ముంబైలోని డోంగ్రీ ప్రాంతం తండేల్ వీధిలోని కేసర్‌బాయి భవనం కూలిపోయి.. సుమారు 15 మంది స్థానికులు మరణించారు. శిథిలాల కింద మరొక 40 మంది ఉంటారని అంచనా. ఇక, క్షతగ్రాతుల సంఖ్య అయితే బోలెడు! ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో జరిగితే? వామ్మో!! పురాతన భవనాలను కూల్చడంలో ప్రభుత్వం తాత్సారం చేయడమే ఇందుకు కారణం!
భారీ వర్షాలు..
వర్షాల కారణంగా పురాతన భవనాలు కూలిపోతున్నాయి. తాజాగా ముంబైలో వందేళ్ల క్రితం నాటి భవనం కూలి.. పదుల సంఖ్యలో జనాభా మృత్యువాత పడ్డారు. ఈ తరహా భవనాలు హైదరాబాద్‌లోనూ లెక్కకు మిక్కిలే ఉన్నాయి. నగరంలో పురాతన భవనాలను గుర్తించడంలో జీహెచ్ఎంసీ తాత్సారం చేస్తోందని, ఏదయినా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు? నగరంలో 2016లో భారీగా వర్షాలు కురిశాయి. అప్పట్లో శిథిల భవనాల్లో చాలా వరకు నేలకొరిగాయి. అధికారులు ఆయా భవనాలను గుర్తించినప్పటికీ అందులో నివసించే కుటుంబాలను ఖాళీ చేయించడంలో విఫలయ్యారు. స్థానిక రాజకీయ నాయకులు ఒత్తిడి తేవటంతో కూల్చడంలో విఫలమవుతున్నట్లు తెలిసింది.
765 పురాతన భవనాలు..
హైదరాబాద్‌లో మొత్తం 765 పురాతన భవనాలు ఉన్నట్లు జీహెచ్ఎంసీ గుర్తించింది. కానీ, వీటిలో 167 భవనాలను మాత్రమే కూల్చివేశారు. 132 భవనాలకు మరమ్మత్తులు చేసినట్లు తెలిసింది. ప్రాంతాల వారీగా చూస్తే గోషామహల్లో 104 నిర్మాణాలు, బేగంపేట సర్కిల్లో 65, ఎల్బీనగర్లో 57, చార్మినార్‌లో 144, ఖైరతాబాద్‌లో 271, సికింద్రాబాద్‌లో 183, కూకట్‌పల్లిలో 57, ఫలక్‌నుమాలో 55, మలక్‌పేటలో 29, మెహదీపట్నంలో 26, కార్వాన్లో 22, రాజేంద్రనగర్‌లో 20, చాంద్రయాణ్గుట్టలో 13, ముషీరాబాద్‌లో 12, అంబర్‌పేటలో 11 భవనాలున్నట్లు అధికారులు గుర్తించారు. కానీ, ఆయా భవనాల్లో నివాసముండే వారిని ఖాళీ చేయించలేకపోతున్నారు.