శంషాబాద్‌లోని అమ్మపల్లి దేవాలయం భూములను ఆక్రమించి.. లే అవుట్ చేసిన స్కైలైన్ ఎన్‌క్లేవ్‌ను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేశారు. రూ.100 కోట్ల విలువైన దేవాదాయ భూమిని కబ్జాదారులు ఆక్రమించి, స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి ఓపెన్ ప్లాట్లను చేసి అమాయక ప్రజలకు విక్రయించేశారు.
శంషాబాద్ మండలం నర్కుడ సమీపంలోని చారిత్రక అమ్మపల్లి దేవాలయానికి 250 ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. వందల ఎకరాలు వృథాగా ఉండడంతో స్థిరాస్తి వ్యాపారులు వాటిపై కన్నేశారు. సర్వే నెంబర్ 47లో ఉన్న 32.31 ఎకరాలను 2003లో అనుమతులు లేకుండా లే–అవుట్ చేసి విక్రయించి సొమ్ము చేసుకున్నారు. దేవాదాయ అధికారులు అడ్డు చెప్పడంతో స్థిరాస్తి వ్యాపారులు కోర్ట్‌ను ఆశ్రయించారు. అప్పటినుంచి కేసు కోర్ట్ పెండింగ్‌లో ఉంది. మార్చి15న సర్వే నంబర్ 47లోని 32.31 ఎకరాల భూమి దేవాదాయ శాఖకు చెందినదేనని కోర్ట్ తీర్పునిచ్చింది. దీంతో అధికారులు భూమిని స్వాధీనం చేసుకొని, అక్కడ ఉన్న అక్రమ లే–అవుట్లను కూల్చేశారు.
స్కైలైన్‌లో కొన్నవాళ్ల సంగతేంటి?
సర్వే నంబర్ 47లోని భూమి దేవాదాయ శాఖకు చెందినదని, రియల్టర్లు ఆక్రమించి లే–అవుట్ చేసినట్లు సమాచారం తెలియని అమాయక ప్రజలు స్కైలైన్ ఎన్‌క్లేవ్‌లో ప్లాట్లను కొనుగోలు చేశారు. ఇప్పుడు వాటిని ప్రభుత్వం కూల్చేసింది. మరి, అందులో కొన్నవాళ్ల పరిస్థితి ఏంటని స్థానికుల ప్రశ్నిస్తున్నారు. మోసం చేసిన స్థిరాస్తి వ్యాపారులను కఠినంగా శిక్షించి, సామాన్యులకు న్యాయం చేయాలని వారు కోరారు.