అక్రమంగా సెల్లార్లో నిర్మాణం చేపట్టి.. కొనుగోలుదారులకు విక్రయించినందుకు సాయి కృప బిల్డర్స్‌కు రాష్ట్ర వినియోగదారుల ఫోరం జరిమానా విధించింది. కొనుగోలుదారు చెల్లించిన మొత్తం సొమ్ము రూ.9.90 లక్షలతో సహా పరిహారంగా రూ.50 వేలు, ఖర్చుల కింద మరొక రూ.5 వేలు చెల్లించాలని సాయి కృప బిల్డర్స్‌ను ఆదేశించింది.
వర్షం కారణంగా బయటపడ్డ అక్రమం..
కుత్బుల్లాపూర్ మండలం నిజాంపేటలో లేక్ రిడ్జ్ అపార్ట్మెంట్ 550 చదరపు అడుగుల షట్టర్‌ను అక్రమంగా నిర్మించారు సాయి కృప బిల్డర్స్ గొట్టిపాటి వెంకటేశ్వర రావు, అట్టలూరి శ్రీనివాసరావులు. దీన్ని ఎం. రాణి అనే మహిళకు రూ.9.90 లక్షలకు విక్రయించారు. ఈ షట్టర్‌ను ఆహారం అనే సంస్థకు అద్దెకు ఇచ్చింది. 2015 సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు సెల్లార్ మొత్తం నీట మునిగిపోయింది. ఈ షట్టర్ అక్రమ నిర్మాణమని, తొలగించాలని అపార్ట్‌మెంట్‌వాసులు హెచ్ఎండీఏకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం హైకోర్ట్‌ను ఆశ్రయించారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోర్ట్ తీర్పును ఇవ్వటంతో తాను అక్రమ నిర్మాణాన్ని కొనుగోలు చేసినట్లు రాణి తెలుసుకున్నారు. కనీసం తాను చెల్లించిన సొమ్ము రూ.9.90 లక్షలు అయినా తిరిగి ఇవ్వాలని రాణి రాష్ట్ర వినియోదారుల ఫోరంను ఆశ్రయించారు.