ప్రాజెక్ట్ ఆవరణలో స్కూలు, ఆసుపత్రి ఉన్నంత మాత్రానా ఫ్లాట్ కొనేందుకు సిద్ధమవకూడదని నిపుణులు చెబుతున్నారు. ప్రాజెక్ట్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో తెలుసుకోవాలంటే వర్షాకాలమే సరైందంటున్నారు. అది కూడా సైటు వద్దకు ప్రత్యక్షంగా వెళ్లి పరిశీలించాలని సూచిస్తున్నారు. ఇంకా ఏమంటున్నారంటే..
– వర్షాకాలంలో కొనుగోలుదారులు ఇంటిని కొనడానికి సైటు వద్దకెళితే రవాణా సదుపాయాల గురించి పక్కాగా తెలుస్తుంది. ఇంటి నుంచి ఆఫీసుకు, పిల్లలు స్కూలుకు సులువుగా చేరుకోగలరా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఇదే సరైన సమయం.– ప్రజా రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉందా? అత్యవసరాల్లో ఆటోలు దొరుకుతాయా? స్థానిక రైళ్లను సులువుగా అందుకోవచ్చా? ఇలాంటి అంశాలన్నీ వానాకాలంలోనే పక్కాగా తెలుస్తాయి.– వర్షాకాలంలో అయితే ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతం ముంపులో ఉందా? లేక గడ్డ మీద ఉందా అనే విషయం ఇట్లే తెలిసిపోతుంది. వానలు పడితే ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతమంతా నీరుతో నిండిపోతుందా? అనే అంశం టోకెన్ అడ్వాన్స్ ఇచ్చే ముందే తెలుసుకోవచ్చు. – నిర్మాణపనులు ఆరంభమైనా నిర్మాణం చివరి స్థాయిలో ఉన్నా వర్షాకాలంలో వెళితే ఆయా కట్టడం వర్షాలకు గట్టిగా నిలుస్తుందా? లేదా అనే విషయం తెలుస్తుంది.– గోడల్లో పగుళ్లు ఉన్నా, వర్షం నీరు కారుతున్నా పరీక్షించడానికి ఇంతకు మించిన సమయం లేదని గుర్తుంచుకోండి.