గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో వెయ్యి గజాల స్థలం కన్నా ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న హోటళ్లు, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌లు, ఫంక్షన్‌హాళ్లు, ప్రైవేట్ పాఠశాలలు తదితర కమర్షియల్ భవనాల తనిఖీలను చేపట్టేందుకు ప్రత్యేక టాస్క్‌పోర్స్ బృందాలను ఏర్పాటు చేయనున్నారు. కమర్షియల్ భవనాల్లో అనుమతికి మించి అధికంగా నిర్మాణాలు చేపట్టారని, వాటి ఆస్తిపన్ను నిర్ధారణలోనూ తీవ్ర వ్యత్యాసాలున్నాయని పలు ఫిర్యాదులందినందున ఈ వాణిజ్య భవనాలన్నింటినీ తనిఖీలు చేసి రీ అసెస్ చేయనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ తెలిపారు.
టాస్క్‌ఫోర్స్ బృందాలు..
రీ–అసెస్మెంట్ కోసం టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటు చేసి జోన్ల వారీగా తనిఖీలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఏ జోన్‌లోని వారు అదే జోన్లో కాకుండా ఇతర జోన్లలోని వాణిజ్య భవనాలను తనిఖీలు చేస్తారని, ప్రధాన కార్యాలయంలోని సెంట్రల్ టాస్క్‌ఫోర్స్ పర్యవేక్షిస్తుందని తెలిపారు. సంబంధిత జోనల్ కమిషనర్లు, జోనల్ సిటీ ప్లానర్లు, డిప్యూటి కమిషనర్లు కూడా క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైతే వ్యత్యాసాలు భారీమొత్తంలో ఉన్న భవన యజమానులపై కేసులు నమోదు చేయాలని సూచించారు. ఈ తనిఖీలు ఏవిధమైన వివాదాలకు తావులేకుండా పారదర్శకంగా చేపట్టాలని కమిషనర్ స్పష్టం చేశారు.