గ్రేటర్ నోయిడాలో నిర్మిస్తున్న జెవర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓపెన్ ప్లాట్లు, పారిశ్రామిక, మిక్స్డ్ యూజ్, ఇనిస్టిట్యూట్ ల్యాండ్స్‌ను విక్రయించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ (వైఈఐడీఏ) కొత్త స్కీమ్‌ను ప్రకటించింది. ఆయా ప్లాట్లు విమానాశ్రయానికి దగ్గర్లోని సెక్టార్ 29, 32, 33లల్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది.
ఆన్లైన్లో విక్రయం
వైఈఐడీఏ ఓపెన్ ప్లాట్ల స్కీమ్‌ను ప్రకటించడం ఇదే తొలిసారి. ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు www.niveshmitra.up.nic.in లో ఆన్లైన్ దరఖాస్తు చేసుకుంటే.. ఎంపిక ద్వారా ప్లాట్లను అందిస్తామని వైఈఐడీఏ తెలిపింది. వ్యక్తిగత లేదా పార్టనర్షిప్ సంస్థలు, ఎల్ఎల్పీలు, ట్రస్ట్‌లు, సొసైటీలు, ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు ఎవరైనా సరే ప్లాట్ల కొనుగోలుకు అర్హులు. నాన్–రీఫండబుల్‌గా రూ.25 వేల చెల్లించాల్సి ఉంటుంది.
ధరలివే..
4 వేల చదరపు మీటర్ల వరకు ధర రూ.6670 (చ.మీ.కు), 4 వేల నుంచి 8 వేల చ.మీ.లకు రూ.5680, 8 వేల నుంచి 20 వేల చ.మీ.లకు రూ.4810, 20 వేల నుంచి 40 వేల చ.మీ.లకు రూ.4370, 40 వేల నుంచి 80 వేల చ.మీ.లకు రూ.4210, 80 వేల చదరపు మీటర్ల పైన ప్లాట్లకు ధర చ.మీ.కు రూ.4050.