భారత రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులకు ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐ)లు ఎళ్లవేళలా ఆసక్తిగా ఉంటారు. సానుకూల మార్కెట్, ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహకాలతో గత కొన్నేళ్లుగా కమర్షియల్ రియల్ ఎస్టేట్‌లో ఎన్ఆర్ఐల పెట్టుబడులు క్రమంగా పెరుగుతున్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)లకు అనుమతి ఇవ్వటంతో రిటైల్ బ్రాండ్స్ దేశంలోకి ఎంట్రీ ఇచ్చాయి. రూపాయి విలువ తగ్గడంతో విదేశీ మారకంతో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
నివాస సముదాయాలతో పోలిస్తే కమర్షియల్ అద్దెలు ఎక్కువగా ఉంటాయి. అలాగే క్యాపిటల్ అప్రిసేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎన్ఆర్ఐలు వాణిజ్య సముదాయాల్లో పెట్టుబడులకే ఆసక్తి చూపిస్తున్నారు. ఎన్ఆర్ఐలు కమర్షియల్ పెట్టుబడులకు ప్రధాన కారణం.. వీటి నిర్వహణ, లీజుకు ఇవ్వటం చాలా ఈజీ. నివాస సముదాయాల కంటే కమర్షియల్ ప్రాపర్టీలు సంఘటిత మార్కెట్‌గా ఉంటాయి. దీంతో ప్రాపర్టీలను అద్దెకు ఇవ్వటం, నిర్వహణ చేయడం సులువవుతుంది.
ఎన్ఆర్ఐలకు ఇన్‌కం ట్యాక్స్ మినహాయింపులు కూడా..
ఇండియన్ సిటీజన్కు ఎలాగైతే గృహ రుణాలు అందుబాటులో ఉంటాయో అదే విధంగా ఎన్ఆర్ఐకి కూడా లోన్స్ పొందవచ్చు. ఇన్‌కం ట్యాక్స్ మినహాయింపు కూడా ఉంటుంది. సెక్షన్ 80 సీసీ కింద ఆదాయపు పన్ను మినహాయింపు క్లయిమ్ కూడా చేసుకోవచ్చు.
ప్రధాన మెట్రో నగరాల్లో డిమాండ్..
రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా), వస్తు సేవల పన్ను (జీఎస్టీ), బినామీ ట్రాన్స్యాక్షన్ యాక్ట్ వంటి చట్టాలతో దేశంలో రియల్టీ లావాదేవీలు పారదర్శకత, వేగం, జవాబుదారీతనం పెరిగింది. దీంతో ఎన్ఆర్ఐ వ్యక్తిగత పెట్టుబడులు, ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి. బెంగళూరు, ముంబై, చెన్నై, పుణె, హైదరాబాద్, ఢిల్లీ–ఎన్సీఆర్ వంటి ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్, మాల్స్, గ్రేడ్–ఏ ఆఫీస్‌లు, కో–వర్కింగ్ ప్రాపర్టీలకు డిమాండ్ ఉంది.