మీరు రూ.45 లక్షల లోపు ధర ఉండే అందుబాటు గృహాలను కొనుగోలు చేస్తున్నారా? అయితే మీరు బ్యాంక్‌కు కట్టాల్సిన గృహ రుణ వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి తీసుకున్న గృహ రుణ కొనుగోలుదారులు అందరికీ ఈ వడ్డీ రాయితీ వర్తిస్తుంది. కాకపోతే ఈ వడ్డీ మినహాయింపు తొలిసారి గృహ కొనుగోలుదారులకు మాత్రమే సుమీ!
రూ.3.5 లక్షల వడ్డీ మినహాయింపు..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2.ఓ తొలి బడ్జెట్లో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అందుబాటు గృహాలు (అఫడబుల్) హౌజింగ్ కోసం అనేక రాయితీలను ప్రకటించారు. కొనుగోలుదారులకు, నిర్మాణదారులకు ఇద్దరికీ ప్రయోజనం చేకూరే రాయితీలున్నాయిందులో! గతంలో అఫడబుల్ హౌజింగ్ కొనుగోలుదారులకు గృహ రుణంలో వడ్డీ మినహాయింపు రూ.2 లక్షలుండేది. దీన్ని రూ.1.5 లక్షలకు పెంచారు. అంటే వడ్డీ మినహాయింపు రూ.3.5 లక్షలకు చేరింది.
వడ్డీ చెల్లించేది ప్రభుత్వమే..
ఉదాహరణకు రూ.40 లక్షల గృహ రుణంతో ఇల్లు కొన్నాడనుకుందాం. వార్షిక వడ్డీ రేటు 9.5 శాతం. వడ్డీ రాయితీ రూ.3.5 లక్షలు. అంటే 5–7 సంవత్సరాల ఈఎంఐ వడ్డీ రూ.3.5 లక్షలు రాయితీ కింద ప్రభుత్వమే అందిస్తుందన్నమాట. ఒకవేళ సదరు గృహ కొనుగోలుదారుడు 20 శాతం ఆదాయ పన్ను పరిధిలో ఉంటే గనక.. నికర వడ్డీ 7.5 శాతానికి తగ్గిపోతుంది. ఇది కూడా కలుపుకుంటే 15 సంవత్సరాల గృహ రుణ వడ్డీ రూ.7 లక్షలు ప్రభుత్వమే చెల్లిస్తుందన్నట్టేగా!
డెవలపర్లకు ఆదాయ పన్ను..
డెవలపర్ల రాయితీలు చూస్తే.. అందుబాటు గృహాలను (అఫడబుల్ హౌజింగ్) నిర్మించే డెవలపర్లు 80 ఐబీ ప్రకారం ఆదాయ పన్ను మినహాయింపు అందిస్తుంది. మెట్రో నగరాల్లో 60 చదరపు మీటర్లు, నాన్–మెట్రో నగరాల్లో 90 చదరపు మీటర్ల వరకు గృహాలను అందుబాటు గృహాల పరిధిలోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.