Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

వీఎల్‌టీఏ కట్టకపోతే నో రిజిస్ట్రేషన్‌

తెలంగాణ రాష్ట్రంలో ఇక నుంచి ఖాళీ స్థలాలకు వేకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌ అస్‌స్‌మెంట్‌ (వీఎల్‌టీఏ) పన్ను కట్టకపోతే రిజిస్ట్రేషన్‌ చేయరు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇంటిని లేదా అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ను రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలంటే దాని డోర్‌ నంబరు ఇస్తే సరిపోదు. దాని ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్‌ నంబరు (పీ–టిన్‌) కూడా ఇవ్వాల్సిందే. అలాగే పట్టణ ప్రాంతాల్లో మీరు ఒక ఖాళీ ప్లాట్‌ను రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలంటే.. ప్లాట్‌ నంబరు, సర్వే నంబరుతో పాటూ వీఎల్‌టీఏను కూడా తప్పనిసరిగా జత చేయాల్సిందే.
అమలులో ఉన్నా.. పట్టింపు లేదు..
వాస్తవానికి రాష్ట్రంలో ఇళ్లకు పీ–టిన్, ఖాళీ ప్లాట్లకు వీఎల్‌టీఏ నంబరు ఉండాలన్న నిబంధన ఉంది. కానీ, దాన్ని ఎవరూ పాటించడం లేదు. అవి లేకుండానే క్రయవిక్రయాలు చేసేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి ఆదాయం రావట్లేదు. ఇప్పుడు పన్నుల ఆదాయాన్ని పెంచుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం వీటిని రిజిస్ట్రేషన్లకు లింకు పెట్టింది.
ఏమిటీ వీఎల్‌టీఏ?
మున్సిపల్‌ చట్టం ప్రకారం.. ఖాళీ స్థలాల మీద ఆస్తి పన్ను వసూలు చేస్తారు. ఎన్‌టీ రామారావు హాయంలో దీన్ని రద్దు చేసినా.. ఆ తర్వాత పలుమార్లు తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో నాలుగైదు ఏళ్లుగా ఈ పన్ను వసూలుకు కసరత్తు ప్రారంభమైంది. 2017 జులై 26న జీహెచ్‌ఎంసీ అధికారులు జరిపిన ఉన్నతస్థాయి సమీక్షలో వీఎల్‌టీఏ వసూలుతో ఆదాయాన్ని పెంచుకోవాలని నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారం.. ఖాళీ స్థలానికి సంబంధించి రిజిస్ట్రేషన్‌ విలువలో ఏటా 0.5 శాతం వీఎల్‌టీఏ విధించాలని నిర్ణయించారు. మున్సిపల్‌ చట్టం ప్రకారం వీఎల్‌టీఏ వసూలు నిబంధన ఉన్నా.. అది అమలు కావటం లేదు. ఖాళీ స్థలం మీద ఎవరూ పన్ను కట్టట్లేదు. తాజాగా రిజిస్ట్రేషన్‌ చట్టం 1908లోని 21, 22 సెక్షన్లు, ఆ చట్టానికి తెలంగాణ ప్రభుత్వం 2016లో సవరణలు చేస్తూ 30వ నిబంధనలో తీసుకు వచ్చిన మార్పును ఉటంకిస్తూ వీఎల్‌టీఏ లేనిదే రిజిస్ట్రేషన్లు చేయకూడదని ఆదేశాలిచ్చింది.

Related Posts

Latest News Updates