Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

సొంతిల్లు కొందామా? అద్దెకు ఉందామా?

చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, ఆ తర్వాతే సొంతిల్లు! ఇదీ పాతతరం ఆలోచన. నేటి మిలీనియల్స్‌ యువత ట్రెండ్‌ మార్చేశారు. టాప్‌ కాలేజీలో చదువు, మంచి ఉద్యోగం, సరైన జీవిత భాగస్వామి.. ఆ తర్వాత సొంతిల్లు కాదండోయ్‌.. ఆర్ధిక స్వేచ్ఛ!
ఎందుకంటే సొంతిల్లు కొనుగోలు చేస్తే దీర్ఘకాలం పాటు ఆర్ధిక సమస్యలుంటాయని! దాని బదులుగా ఆఫీస్‌కు కనెక్టివిటీ, సౌలభ్యం, భద్రత వంటి మీదే మిలీనియల్స్‌ ఆసక్తి చూపిస్తున్నారు. 1980 నుంచి 2000 సంవత్సరంలో పుట్టిన వాళ్లను మిలీనియల్‌ (జనరేషన్‌ వై)గా పిలుస్తుంటారు.
ఒక్క చోట స్థిరంగా ఉండలేరు..
జనరేషన్‌ వై యువత చేస్తున్న ఉద్యోగ స్వభావం కారణంగా ఒకే ప్రాంతంలో ఎక్కువ కాలం ఉండలేరు. దీంతో స్వల్పకాలం ఉండేందుకు సొంతిల్లు కొనుగోలు చేసే బదులుగా అద్దెకు ఉండటమే ఉత్తమం అని భావిస్తున్నారు. దీంతో మంచి ఆఫర్, లేదా ఉత్తమమైన ప్యాకేజ్‌ వస్తే వేరే చోట జాబ్‌కు వెళ్లేందుకు సులువవుతుందని వారి అభిప్రాయం. పైగా వాళ్లు పనిచేసే కార్యాలయాలు అభివృద్ధి చెందిన ప్రాంతాలు కావటంతో ఆయా చోట గృహాలు ఖరీదైనవిగా ఉంటాయి. దీంతో ఇక్కడ కొనుగోలు చేసే బదులు అద్దెకు ఉండటమే ఉత్తమం అని నిర్ణయించుకుంటున్నారు.
ఈఎంఐ వర్సెస్‌ రెంట్‌..
అందుబాటు ధరల్లో ప్రాపర్టీ ఉన్నప్పుడు ఎవరైనా సరే ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటారు. ఈఎంఐ, అద్దె రెండింటి మధ్య వ్యత్యాసం పెద్దగా లేనప్పుడు అద్దెకు ఉండటం కంటే సొంతిల్లు కొనుక్కోవటమే ఉత్తమం. ఎందుకంటే ఈఎంఐతో ప్రాపర్టీ మిగిలిపోతుంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశంలో అద్దెలతో పోలిస్తే నెలసరి వాయిదా (ఈఎంఐ) ఎక్కువగా ఉంటుంది.
కొంటే 80 లక్షలు, అద్దెకుంటే 30 వేలు..
ఉదాహరణకు.. కొండాపూర్‌లో 2 బీహెచ్‌కే ధర రూ.80 లక్షలుంటుంది. 20 శాతం డౌన్‌ పేమెంట్‌ అనుకుంటే రూ.16 లక్షలు చెల్లించాలి. మిగిలిన రూ.64 లక్షలు బ్యాంక్‌ రుణం తీసుకుంటే..
20 ఏళ్ల పాటు నెలకు వడ్డీ 9 శాతం అనుకుంటే.. నెలసరి వాయిదా (ఈఎంఐ) రూ.56,150 అవుతుంది. ఇప్పుడు ఇదే కొండాపూర్‌ ప్రాంతంలో అద్దె 25–30 వేలకు మించి ఉండదు. అంటే ఈఎంఐ కంటే అద్దె తక్కువ ఉన్నట్లేగా!
2021 నాటికి 44 లక్షల అద్దె గృహాలు..
జేఎల్‌ఎల్‌ రెంటల్‌ హౌజింగ్‌ ఇండెక్స్‌ గణాంకాల ప్రకారం.. ఢిల్లీ–ఎన్‌సీఆర్, బెంగళూరు, ముంబై నగరాల్లో ప్రస్తుతం 29 లక్షలుగా ఉన్న అద్దె గృహాలు.. 2021 నాటికి 44 లక్షలకు చేరుతాయని అంచనా వేసింది. ఏటా 4.3 శాతం వృద్ధిని నమోదు చేస్తుంది.

కో–లివింగ్‌ కొత్త ట్రెండ్‌..
రోజుకు రోజు ప్రధాన నగరాల్లో ప్రాపర్టీ ధరలు పెరుగుతుండటంతో నేటి మిలీనియల్స్‌ కో–లివింగ్‌ స్పేస్‌ మీద ఆసక్తి చూపిస్తున్నారని జేఎల్‌ఎల్‌ ఇండియా చీఫ్‌ ఎకనామిస్ట్‌ అండ్‌ రీసెర్చ్‌ హెడ్‌ సమంతక్‌ దాస్‌ తెలిపారు. ఇంటిని, ఇంట్లోని వసతులను ఇతర యువతతో పంచుకోవటంతో అద్దె భారం తగ్గడమే కో–లివింగ్‌ ప్రత్యేకత. అంతేకాకండా వాటర్, గ్యాస్, ఎలక్ట్రిసిటీ వంటి మౌలిక సదుపాయాలన్నీ అద్దెలో కలిపే ఉంటాయి. వై–ఫై, ఫోన్, హౌజింగ్‌ కీపింగ్, లాండ్రీ, వాటర్, ఎంటర్‌టైన్‌మెంట్‌లతో పాటూ కిచెన్, బాత్‌రూమ్, లివింగ్‌ ఏరియా వంటివి షేర్‌ చేసుకుంటున్నారు. జోలోస్టే, కోలివ్, స్టాంజా లివింగ్, కోహో వంటి కంపెనీలు కో–లివింగ్‌ సేవలను అందిస్తున్నాయి. ఢిల్లీ–ఎన్‌సీఆర్, బెంగళూరు, పుణే, హైదరాబాద్, ముంబై వంటి నగరాల్లో ఆయా కంపెనీల సేవలు అందుబాటులో ఉన్నాయి.

Related Posts

Latest News Updates