అందుబాటు గృహాలు సామాన్య, మధ్య తరగతి సొంతింటి వేదికలు. గతంలో ఈ గృహాలంటే పెద్ద డెవలపర్లకు చేదు గుళికలు. కానీ, ఇప్పుడివే హాట్ ఫేవరేట్. ఎందుకంటే మౌలిక రంగం హోదా, నిర్మాణ సంస్థలకు పన్ను ప్రోత్సాహకాలు, కొనుగోలుదారులకు వడ్డీ రాయితీలు వంటివి అందించడంతో అందుబాటు గృహాలకు ఊపొచ్చింది. దీంతో 2016లో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 20,485 యూనిట్లు ప్రారంభం కాగా.. 2017లో ఇప్పటివరకు 27 శాతం వృద్ధి రేటుతో 26,485 గృహాలు ప్రారంభమయ్యాయి. ఇందులో హైదరాబాద్ వాటా 2,110 గృహాలు.హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ–ఎన్సీఆర్, హైదరాబాద్, కోల్కత్తా, ముంబై, పుణె నగరాల్లో 2016 జనవరి–సెప్టెంబర్ మధ్య కాలంలో 89,970 కొత్త నివాస సముదాయాలు ప్రారంభం కాగా.. 2017 జనవరి– సెప్టెంబర్ మధ్య కాలంలో కేవలం 60,140 యూనిట్లు మాత్రమే ప్రారంభానికి నోచుకున్నాయని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక తెలిపింది. అంటే ఏడాది కాలంలో 33 శాతం తగ్గుదల కనిపించింది. స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు (రెరా), వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు వంటివి కొత్త యూనిట్ల ప్రారంభాలపై ప్రభావం చూపించాయని నివేదిక పేర్కొంది.హైదరాబాద్లో 2,110 అందుబాటు గృహాలు..2017 జనవరి–సెప్టెంబర్ మధ్య కాలంలో మొత్తం 60,140 ప్రారంభం కాగా.. ఇందులో అందుబాటు గృహాలు 26,081, మధ్య స్థాయి గృహాలు 30,445, హైఎండ్ 3,439, లగ్జరీ 175 గృహాలున్నాయి. ఇక నగరాల వారీగా చూస్తే.. ముంబై నగరంలోనే ఏకంగా 40 శాతం అంటే 10,500 అందుబాటు గృహాలు మొదలయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో కోల్కతా, పుణె నగరాలు నిలిచాయి. హైదరాబాద్లో 2016లో 231 అందుబాటు ఇళ్లు ప్రారంభం కాగా.. 2017లో వీటి సంఖ్య 2,110లకు చేరింది. అంటే ఏడాదిలో 813 శాతం వృద్ధిని నమోదు చేసింది.