తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గడ్డుకాలం నడుస్తున్నట్లు కనిపిస్తుంది. ఇటీవల బడ్జెట్లో తెలంగాణకు ప్రత్యేక నిధుల కేటాయింపులు, జాతీయ హోదా వంటివి ఆశించిన ముఖ్యమంత్రికి భంగపాటు ఎదురైంది. తెలంగాణ రాష్ట్రానికి తలమానిక ప్రాజెక్ట్‌లైన కాళేశ్వరం, ఫార్మా సిటీల ఊసెత్తకుండా బడ్జెట్‌ను ముగించేశారు. తాజాగా ఇదే జాబితాలో రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) చేరింది. కౌలాలంపూర్ – సింగపూర్ ఎక్స్‌ప్రెస్‌వే తరహాలో రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించాలని కలలు కన్న కేసీఆర్ కేంద్రం షాకిచ్చింది.
టోల్ ట్యాక్స్ వడ్డీకి కూడా సరిపోదు..
రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి రూ.13 వేల కోట్ల వ్యయాన్ని అంచనా వేశారు. ఇందులో రూ.4 వేల కోట్లు భూ సమీకరణ కోసమని ప్రతిపాదించారు. అయితే రూ.13 వేల కోట్ల పెట్టుబడుల ప్రణాళికలతో ఆర్ధికంగా వయబులిటీ కాదని కేంద్రం సందేహం వ్యక్తం చేసింది. ఆర్ఆర్ఆర్ మీద 30 సంవత్సరాల పాటు వసూలు చేసే టోల్ ట్యాక్స్‌తో ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ మీద పెట్టే పెట్టుబడికి వడ్డీ కిందికి కూడా రాదని కేంద్రం తెగేసి చెప్పేసింది.
ప్రభుత్వమే సొంతంగా నిర్మించుకోవాలి..
తెలంగాణ ప్రభుత్వమే సొంతంగా రీజినల్ రింగ్ రోడ్డును అభివృద్ధి చేసుకొని, వాణిజ్యపరంగా ఆచరణీయ ప్రాజెక్ట్‌గా మార్చుకోవాలని కేంద్రం రహదారి, రవాణా మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. అంటే ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ అభివృద్ధి పనులకు కేంద్రం ఎలాంటి ఆర్ధిక సహాయం చేయదనేని సుస్పష్టం. కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ గుండా 2018 అక్టోబర్‌లో ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ ప్రతిపాదన మొదలైంది. మొదట్లో ఈ ప్రాజెక్ట్ కోసం భూ సమీకరణ, అభివృద్ధి ఖర్చులకు నిధులను సమకూర్చడానికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించిన విషయం తెలిసిందే.
ఫెయిల్యూర్ డీపీఆర్..
ఆర్ఆర్ఆర్ నిధులకు సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) మీద కేంద్రం అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ఆర్ఆర్ఆర్ నిర్మాణ ఖర్చులను తిరిగి పొందే సమర్ధవంతమైన రోడ్‌మ్యాప్ డీపీఆర్‌లో లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఆర్ఆర్ఆర్ భారీ పెట్టుబడులతో కూడుకున్న ప్రాజెక్ట్. భూ సమీకరణ, బహుళ లైన్ల రహదారి ఖర్చులు, ఇతర అభివృద్ధి నిర్మాణ వ్యయాలుంటాయి. ఆయా పెట్టుబడులను తెలంగాణ ప్రభుత్వం తిరిగి ఎలా రాబట్టాలనుకుంటుంది? వంటి తదితర అంశాలపై పునఃసమీక్ష నిర్వహించి, పూర్తి వివరాలను పొందుపరచాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది.
పట్టణ ప్రాంతాలతో అనుసంధానం..
ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు 330 కిలో మీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) వెలుపల భువనగిరి, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, చెవెళ్ల, శంకర్పల్లి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్‌పూర్ వంటి పట్టణ ప్రాంతాలతో అనుసంధానమై ఉంటుంది. ఆర్ఆర్ఆర్ కోసం సుమారు 12,000 ఎకరాల భూ సమీకరణ చేయాల్సి ఉంది.