, ఎయిర్‌ లైన్స్‌ కారిడార్లలో మౌలిక వసతుల అభివృద్ధికి ఫోకస్‌ చేసింది. ఇందుకోసం వచ్చే ఐదేళ్లలో రూ.100 కోట్లను కేటాయించింది. దీంతో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో లాజిస్టిక్, వేర్‌ హౌజ్‌ విభాగాలకు డిమాండ్‌ పెరుగుతుందని అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెన్సీ చైర్మన్‌ అనూజ్‌ పురీ తెలిపారు. పునర్వినియోగ ప్లాస్టిక్‌ గ్రీన్‌ టెక్నాలజీ వినియోగంతో రోడ్ల నిర్మాణాన్ని ప్రతిపాదించింది. 30 వేల కి.మీ. నిర్మించనున్నారు. దీంతో రోడ్ల నిర్మాణ వ్యయాన్ని తగ్గుతుంది. పర్యావరణహితమైన రోడ్లను ప్రతిపాదించింది.
వడ్డీ రాయితీ పెంపు..
అందుబాటు గృహాలకు (అఫడబుల్‌ హౌజింగ్‌) వడ్డీ మినహాయింపును రూ.3.5 లక్షలకు పెంచారు. ఇది తొలిసారి గృహ కొనుగోలుదారులను ఆకర్షిస్తుంది. రూ.45 లక్షల లోపు గృహాలను కొనుగోలు చేసే వారికి ఈ వడ్డీ రాయితీ అందుతుంది. ప్రధాన్‌మంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) గ్రామీణంలో 2020–22 ఆర్ధిక సంవత్సరంలో లబ్ధిదారులకు 1.95 కోట్ల గృహాలను అందించాలని నిర్ణయించారు. అలాగే గతంలో 2015–16లో పీఎంఏవై కింద ఒక గృహ నిర్మాణానికి 314 రోజుల సమయాన్ని ప్రతిపాదించింది. కానీ, 2017 నుంచి దీన్ని 114 రోజులకు తగ్గించేసింది. అంటే నిర్మాణంలో వేగం పెంచింది. అందుబాటు గృహాల నిర్మాణాల వైపు డెవలపర్లను ఆకర్షించేందుకు ప్రభుత్వ స్థలాలను కేటాయించనున్నారు. జాయింట్‌ డెవలప్‌మెంట్‌ కింద వీటిని నిర్మిస్తారు. ఇప్పటికే నిరుపయోగంగా ఉన్న స్థలాలను గుర్తించాలని అన్ని ప్రభుత్వ విభాగాలను ఆదేశించారు. దేశవ్యాప్తంగా కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఉన్న స్థలాల్లో మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో అందుబాటు గృహాల నిర్మాణానికి స్థానిక డెవలపర్లు ముందుకొచ్చే అవకాశముందని క్రెడాయ్‌ మాజీ జాతీయ అధ్యక్షుడు సి. శేఖర్‌ రెడ్డి తెలిపారు.
రెంటల్‌ పాలసీతో జోష్‌..
తాజా బడ్జెట్‌లో పాత రెంటల్‌ పాలసీలో సంస్కరణలు చేయాలని నిర్ణయించారు. త్వరలోనే నేషనల్‌ అర్బన్‌ రెంటల్‌ హౌజింగ్‌ పాలసీని తీసుకురానున్నారు. దీంతో గృహాల సరఫరా తక్కువగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో అద్దె గృహాలను సరఫరా పెరుగుతుంది. అద్దె గృహాలను పెంచేందుకు స్పష్టమైన ప్రోత్సాహాకాలు ఉంటాయి. ఈ పాలసీని అన్ని రాష్ట్రాల్లో అమలుకు చర్యలు తీసుకుంటారు. హౌజింగ్‌ ఫర్‌ ఆల్‌ను వేగవంతం చేసేందుకు అద్దె గృహాలను వినియోగించుకునే అవకాశం ఉంది.
స్టూడెంట్‌ హౌజింగ్‌కు డిమాండ్‌..
నివాస విభాగంలో స్టూడెంట్‌ హౌజింగ్‌కు డిమాండ్‌ను సృష్టిస్తుంది. ఉన్నత విద్యారంగంలో విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు స్టడీ ఇన్‌ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఇందుకోసం ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.400 కోట్లను కేటాయించింది. దీంతో స్టూడెంట్‌ హౌజింగ్‌కు డిమాండ్‌ పెరుగుతుంది. పెట్టుబడులకు అవకాశాలు కల్పించింది. హౌజింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల నియంత్రణ అధికారాలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి నేషనల్‌ హౌజింగ్‌ బోర్డ్‌ (ఎన్‌హెచ్‌బీ)కి బదిలీ చేశారు. దీంతో పారదర్శకత నెలకొంటుంది. అతిక్రమణలను తగ్గించడంతో పాటూ నియంత్రణ సులువవుతుంది.
రిటైల్, హాస్పిటాలిటీలో వృద్ధి..
చిన్న రిటైలర్ల రిజిస్ట్రేషన్‌ విధానాన్ని సులభతరం చేశారు. సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌ కోసం స్థానిక సోర్సింగ్‌ నిబంధనలను సరళీకృతం చేశారు. దీంతో భవిష్యత్తులో రిటైల్‌ రంగానికి ప్రయోజనం చేకూరుతుంది. అసంఘటిత రిటైల్‌ రంగంలో ఊత్సాహం నెలకొంటుంది. ఆతిధ్య రంగాన్ని ప్రోత్సహించేందుకు 17 ఐకానిక్‌ పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయనుంది. దీంతో దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇది ఆతిధ్య రంగానికి బూస్ట్‌నిస్తుంది.
ముడి ఉత్పత్తుల ధరల పెరుగుదల..
ఈసారి బడ్జెట్‌లో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి మౌలిక రంగ హోదా ప్రతిపాదన ఊసేలేదు. పన్నులు, భూముల విధానాల్లో ఎలాంటి సంస్కరణలు చేయలేదు. పైగా పీవీసీ, వినైల్‌ ఫ్లోరింగ్‌ షీట్స్, టైల్స్‌ వంటి నిర్మాణ ముడి సరకుల దిగుమతి సుంకాన్ని పెంచారు. ముడి ఉత్పత్తుల మీద 1 శాతం ఇన్‌ఫ్రా సర్‌చార్జీని పెంచారు. దీంతో డెవలపర్లకు నిర్మాణ వ్యయం పెరుగుతుంది. అంతిమంగా కొనుగోలుదారులకు ధరలు పెరిగే ప్రమాదముంది.

Related Posts

Latest News Updates