Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

లాంచింగ్స్‌లో జోష్‌.. అమ్మకాల్లో డల్‌!

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగం మిశ్రమంగా సాగుతోంది. 2019 జనవరి నుంచి జూన్‌ మధ్య కాలంలో కొత్త గృహాల ప్రారంభాల్లో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తే.. అమ్మకాల్లో మాత్రం నీరసం నెలకొంది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో (హెచ్‌1) నగరంలో కొత్త గృహాల లాంచింగ్స్‌లో 47 శాతం, అమ్మకాల్లో 0.3 శాతం వృద్ధి నమోదైందని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా 11వ ఎడిషన్‌ అర్ధ సంవత్సర నివేదిక తెలిపింది.
రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలే..
2019 హెచ్‌1లో నగరంలో కొత్తగా 5,430 గృహాలు ప్రారంభమయ్యాయి. 2018 హెచ్‌1లో ఇవి 3,706 యూనిట్లుగా ఉన్నాయి. ఫ్లాట్ల లాంచింగ్స్‌ ఎక్కువగా కూకట్‌పల్లి, మియాపూర్‌ వంటి ఉత్తరాధి ప్రాంతాల్లోనే ఎక్కువగా జరిగాయి. రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల లోపు ప్రాజెక్ట్‌లే ఎక్కువగా ఉన్నాయి. ఇక, అమ్మకాల్లో స్వల్ప వృద్ధి కనిపించింది. ఈ అర్ధ సంవత్సరంలో నగరంలో 8,334 గృహాలు అమ్ముడుపోగా.. గతేడాది హెచ్‌1లో ఇవి 8,313 యూనిట్లుగా ఉన్నాయి. ఈ ఏడాది అమ్మకాల్లో 63 శాతం గచ్చిబౌలి, మాదాపూర్‌ వంటి పశ్చిమ ప్రాంతాల్లోనే ఎక్కువ జరిగాయి.
ఇన్వెంటరీ 4,265 గృహాలు..
నగరంలో సగటు చ.అ. ధరల్లో 9 శాతం వృద్ధి కనిపించింది. గతేడాది హెచ్‌1లో చ.అ. సగటున రూ.4,012 కాగా.. ఇప్పుడది రూ.4,373కి పెరిగింది. అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ) గతేడాది హెచ్‌1తో పోలిస్తే 67 శాతం తగ్గి ప్రస్తుతం 4,265 యూనిట్లుగా నిలిచాయి.

ఆఫీస్‌ స్పేస్‌లో జోష్‌..
నగరంలో ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీల్లో 43 శాతం వృద్ధి నమోదైంది. 2019 హెచ్‌1లో 38.5 లక్షల చ.అ. ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీలు జరగగా.. గతేడాది హెచ్‌1లో ఇది 26..9 లక్షల చ.అ.లుగా ఉంది. ఐటీ, ఐటీఈఎస్‌ రంగాలు 41 శాతం లావాదేవీలు జరిపాయి. గతేడాదితో పోలిస్తే నగరంలో ఆఫీస్‌ స్పేస్‌ ధరలు 11 శాతం వృద్ధి చెందాయి. ప్రస్తుతం నెలకు చ.అ. ధర సగటున రూ.59 ఉంది. కోకాపేట, నార్సింగి, పుప్పాలగూడ ప్రాంతాల్లో కార్యాలయాల ప్రాజెక్ట్‌లు విస్తరిస్తున్నాయి.
జీఎస్‌టీ లేకపోవటం వల్లే..
నిర్మాణం పూర్తయిన లేదా తుది దశలో ఉన్న గృహాల కొనుగోళ్లకే నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారని, ఆయా గృహాలకు జీఎస్‌టీ లేకపోవటమే దీనికి కారణమని హైదరాబాద్‌ బ్రాంచ్‌ డైరెక్టర్‌ సామ్సన్‌ ఆర్థర్‌ తెలిపారు.

Related Posts

Latest News Updates