Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

రిటైర్మెంట్‌ హోమ్స్‌ @ 25 బిలియన్‌ డాలర్లు!

ప్రపంచ వ్యాప్తంగా రిటైర్మెంట్‌ హోమ్స్‌ మార్కెట్‌ విలువ ఏకంగా 25 బిలియన్‌ డాలర్లు. అమెరికాలోని సీనియర్‌ సిటిజన్స్‌లో 12 శాతం మంది వీటిలోనే ఉంటున్నారు. ఆస్ట్రేలియాలో వీరి వాటా 4 శాతం. 100 కోట్ల జనాభా దాటిన మన దేశంలో 3 లక్షల రిటైర్మెంట్‌ హోమ్స్‌ అవసరమవుతాయని, వీటి విలువ బిలియన్‌ డాలర్ల పైనేనన్నది ప్రాపర్టీ కన్సల్టెన్సీ జోన్స్‌లాంగ్‌ లాసెల్లె అంచనా. మన దేశంలో 60 ఏళ్లకు పైబడిన వారి జనాభా దాదాపు 10 కోట్లు. ఏటా 3.8 శాతం పెరుగుతోంది. దీంతో 2050 నాటికి 24 కోట్లకు చేరుతుందని అంచనా. భవిష్యత్తులో దేశంలో రిటైర్మెంట్‌ హోమ్స్‌కు ఉండబోయే డిమాండ్‌కు ఈ అంకెలే నిదర్శనం.
వృద్ధాశ్రమాలతో పోలికే లేదు…
రిటైర్మెంట్‌ హోమ్స్‌ గురించి విన్నవారెవరైనా… వృద్ధాశ్రమాల్లాంటివేగా…!! అని అనుకోవచ్చు. కానీ ఈ రెండింటికీ ప్రధానమైన తేడా ఏంటంటే ఈ రిటైర్మెంట్‌ హోమ్స్‌లో ఫ్లాట్‌ కొన్నవారో లేకపోతే అద్దెకు తీసుకున్నవారో మాత్రమే ఉంటారు. నిర్వహణ రుసుం చెల్లించి అన్ని సౌకర్యాలూ పొందవచ్చు. ఆరోగ్య సమస్యలు తలెత్తితే అపార్ట్‌మెంట్‌లోనే ప్రాథమిక చికిత్సా కేంద్రం ఉంటుంది. 24 గంటలు అంబులెన్స్, రెసిడెంట్‌ నర్సు, వైద్యుడు అందుబాటులో ఉంటారు. అనారోగ్యం తలెత్తితే క్షణాల్లో దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళుతారు. వారానికోసారి డాక్టరొచ్చి అందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు కూడా. నడక కోసం గ్రీన్‌ స్పేస్‌తో పాటు హాబీ సెంటర్, కమ్యూనిటీ కిచెన్, సిమ్మింగ్‌ పూల్, యోగా కేంద్రాలు, ఏటీఎం, సూపర్‌ మార్కెట్,  గ్రంథాలయం వంటి సౌకర్యాలన్నీ రిటైర్మెంట్‌ హోమ్స్‌లో ఉంటున్నాయి. వీటిలో ఉండే వారు ఏ అవసరానికీ బయటికి వెళ్లాల్సిన పనిలేదు. నివాసితులు బృందాలుగా ఏర్పడి సంఘసేవ, గార్డెనింగ్‌ చేయొచ్చు. అపార్ట్‌మెంట్‌ వాహనంలో పుణ్యక్షేత్రాలు, విహార  యాత్రలకు కూడా వెళ్లొచ్చు. ఇక వినోదానికి ఇండోర్‌ థియేటర్, ఓపెన్‌ థియేటర్‌లు సైతం వీటిలోనే ఉంటాయి.
క్రమం తప్పని మెను..
రిటైర్మెంట్‌ హోమ్స్‌లో వృద్ధులు వంట చేసుకోనక్కర్లేదు. ఉదయం 5 గంటల కల్లా టీతో మొదలుపెట్టి… టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం 4 గంటలకు టీ, బిస్కెట్లు, రాత్రి భోజనం ఇలా అన్నీ సరైన వేళల్లో అందిస్తారు. మెస్‌కు వచ్చి భోజనం చేయలేని వారికి ఫ్లాట్‌కే పంపిస్తారు. కావాల్సిన వారికి ఇంట్లోనే పైపులైన్లో గ్యాస్‌ అందుబాటులో ఉంటుంది. కరెంటు పొదుపు, వ్యర్థాలను మళ్లీ వాడటం, ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల ద్వారా నీటిని శుద్ధి చేయడం వంటివి మామూలే. ఇంట్లో పనులకు, బట్టలు ఉతకడానికి ప్రత్యేకించి పనిమనిషులుంటారు. 24 గంటలూ సీసీ కెమెరాల నీడలో కట్టుదిట్టమైన భద్రతా ఉంటుంది.
నిర్మాణంలోనే ప్రత్యేక ఏర్పాట్లు…
నిర్మాణ సమయంలోనే ఈ ఫ్లాట్లను వృద్ధులకు తగ్గట్టుగా తీర్చిదిద్దుతారు. ఇవి ఐదు అంతస్తుల్ని మించవు. వెడల్పాటి తలుపులు, పెద్ద బాత్రూమ్‌లు, వీల్‌ చైర్స్‌ వెళ్లేలా మెట్లు, విశాలమైన లిఫ్ట్‌లుంటాయి. మోకాళ్ల నొప్పులున్న వారికి ఫ్లాట్స్‌లో ప్రత్యేకమైన టాయ్‌లెట్స్‌ ఉంటాయి. బాత్రూమ్, బెడ్‌ రూమ్, కారిడార్లలో గ్రాబ్‌ బార్స్‌తో పాటు అత్యవసర సమయాల్లో వినియోగించే ప్యానిక్‌ బజర్లూ ఉంటాయి. గ్రాబ్‌ బార్స్‌తో వృద్ధులు సులువగా నడవటం, కూర్చోవటం చేయొచ్చు. ప్రాజెక్ట్‌ అంతా యాంటీ స్కిడ్‌ ఫ్లోరింగే ఉంటుంది. ఒకవేళ కిందపడితే ఎక్కడికక్కడ ఉండే ప్యానిక్‌ బటన్‌ను నొక్కితే చాలు. సెక్యూరిటీ దగ్గర అలారం మోగి… వారు అప్రమత్తమై ఫ్లాట్‌కు చేరుకుంటారు.
పదేళ్ల ముందు కొంటే మంచిది
రిటైరవటానికి 5–10 ఏళ్ల ముందు ఈ హోమ్స్‌ను కొంటే చాలనేది నిపుణులు సూచన.  ఎందుకంటే వివిధ కారణాల వల్ల రియల్టీ ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి. అలాకాక 60 ఏళ్లు దాటాక కొనుగోలు చేస్తే గృహ రుణం పొందటం కష్టం. పొందినా ఈఎంఐల భారం ఎక్కువ. అధిక ఫ్లాట్‌ విస్తీర్ణాలతో పాటు ప్రత్యేక వసతులుంటాయి కనక సాధారణ ఫ్లాట్లతో పోలిస్తే రిటైర్మెంట్‌ హోమ్స్‌ ధర 10–15 శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని ఏ వయసువారైనా కొనొచ్చు. కానీ వాటిలో ఉండాలంటే మాత్రం 55 ఏళ్లు దాటాల్సిందే. ఒకవేళ భవిష్యత్‌ కోసం చిన్న వయసు వారు కొంటే… దాన్ని 55 ఏళ్లు దాటినవారికి అద్దెకో, లీజుకో ఇవ్వొచ్చు. ప్రాపర్టీ అమ్మాలనుకున్నా సీనియర్‌ సిటిజన్స్‌కే అమ్మాలి. 
దీన్ని మరిచిపోవద్దు సుమా
రిటైర్మెంట్‌ హోమ్స్‌లోని ప్రత్యేక వసతుల నిమిత్తం ముందుగా ప్రీమియం చెల్లించాల్సిన పనిలేదు. ప్రాజెక్టు పూర్తయితే బిల్డరే నిర్వహణకు ముందుకొస్తారు. ఒకవేళ రాకున్నా… ఫ్లాట్‌ ఓనర్ల అసోసియేషన్‌ ఈ నిర్వహణను చేపడుతుంది. 
అయితే ఇక్కడొకటి గుర్తుంచుకోవాలి. సాధారణ ప్రాజెక్ట్‌లతో పోలిస్తే రిటైర్మెంట్‌ హోమ్స్‌ను విక్రయించడం కాస్త కష్టమే. ఎందుకంటే వీటి నిర్వహణ వ్యయం ఎక్కువ.  పైపెచ్చు నిర్వహణ సరిగ్గా లేకుంటే ధర కూడా పడిపోతుంటుంది. సాధారణ నివాస ప్రాజెక్ట్‌లతో పోలిస్తే వీటి నిర్వహణ చార్జీలు 40–50 శాతం ఎక్కువ. దాదాపు నెలకు చదరపు అడుక్కి రూ.8–10 వరకూ వసూలు చేస్తుంటారు.

Related Posts

Latest News Updates