లక్కీ డ్రా! వాహనం కొన్నప్పుడో.. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు కొనుగోలు చేసినప్పుడో మన అదృష్టాన్ని పరీక్షించుకుంటాం. కానీ, ఇల్లు కొనాలంటే కూడా లక్కీ డ్రాలో పాల్గొనాల్సిందే. డ్రాలో విజేతలైతేనే ఇల్లు కొనేముందుకు అర్హులవుతారు కూడా!
200 కోట్లతో ‘ది బాల్కనీ’
చేతిలో డబ్బులు, ప్రాజెక్ట్ ఉన్న ఏరియా, వసతులు నచ్చితే చాలు ఇల్లు కొనేయచ్చు. ఇంతకు మించి ఏ గృహ కొనుగోలుదారులు ఆలోచించరు. కానీ, ఎంఆర్జీ వరల్డ్‌లో మాత్రం అలా కుదరదు. ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎడ్యుకేషన్, ఆగ్రో ట్రేడింగ్ వ్యాపారాల్లో ఉన్న ఎంఆర్జీ వరల్డ్.. తాజాగా రియల్ ఎస్టేట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. గుర్గావ్లో ‘ది బాల్కనీ’ పేరిట తొలి ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు సిద్ధమైంది. రూ.200 కోట్ల పెట్టుబడులతో అందుబాటు గృహాల ప్రాజెక్ట్‌ను నిర్మించనుంది.
5 ఎకరాల్లో 731 గృహాలు..
హర్యానా ప్రభుత్వ అఫడబుల్ హౌజింగ్ పాలసీ కింద ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నట్లు కంపెనీ తెలిసింది. 5 ఎకరాల్లో 731 అఫడబుల్ గృహాలను నిర్మించనుంది. ఈ గృహాలను లక్కీ డ్రా విధానంలో కొనుగోలుదారులకు విక్రయిస్తామని కంపెనీ తెలిపింది. 590 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా ఉండే గృహం ధర రూ.24 లక్షలు అని ఎంఆర్జీ వరల్డ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రాజత్ గోయల్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎంఆర్జీ ప్రమోటర్లు రియల్ ఎస్టేట్ సంస్థ సిగ్నేచర్ గ్లోబల్‌తో ఒప్పందం చేసుకున్నారు.