దేశంలోని అన్ని వక్ఫ్ ప్రాపర్టీలను జియో ట్యాగింగ్ చేయాలని కేంద్ర మైనార్టీ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. మైనార్టీల సంక్షేమ ప్రయోజనాల కోసమే ఆయా ప్రాపర్టీలు వినియోగించబడుతున్నాయా లేదా అని పర్యవేక్షణ చేసేందుకు ఈ డిజిటల్ డేటాబేస్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.
5.77 లక్షల రిజిస్టర్డ్ ప్రాపర్టీలు..
కేంద్ర గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5.77 లక్షల రిజిస్టర్డ్ వక్ఫ్ ప్రాపర్టీలున్నాయి. వక్ఫ్ ప్రాపర్టీల రికార్డుల భద్రత, పారదర్శకత, భద్రత కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మైనార్టీ అఫైర్స్ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ తెలిపారు. జియో ట్యాగింగ్, జీపీఎస్ మ్యాపింగ్ కోసం ఐఐటీ రూర్కీ, అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ సహాయ సహకారాలు అందిస్తుంది.
వక్ఫ్ ప్రాపర్టీల్లో విద్యా సంస్థలు, ఆసుపత్రులు..
అన్ని రాష్ట్రాల్లోని వక్ఫ్ ప్రాపర్టీలల్లో స్కూల్స్, కాలేజీలు, ఐటీఐ ఇనిస్టిట్యూట్స్, పాలిటెక్నిక్ వంటి విద్యా సంస్థలు, ఆసుపత్రులు, మల్టిపర్పస్ కమ్యూనిటీ హాళ్లు వంటివి నిర్మించాలని కేంద్ర మైనార్టీ శాఖ నిర్ణయించింది. ఆయా అభివృద్ధి పనుల కోసం 100 శాతం నిధులను కూడా కేంద్రమే సమకూరుస్తుందని మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ తెలిపారు. కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ 20 రాష్ట్రాల వక్ఫ్ బోర్డులకు వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించేందుకు వీలుగా సౌకర్యాలను కల్పించింది. మిగిలిన రాష్ట్రాలకు ఈ ఏడాది చివరి నాటికి సేవలను అందిస్తామని పేర్కొన్నారు.
తెలంగాణలో 77,538, ఏపీలో 65,770 ఎకరాలు..
తెలంగాణ స్టేట్ వక్ఫ్ బోర్డ్ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 77,538.07 ఎకరాల వక్ఫ్ భూములున్నాయి. ఆయా ప్రాపర్టీల్లో 33929 దర్గాలు, మసీదులు, గ్రేయార్డ్స్, అషూర్ఖానా వంటి ఇనిస్టిట్యూట్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 65,770 ఎకరాల వక్ఫ్ భూములుండగా.. వీటిల్లో 3,502 ఇనిస్టిట్యూట్స్ ఉన్నాయి.