రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)లో నమోదైన ప్రాజెక్ట్‌లకు సంబంధించి ఏమైనా కేసులు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)కి వస్తే.. ముందుగా సంబంధిత రెరా అథారిటీకి సమాచారం అందించాలని మహారాష్ట్ర రెరా చీఫ్ గౌతమ్ చటర్జీ కోరారు.
కొనుగోలుదారులకు నష్టం..
ఎన్సీఎల్టీలో కేసు నమోదైతే సెక్షన్–14 ప్రకారం 6–9 నెలల పాటు ప్రాజెక్ట్‌లో ఎలాంటి కార్యకలాపాలు, లావాదేవీలు జరగవు. ఇది ఆయా నిర్మాణ సంస్థలకు ఆర్థిక ఇబ్బంది. ఒకవేళ ఐబీసీ కింద దివాళా ప్రక్రియకు ఆదేశిస్తే 30–50 శాతం నష్టాలు తప్పవు. ఐబీసీ కింద గృహ కొనుగోలుదారులు కూడా క్రెడిటర్స్ (రుణదాతలు) కాబట్టి వీళ్లూ 50 శాతం నష్టపోవాల్సి వస్తుంది. అందుకే ఎన్సీఎల్టీ కేసును ఆమోదించకముందే రెరాకు నివేదించాలని ఆయన సూచించారు. సమస్యను పరిష్కరించేందుకు అథారిటీకి 3–4 నెలల సమయం ఇవ్వాలని, అప్పటికీ పరిష్కారం కాకపోతే ఎన్సీఎల్టీ కేసును నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
రెరా ఫలితాలు అప్పుడే..
రెరా అసలైన ఫలితాలు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లన్నీ నమోదయ్యాకే మొదలవుతాయని రెరా మధ్యప్రదేశ్ చైర్మన్ ఆంటోనీ డీ సా అన్నారు. మధ్యప్రదేశ్‌లో నమోదు కానీ ప్రాజెక్ట్‌లను గుర్తించి రెరాకు సమాచారం అందించేందుకు ఇన్ఫార్మర్స్ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు.