Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

హైదరాబాద్‌లో ఎఫ్‌ఎస్‌ఐ నిబంధన తొలగింపు

హైదరాబాద్‌ స్థిరాస్తి రంగానికి షాక్‌ తగలనుంది. అపరిమిత భవనాల ఎత్తు (ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌ – ఎఫ్‌ఎస్‌ఐ) నిబంధనలకు తెలంగాణ ప్రభుత్వం కళ్లెం వేయనుంది. ఇందుకు కారణమేంటో తెలుసా? నగరంలో పెరిగిపోతున్న నీటి కొరత!
ఐటీ కారిడార్లలో విపరీతం..
తీవ్రమైన నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రధాన నగరాల జాబితాలో చెన్నై, బెంగళూరు తర్వాత హైదరాబాద్‌ కూడా చేరింది. ఐటీ కారిడార్‌ ప్రాంతాల్లో హైటెక్‌ సిటీ – మాదాపూర్‌ ప్రాంతాల్లో నీటి ఎద్దడి సమస్య మరింత తీవ్రంగా ఉందని అధికారులు గుర్తించారు. ఆకాశహర్మ్యాలు, ఎల్తైన భవనాలు విపరీతంగా పెరిగిపోవడంతో నీటి సమస్య ఏర్పడుతుందని, అందుకే అపరిమిత ఎఫ్‌ఎస్‌ఐ నిబంధనలను తొలగించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనల సవరణలతో ఎల్తైన ఆకాశహర్మ్యాల నిర్మాణాలు కొంత వరకు తగ్గుతాయని, దీంతో నీటి సమస్యను కొంత వరకూ తీర్చొచ్చని అభిప్రాయం. ఐటీ కారిడార్‌లోని భూగర్భ మట్టాలు 10 మీటర్ల నుంచి 13 మీటర్లకు పడిపోయాయని రికార్డులు వెల్లడిస్తున్నాయి.
ఏటా 10–15 లక్షల చ.అ.
2006లో అపరిమిత ఎఫ్‌ఎస్‌ఐ నిబంధనలను తీసుకొచ్చింది. దీంతో హైటెక్‌సిటీ, మాదాపూర్‌ వంటి ఐటీ కారిడార్లలో విపరీతంగా ఆకాశహర్మ్యాలు వెలిశాయి. దీంతో ఇప్పుడు ఆ ప్రాంతంలో విపరీతమైన నీటి కొరత ఏర్పడింది. ఏటా హైటెక్‌ సిటీ పరిసర ప్రాంతాల్లో కమర్షియల్‌ ప్రాజెక్ట్‌లు కాకుండా 10–15 లక్షల చదరపు అడుగుల నివాస సముదాయాలు వస్తున్నాయి. కోకాపేట్‌ వంటి కొత్త అభివృద్ధి ప్రాంతాలతో సహా కలిపి గచ్చిబౌలి మొత్తం ఏరియా 18.5 చదరపు కిలో మీటర్లు. మాదాపూర్‌ ఏరియా 6 చదరపు కిలో మీటర్లు ఉంటుంది.
దేశంలోనే హైదరాబాద్‌ ఒక్కటే..
ముంబైలో ఎఫ్‌ఎస్‌ఐ 2.5 నుంచి 5 మీటర్లు, చెన్నై 3.25 మీటర్లు, ఢిల్లీ 1.2 నుంచి 4 మీటర్లు, పుణేలో 2 నుంచి 3 మీటర్లు, బెంగళూరులో 2.5 మీటర్లు. దేశంలో అపరిమిత ఎఫ్‌ఎస్‌ఐ ఉన్న నగరం ఒక్క హైదరాబాదే. ఇక్కడ డెవలపర్‌ తాను కోరుకున్న ఎత్తులో భవనాలను నిర్మించడానికి ప్రభుత్వం అనుమతినిస్తుంది. ఇతర నగరాల్లో ఎకరం స్థలంలో 2 నుంచి 2.5 లక్షల చదరపు అడుగులకు మించి నిర్మాణాలను చేపట్టలేరు. మిగిలిన స్థలాన్ని ఓపెన్‌ స్పేస్‌గా ఒదిలేయాలి. అదే హైదరాబాద్‌లో అయితే ఎకరం స్థలంలో 10 లక్షల చదరపు అడుగులు అంతకంటే ఎక్కువే నిర్మాణాలు చేపట్టవచ్చు. దీంతో భూమిపై ఒత్తిడి పెరిగి నీటి ప్రవాహం తగ్గుతుంది. తక్కువ స్థలం కారణంగా ఇరుకైన రహదారులు ఏర్పడతాయి.
హైటెక్‌ సిటీలో అయినా అమలు చేయాలి..
అపరమిత ఎఫ్‌ఎస్‌ఐ సవరణలను కనీసం హైటెక్‌ సిటీ, మాదాపూర్‌ వంటి దక్షిణ ప్రాంతాలనికైనా అమలు చేయాలని ఓ సీనియర్‌ కన్సల్టెంట్‌ అభిప్రాయపడ్డారు. ఎమర్జింగ్‌ ప్రాంతాలైన వరంగల్‌ జాతీయ రహదారి, కరీంనగర్‌ హైవే వంటి ప్రాంతాల్లోకి పెట్టుబడులను ఆకర్షించాలంటే అపరిమిత ఎఫ్‌ఎస్‌ఐ నిబంధనలు అవసరమేనని అభిప్రాయపడ్డారు.
ఎఫ్‌ఎస్‌ఐ కారణంగా ధరల వృద్ధి..
అపరిమిత ఎఫ్‌ఎస్‌ఐ కారణంగా భూముల ధరలు కూడా పెరుగుతున్నాయని ప్రెస్జిట్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌. సురేష్‌ కుమార్‌ తెలిపారు. బెంగళూరులో రూ.16–17 కోట్ల పలికే స్థలం.. హైదరాబాద్‌లో రూ.25 కోట్లు పలుకుతుందని తెలిపారు. ఎఫ్‌ఎస్‌ఐ నిబంధనలను సవరించాల్సిన అవసరముందని అపర్ణా కన్‌స్ట్రక్షన్స్‌ డైరెక్టర్‌ డీఎస్‌ ప్రసాద్‌ తెలిపారు. ఇరుకైన రహదారులు, పుట్టుగొడుగుల్లాంటి భవనాలతో హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి వంటి దక్షిణ ప్రాంతాల్లో విపరీతమైన ట్రాఫిక్‌ జామ్‌ ఉంటుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో అపరిమిత ఎఫ్‌ఎస్‌ఐ ఉన్నప్పటికీ ప్రాజెక్ట్‌ చేపట్టబోయే ప్రాంతంలో నీటి లభ్యత, రహదారులు, ఓపెన్‌ స్పేస్, గ్రీనరీ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆకాశహర్మ్యాల ప్రాజెక్ట్‌లను చేపట్టాలని ఓ ఆర్కిటెక్ట్‌ సూచించారు. లేనిపక్షంలో మౌలిక సదుపాయాలు లేని కారణంగా అమ్మకాలు ఆశించిన స్థాయిలో జరగవని తెలిపారు.

Related Posts

Latest News Updates