కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) తెలంగాణ చాప్టర్ విస్తరణ బాట పట్టింది. 2015లో ప్రారంభమైన క్రెడాయ్ తెలంగాణలో ప్రస్తుతం 11 చాప్టర్లు ఉన్నాయి. 600 మంది సభ్యులున్నారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, జగిత్యాల, కామారెడ్డి, సిద్దిపేట, కొత్తగూడంల్లో చాప్టర్లున్నాయి. వచ్చే రెండేళ్లలో 20 చాప్టర్లు, వెయ్యి మంది సభ్యులకు విస్తరించాలని లక్ష్యించినట్లు క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ గుమ్మి రాంరెడ్డి తెలిపారు. నల్లగొండ, సూర్యాపేట, ఆర్మూర్లో చాప్టర్లు ప్రారంభించనున్నామని పేర్కొన్నారు.
205 చాప్టర్లు; 12500 మంది సభ్యులు..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రెడాయ్కు 23 రాష్ట్రాలు, 205 నగరాల్లో చాప్టర్లున్నాయి. సుమారు 12500 మంది సభ్యులున్నారు. 1999లో న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా క్రెడాయ్ ప్రారంభమైంది. ప్రస్తుతం దీనికి చైర్మన్గా జక్షయ్ షా, ప్రెసిడెంట్గా సతీష్ మగర్, ప్రెసిడెంట్ ఎలెక్ట్గా హర్షవర్ధన్ పటోడియా వ్యవహరిస్తున్నారు.