Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

రియల్టీ మీద మోడీ ప్రభావం ఉంటుందా?

2014–19 మధ్య కాలం దేశీయ రియల్‌ ఎస్టేట్‌ చరిత్రలో మరిచిపోలేదు. 2014లో ప్రధానిగా పగ్గాలు చేపట్టిన నరేంద్ర మోడీ.. తన ఐదేళ్ల కాలంలో రియల్టీ రంగంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. పెద్ద నోట్ల రద్దు నుంచి రెరా, బినామీ యాక్ట్, జీఎస్‌టీ, రీట్స్‌ వరకూ! వీటిల్లో ప్రతి ఒక్కటీ స్థిరాస్తి రంగం మీద ప్రభావాన్ని చూపించినవే. తాజాగా రెండోసారి మోడీ అధికారంలోకి వచ్చారు. ఈ ఐదేళ్లు మాత్రం స్థిరాస్తి రంగానికి జీవం పోస్తుందని నిపుణులు చెబుతున్నారు.
కేంద్రంలో వరుసగా రెండోసారి స్థిరమైన ప్రభుత్వం ఏర్పడటం రియల్‌ ఎస్టేట్‌ రంగానికి శుభపరిణామం. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు, ప్రోత్సాహకాలు, సంస్కరణలు స్థిరంగా అమలవుతాయి. ఇప్పటికే రెరా, జీఎస్‌టీలతో రియల్టీ రంగంలో సమర్ధవతను, పారదర్శకతను తీసుకొచ్చాయి. ప్రారంభంలో ఈ చట్టాలు అమలుతో కొంత ఇబ్బందులు ఎదురైనా.. తర్వాత స్థిరపడింది. 2009–18 మధ్య కాలంలో రియల్టీలోకి 30 బిలియన్‌ డాలర్ల సంస్థాగత పెట్టుబడులు వచ్చాయి. 2014–18 మధ్య కాలంలో 20 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. 2009లో 31 శాతంగా ఉన్న విదేశీ పెట్టుబడులు 2018 నాటికి రెడింతల వృద్ధితో 70 శాతానికి పెరిగాయని జేఎల్‌ఎల్‌ ఇండియా తెలిపింది.
అందబాటు గృహాలదే భవిష్యత్తు..
డెవలపర్లు, కొనుగోలుదారులు ఇద్దరినీ అందుబాటు గృహాల వైపు ఆకర్షించేందుకు మోడీ గతంలోనే అందుబాటు గృహాల విభాగానికి మౌలిక రంగం హోదాను అందించారు. దీంతో నిర్మాణ సంస్థలకు తక్కువ వడ్డీ రేట్లకు నిధుల లభ్యత పెరిగింది. కస్టమర్లను ఆకర్షించేందుకు అందుబాటు గృహాలకు పన్ను రాయితీలు, వడ్డీ మినహాయింపులను అందిస్తున్నారు. దీంతో అందుబాటు గృహాల అమ్మకాలు 42 శాతం, కొత్త గృహాల ప్రారంభాలు 53 శాతం వృద్ధి చెందాయి. 2019 జనవరి–మార్చి త్రైమాసికంలో అమ్మకాలు 28 శాతం పెరిగాయి. పైగా కేంద్రం 2022 నాటికి అందరికీ ఇళ్లు లక్ష్యంతో ఉంది. గత ఐదేళ్లలో ప్రధాన్‌మంత్రి ఆవాస్‌ యోజన (అర్బన్‌) కింద 1.8 మిలియన్‌ గృహాల నిర్మాణానికి రూ.4.6 లక్షల కోట్లు కేటాయించారు. ఆదాయాల్లో వృద్ధి, స్థిరమైన రియల్టీ ధరల కారణంగా గృహ కొనుగోళ్లు పెరిగాయని జేఎల్‌ఎల్‌ హోమ్‌ పర్చేజ్‌ అఫడబులిటీ ఇండెక్స్‌ (హెచ్‌పీఏఐ) పేర్కొంది.
వేర్‌హౌజ్, కో–లివింగ్‌ హిట్‌..
ప్రపంచీకరణ, పారిశ్రామిక పునరుద్దరణ కారణంగా వేర్‌ హౌజ్‌ విభాగానికి డిమాండ్‌ పెరిగింది. కో–లివింగ్, ప్రాప్‌ టెక్‌ విభాగాల్లోనూ వృద్ధి నమోదైంది. నిర్మాణాత్మక సంస్కరణల అమలుతో దేశీయ వేర్‌ హౌజ్, లాజిస్టిక్‌ విభాగాల్లో 2022 నాటికి 34 మిలియన్‌ చ.అ.లకు చేరుతాయని అంచనా. ప్రస్తుతమివి 169 మిలియన్‌ చ.అ.లుగా ఉన్నాయి. వచ్చే 4–5 ఏళ్లలో ఈ విభాగాల్లోకి 10 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వస్తాయని జేఎల్‌ఎల్‌ ఇండియా తెలిపింది. దేశంలో రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (రీట్స్‌) పెట్టుబడులకు ఆమోదముద్ర పడింది. ఇటీవల బ్లాక్‌స్టోన్‌–ఎంబసీ రీట్స్‌ లిస్టింగ్‌ విజయవంతమైంది కూడా. జేఎల్‌ఎల్‌ అంచనా ప్రకారం.. దేశంలో 294 మిలియన్‌ చ.అ. ఆఫీస్‌ స్పేస్‌ రీట్స్‌ పెట్టుబడుల సామర్ధ్యాన్ని కలిగి ఉందని.. 2019లో మరిన్ని సంస్థల రీట్స్‌ ప్రారంభమయ్యే సూచనలున్నాయని తెలిపింది.
ఆఫీస్, కమర్షియల్‌లో జోరు..
గత ఐదేళ్లలో బ్యాంకింగ్, ఈ–కామర్స్, డిజిటలైజేషన్‌ వంటి సంస్కరణల కారణంగా రిటైల్, ఆఫీస్‌ మార్కెట్లో వృద్ధి కనిపించింది. 2014–18 మధ్య కాలంలో దేశంలోకి 541 మిలియన్‌ చ.అ. గ్రేడ్‌–ఏ ఆఫీస్‌ స్పేస్‌ వచ్చింది. ఏటా 30 మిలియన్‌ చ.అ. స్థలాన్ని తీసుకున్నాయి. 2018లో ఆఫీస్‌ స్పేస్‌ 33 మిలియన్‌ చ.అ.లను దాటింది. 2019 నాటికిది 38 మిలియన్‌ చ.అ.లను దాటుతుందని అంచనా. కమర్షియల్‌ స్పేస్‌లో సంస్థాగత పెట్టుబడుల ప్రవాహం పెరిగింది. 2009–13 మధ్య కాలంలో కమర్షియల్‌లోకి 1.6 బిలియన్‌ డాలర్ల ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ రాగా.. 2014–18 మధ్య కాలంలో 8.2 బిలియన్‌ డాలర్లకు పెరిగింది.

Related Posts

Latest News Updates