Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

హెచ్‌ఎండీఏ పరిధిలో 2357 చెరువులు! ఎఫ్‌టీఎల్‌ గుర్తించింది కేవలం 165

ఒకప్పుడు చెరువులు, కుంటలు, తోటలతో అలరారిన భాగ్యనగరంలో జలవనరుల మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది. వీటి పరిరక్షణపై గతంలో పలువురు పర్యావరణ నిపుణులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఎఫ్‌టీఎల్‌ పరిధులను గుర్తించాలని హైకోర్టు 2013లో ఆదేశించింది. ఆయా చెరువులను పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోని మొత్తం 2357 చెరువులకుగాను.. ఐదేళ్లుగా ఎఫ్‌టీఎల్‌ సరిహద్దులు గుర్తించి తుది నోటిఫికేషన్‌ జారీచేసింది కేవలం 165 చెరువులకే కావడం గమనార్హం. మిగతా చెరువుల బౌండరీలు, ఎఫ్‌టీఎల్‌ గుర్తింపు పనులు నీటిపారుదల, హెచ్‌ఎండీఏ, రెవెన్యూ విభాగాల వద్ద వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉండడం, ప్రభుత్వ విభాగాల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. ఆయా చెరువుల ఎఫ్‌టీఎల్‌ (నీటి నిల్వసామర్థ్యం) సరిహద్దుల్ని గుర్తించే పనులు ఐదేళ్లుగా నత్తనడకన సాగుతుండడం గమనార్హం. కాగా నీటిపారుదల శాఖ అధికారులు మిషన్‌ కాకతీయ పేరుతో.. రెవెన్యూ అధికారులు భూదస్త్రాల ప్రక్షాళన పేరుతో బిజీగా ఉన్నామంటూ ఈ విషయంలో కాలయాపన చేస్తున్నాని పర్యావరణ వేత్తలు ఆక్షేపిస్తున్నారు.
ఏం చేయాలి? ఏం చేస్తున్నారు..
ప్రధానంగా ప్రైవేటు కన్సల్టెన్సీల సాయంతో సంబంధిత చెరువు లేదా కుంటను హెచ్‌ఎండీఏ సర్వే చేసి ఆ ప్రాథమిక నివేదికను నీటిపారుదల శాఖకు సమర్పించాలి. ఆ తరవాత నీటిపారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి మ్యాప్‌ను సిద్ధంచేసి తిరిగి హెచ్‌ఎండీఏకు అప్పగించాలి. ఆ తరవాత హెచ్‌ఎండీఏ ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరించేందుకు ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీచేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తరవాత రెవెన్యూ యంత్రాగానికి పంపిస్తారు. అక్కడ ఆమోద ముద్ర పడగానే తుది నోటిఫికేషన్‌ విడుదల చేయాల్సి ఉంది.
80 శాతం తగ్గిన చెరువులు, కుంటల విస్తీర్ణం..
ఔటర్‌కులోపల చిన్న,పెద్ద చెరువులు,కుంటల విస్తీర్ణం 2005లో సుమారు 30,978 ఎకరాలుగా ఉండేది. ఆ తరవాత రియల్‌రంగం పురోగమించడం, పొరుగు రాష్ట్రాలు, దేశాల నుంచి ఉద్యోగాలు,వ్యాపారాల కోసం సిటీకి వలసలు అధికమవడంతో శివార్లలో రియల్‌ రంగం జోరందుకుంది. ఇదే క్రమంలో అక్రమార్కుల కన్ను విలువైన జలాశయాలపై పడింది. జి.ఓ.111 పరిధిలో ఉన్న గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో నిబంధనలకు విరుద్ధంగా విల్లాలు, రియల్‌వెంచర్లు, వాణిజ్యస్థలాలు, బహుళఅంతస్థుల భవంతులువెలిసి కాంక్రీట్‌ మహారణ్యంగా మారింది. దీంతో ఆయా జలవనరుల విస్తీర్ణం ఇప్పుడు గణనీయంగా తగ్గుముఖం పట్టి 5641 ఎకరాలకు చేరడం ఆందోళన కలిగిస్తోంది. అంటే గత 13 ఏళ్ల కాలంలో సుమారు 80 శాతం మేర వీటి విస్తీర్ణం తగ్గుముఖం పట్టడం గమనార్హం. ఇందుకు పట్టణీకరణ ప్రభావం ఒక కారణమైతే, రెవెన్యూ, పంచాయతీరాజ్, చిన్ననీటిపారుదల శాఖల నిర్లక్ష్యం మరో కారణంగా ఉందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తుండడం గమనార్హం.
ప్రభుత్వం చేయాల్సినవి ఇవీ..
– చెరువులు,కుంటలను కబ్జాచేస్తున్న అక్రమార్కులపై క్రిమినల్‌ కేసులు నమోదుచేయాలి.
– ప్రతీ జలాశయానికి ఎఫ్‌టీఎల్‌ పరిధిని గుర్తించి పటిష్ట రక్షణ కంచె ఏర్పాటుచేయాలి. ఆయా జలాశయాల చుట్టూ పటిష్టమైన కట్టలు ఏర్పాటుచేయాలి.
– జలాశయాల చుట్టూ పెద్ద ఎత్తున హరితహారం చేపట్టాలి.
– ప్రతి జలాశయం పరిరక్షణకు స్థానికులతో కమిటీ ఏర్పాటుచేయాలి.
– ఇప్పటికే అక్రమార్కుల చెరువులో ఉన్న భూములను రెవెన్యూ యంత్రాంగం స్వాధీనం చేసుకోవాలి.
– ఎఫ్‌టీఎల్‌ పరిధిలో వెలిసిన అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో స్థానిక ప్రజలు, రాజకీయ పార్టీల సహకారం తీసుకోవాలి. లేని పక్షంలో కార్యక్రమం ముందుకు కదలదు.
– స్టార్మ్‌ వాటర్‌ డ్రైనేజి (వరదనీటి కాలువల) మాస్టర్‌ప్లాన్‌ను పరిగణనలోకి తీసుకొని టౌన్‌ప్లానింగ్‌ విభాగం ఎలాంటి అభివద్ధి కార్యక్రమాలను అనుమతించరాదు.
– మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా అన్ని చెరువులు, కుంటల పునరుద్ధరణ జరగాలి. తద్వారా వర్షపునీరు చెరువుల్లోకి చేరి జలకళ సంతరించుకుంటాయి.
– చెరువుల్లోకి వర్షపునీటిని చేర్చే ఇన్‌ఫ్లోఛానల్స్‌ను ప్రక్షాళన చేయాలి. వాటిపై ఉన్న ఆక్రమణలను తొలగించాలి.

Related Posts

Latest News Updates