నిర్మాణ అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం గానీ, పని కోసం అధికారులకు లంచాలు ఇవ్వడం గానీ, అక్రమాలకు పాల్పడటం, ప్రోత్సహించడం గానీ.. వేటికీ తావు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో కొత్త పురపాలక (మున్సిపల్) చట్టం రూపుదిద్దుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు మీడియాతో మాట్లాడారు. పూర్తి అంశాలివే..
సంస్కరణలు అభివృద్ధిలో భాగమే..
అర్థవంతమైన సంస్కరణలు అభివృద్ధిలో భాగం. కొత్త మున్సిపల్ చట్టాన్ని చాలా పదును, పటుత్వంతో శక్తివంతంగా రూపొందించారు. ఈ చట్టం ద్వారా పురపాలనలో సామాన్యుల పాలిట శాపంగా మారిన అవినీతి చీడ తొలగిపోతుంది. రాజకీయ జోక్యం కూడా తగ్గిపోతుంది. సీఎం కేసీఆర్ మొండితనం, సంకల్పం తెలిసిన వారు పూర్తిగా చట్టాన్ని అవగాహన చేసిన తర్వాతే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలి.
రోడ్లు, డ్రైనేజీల చుట్టూ తిరగాలా?
శాసనసభ్యులమైన తాము శాసనాలు చేయడం మర్చిపోయి రోడ్లు, డ్రైనేజీలంటూ అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ కొత్త చట్టంతో అలాంటి పరిస్థితి మారిపోతుంది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల భాగస్వామ్యం, బాధ్యతలు ఈ చట్టంతో పెరుగుతాయి. కొత్త చట్టం పౌరుల చేతుల్లోనే స్వీయ నిర్ణయాధికారాన్ని పెట్టింది. తద్వారా ప్రజలపై కూడా బాధ్యతలు మోపినట్టవుతుంది. ప్రజలపై బాధ్యతలు పెట్టడంతో పాటు విధులను విస్మరించినా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు పదవీచ్యుతులయ్యేలా చట్టాన్ని రూపొందిచారు.
ముంబైలో ఏడు కార్పొరేషన్స్..
గుండెకాయలాంటి హైదరాబాద్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఎంల్తైన ఉంది. రాజధాని శివార్లలోని ఏడు మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా మార్చడం మంచి నిర్ణయం. ముంబై చుట్టూ ఏడు కార్పొరేషన్లు ఉంటాయని, అలాగే హైదరాబాద్ శివార్లలోని మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా మార్చారు. కొత్తగా ఏర్పాటయిన కార్పొరేషన్ల ద్వారా సిబ్బంది పెరిగి ప్రజలకు సేవలు విస్తృతంగా అందుతాయి. ఆయా కార్పొరేషన్ల పరిధిలో పన్నులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.