స్విమ్మింగ్ పూల్, జిమ్, క్లబ్‌హౌజ్ వంటి ఆధునిక వసతుల వల్ల కొందరు..
నాణ్యమైన నిర్మాణం, నిర్వహణ, భద్రతల వల్ల ఇంకొందరు..
.. ఏదేమైనా మనలో చాలా మంది బహుళ అంతస్తుల్లో నివాసానికి కారణాలివే. అలా అని అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనడంతోనే కోరిక తీరినట్టు కాదండోయ్. మీ ఇంటి అన్‌డివైడెడ్ షేర్ (యూడీఎస్) ఎంతనేది ముందే తెలుసుకోవాలి. అగ్రిమెంట్లో యూడీఎస్‌ను ప్రస్తావించారో లేదో కూడా పరిశీలించాలి కూడా. ఎందుకంటే మీ ఇంటి విలువను లెక్కించేది, ఇంటి విలువ పెరిగేది కూడా యూడీఎస్తోనే మరి!!
ఫ్లాట్ కొనేముందు విస్తీర్ణం, వసతులు, లొకేషన్, వాస్తు వంటి వాటిపై శ్రద్ధ చూపినంతగా.. యూడీఎస్ మీద శ్రద్ధ చూపించరు కొనుగోలుదారులు. వాస్తవానికి స్థిరాస్తి కొనుగోళ్లలో యూడీఎస్ అనేది చాలా ముఖ్యమైంది. భూకంపాలు, తుఫాన్ వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు (లేదా) ఏదైనా ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ప్రభుత్వం మీ ప్రాపర్టీని తీసుకున్నప్పుడు మీకిచ్చే పరిహారం యూడీఎస్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే అగ్రిమెంట్లో మీ ఇంటి యూడీఎస్ ఎంతనేది స్పష్టంగా ఉండాలన్నమాట.
యూడీఎస్ అంటే..
అపార్ట్మెంట్లోని ఒక్కో ఫ్లాట్‌కు కేటాయించిన స్థలమే యూడీఎస్. అంటే అపార్ట్మెంట్ నిర్మించిన స్థలంలోని అవిభాజ్య వాటానే యూడీఎస్ అన్నమాట. ఫ్లాట్ విస్తీర్ణాన్ని బట్టి యూడీఎస్ కూడా మారుతుంది. యూడీఎస్ అనేది ఫ్లాట్ యజమాని పేరు మీద రిజిస్టరై ఉంటుంది. అయితే కొన్ని నిర్మాణాల్లో భవనం ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ)ని బట్టి కూడా యూడీఎస్ మారుతుందండోయ్.
ఎవరైనా.. ఎక్కడైనా సరే ఫ్లాట్ కొనుగోలు చేసేముందు రెండు విషయాలు గుర్తుంచుకోవాలి.
- ప్రాజెక్ట్ మొత్తం స్థలం ఎంత? ఎంత భాగంలో భవనాన్ని నిర్మించారు?
- ప్రాపర్టీ ధర పెరిగిందంటే అది ల్యాండ్ విలువ పెరిగిందని అర్థం. అంతే తప్ప బిల్డింగ్ విలువ పెరిగిందని కాదు. అంటే ప్రాపర్టీ పెరుగుదల అనేది యూడీఎస్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట.
యూడీఎస్‌ను ఎలా లెక్కిస్తారు?
యూడీఎస్ లెక్కింపు అనేది అపార్ట్మెంట్ సూపర్ బిల్టప్ ఏరియా మీద ఆధారపడి ఉంటుంది. అంటే అపార్ట్మెంట్లోని అన్ని ఫ్లాట్ల సూపర్ బిల్టప్ ఏరియాలూ లెక్కలోకొస్తాయన్నమాట. ఉదాహరణకు 2,400 చ.అ. స్థలంలో 4 ఫ్లాట్ల అపార్ట్‌మెంట్‌ను నిర్మించారనుకుందాం. ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం 1,000 చ.అ.లనుకుందాం. ఇప్పుడీ నాలుగు ఫ్లాట్ల యూడీఎస్ ఎంతంటే?
యూడీఎస్ = ఒక్కో ఫ్లాట్ సూపర్ బిల్టప్ ఏరియా/ అన్ని ఫ్లాట్ల సూపర్ బిల్టప్ ఏరియా ఇంటు మొత్తం ల్యాండ్ ఏరియా
1,000 ఇంటు 2,400/4,000
అంటే ఒక్కో ఫ్లాట్ యూడీఎస్ 800 చ.అ.