హైదరాబాద్‌కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ బ్యాంక్‌కు కుచ్చుటోపీ పెట్టింది. మినర్వా ఎగ్జిక్యూటివ్ అపార్ట్మెంట్స్ ప్రై.లి. తప్పుడు పత్రాలను సృష్టించి.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) నుంచి రూ.168 కోట్ల రుణాన్ని తీసుకుంది. దీంతో మినర్వా అపార్ట్మెంట్స్ మీద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) క్రిమినల్ కేసును నమోదు చేసింది.
ఎండీ, డైరెక్టర్ల మీద కేసులు
మినర్వా అపార్ట్మెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) పీ చక్రధర్ రెడ్డి, డైరెక్టర్లు పీ లక్ష్మి శ్రుతి, ఏ విజయవర్ధన్ రెడ్డిల మీద సీబీఐలోని బ్యాంక్ సెక్యూరిటీ అండ్ ఫ్రాడ్ కేస్ విభాగం అధికారులు నేరారోపణ, చీటింగ్, మోసగించడం, నకిలీ పత్రాలు, నేరపూరిత కుట్ర కేసులను బుక్ చేశారు.
బెంగళూరులో సర్వీస్ అపార్ట్మెంట్స్
మినర్వా అపార్ట్మెంట్స్ బెంగళూరులో సర్వీస్ అపార్ట్మెంట్స్ నిర్మాణానికి ప్రణాళికలు చేసింది. ఇందులో 100 గదులు, రెస్టారెంట్, బార్, బిజినెస్ సెంటర్, ఫిట్నెస్ సెంటర్ వంటివి ఉంటాయి. దశల వారీగా యూబీఐ నుంచి రూ.168 కోట్ల రుణాన్ని తీసుకుంది. అయితే సంస్థ బ్యాంక్‌కు రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైంది. ఈ నిధులను ఇతర వ్యాపారాలకు మళ్లించారని సీబీఐ అధికారులు తెలిపారు.