హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఫుల్ జోష్‌లో ఉంది. ఎన్నికల వాతావరణంలో గత 3–4 నెలలుగా స్తబ్ధుగా ఉన్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ విభాగంలో మళ్లీ సందడి నెలకొంది. స్థిరమైన ప్రభుత్వం ఏర్పడటంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ రియల్ బూమ్ వచ్చింది. హైదరాబాద్‌తో సహా వరంగల్, కరీంనగర్ వంటి ద్వితీయ శ్రేణి ప్రాంతాల్లో స్థిరాస్తి లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్), రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) పరిసర ప్రాంతాల్లో భూముల అమ్మకాలు జోరందుకున్నాయి. స్థానిక పెట్టుబడిదారులే కాకుండా ఢిల్లీ, ముంబై వంటి ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన బడా నిర్మాణ సంస్థలు, పెట్టుబడిదారులు ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ ప్రాంతాల్లో భారీ స్థాయిలో భూములను కొంటున్నారని తెలంగాణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ విభాగం తెలిపింది.
తెలంగాణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగం లెక్కల ప్రకారం.. 2017–18లో తెలంగాణలో 11.6 లక్షల రిజిస్ట్రేషన్స్ కాగా.. 2018–19లో 16.5 లక్షల రిజిస్ట్రేషన్స్ జరిగాయి. ఇక, స్థూల ఆదాయ గణాంకాలను పరిశీలిస్తే.. 2014–15లో 2746 కోట్లు, 2015–16లో 3786 కోట్లు, 2016–17లో 4249 కోట్లు, 2017–18లో 5177 కోట్లు, 2018–19లో 6612 కోట్లు ఆదాయాన్ని గడించింది.
మార్కెట్ విలువల పెంపు..
తెలంగాణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ విభాగం ఆదాయాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్నేళ్లుగా మార్కెట్ విలువలను పెంచలేదు. విలువలను పెంచితే.. మరింత ఆదాయం సమకూరుతుందని నిర్ణయించింది. అధికారిక మార్కెట్ రేట్లను పెంచాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ కూడా రాసినట్లు సమాచారం. 2013 నుంచి తెలంగాణలో అధికారిక మార్కెట్ విలువలను సవరించలేదు. దీంతో చాలా వరకు రియల్ ఎస్టేట్ లావాదేవీలు బ్లాక్‌మనీ రూపంలో జరుగుతున్నాయని.. కేవలం రిజిస్ట్రేషన్ విలువలను మాత్రమే వైట్ మనీ రూపంలో జరుపుతున్నారని సమాచారం.