హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)లో మరొక అవినీతి బాగోతం బయటపడింది. నకిలీ ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్)ల కుంభకోణాన్ని అధికారులు గుర్తించారు. ఒకటి కాదు రెండు కాదు వందల సంఖ్యల్లో నకిలీ ఎల్ఆర్ఎస్లను సృష్టించి.. బాధితుల నుంచి కోట్లలో వసూలు చేసినట్లు గుర్తించారు.
1.75 లక్షల దరఖాస్తులు..
అక్రమ ప్లాట్లను క్రమబద్దీకరించడంలో భాగంగా 2015 అక్టోబర్ 28 వరకు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోవాలని హెచ్ఎండీఏ అనుమతిని ఇచ్చింది. ఇందులో భాగంగా 1.75 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అయితే వీటిలో దాదాపు 30 వేల దరఖాస్తుల పేర్లు, ప్లాట్లున్న పత్రాలను మార్చి క్లియరెన్స్ ఇచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి.
034999 నంబర్‌తో వెలుగులోకి..
సంగారెడ్డికి చెందిన మెగావత్ చందు (సర్వే నంబర్ 1654, 1655) తమ ప్లాట్ క్రమబద్దీకరించాలని హెచ్ఎండీఏకు దరఖాస్తు చేసుకున్నాడు. ప్రారంభ ఫీజు రూ.10 వేలు చెల్లించేశాడు కూడా. హెచ్ఎండీఏ అధికారులు చందుకు 034999 నంబర్‌ను కేటాయించారు. అయితే సరైన పత్రాలు సమర్పించని కారణంగా చందు దరఖాస్తును తిరస్కరించారు. ఈ సమయంలోనే ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగి రాజేంద్రనగర్ మండల పరిధిలని నెక్నాంపూర్ సర్వే నంబర్ 95లోని ప్లాట్ ఓనర్ సయ్యద్ హుస్నుద్దిన్తో కుమ్మకై.. తిరస్కరించిన హెచ్ఎండీఏ ఎల్ 034999 నంబర్‌ను ఐటీ సెల్లో ఓపెన్ చేయించి.. దరఖాస్తుదారుడి పేరును హస్నుద్దిన్గా మార్చారు. అయితే తండ్రి పేరును మాత్రం శంకర్ నాయక్ అని అలాగే ఉంచారు. టైటిల్ స్క్రూట్ని, టెక్నికల్ స్క్రూట్ని తర్వాత ఎల్ఆర్ఎస్ ప్రొసిడింగ్స్ జారీ చేసే క్రమంలోనూ ఏ ఒక్కరూ ఈ మోసాన్ని గుర్తించలేకపోయారు. అయితే ఈ మోసం ఓ ఆర్టీఏ కార్యకర్త దృష్టికి రావటంతో నకిలీ ఎల్ఆర్ఎస్ కుంభకోణం బయటపడింది.
ఔట్ సోర్సింగ్ సిబ్బందే సూత్రదారులు..
హెచ్ఎండీఏలో ఔట్సోర్సింగ్ సిబ్బందిదే హవా. డబ్బు చేతులు మార్చడంలో, అక్రమాలకు పాల్పడంలో వాళ్లు సిద్ధహస్తులు. కొంతమంది అధికారులతో చేతులు కలిపి ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. గతంలో దరఖాస్తు చేసిన ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లో పేర్లతో పాటు ప్లాట్ల నంబర్లు కూడా మార్చి క్లియరెన్స్ ఇచ్చారని గుర్తించారు. నకిలీ ఎల్ఆర్ఎస్ల బాగోతం ఐటీ సెల్ కేంద్రంగా జరిగిందని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.