ఔరంగాబాద్ ఇండస్ట్రియల్ సిటీ (ఏయూఆర్ఐసీ) దేశంలోనే తొలి గ్రీన్‌ఫీల్డ్ పారిశ్రామిక కేంద్రాన్ని అభివృద్ధి చేస్తోంది. ఢిల్లీ–ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (డీఎంఐసీడీసీ), మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఐడీసీ) మధ్య ఒక స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ)గా ఈ ఏయూఆర్ఐసీని ఏర్పాటు చేస్తున్నారు. 10 వేల ఎకరాల్లో రానున్న ఏయూఆర్ఐసీలో వచ్చే ఐదేళ్లలో రూ.70 వేల కోట్లను సమీకరిస్తామని.. పదేళ్లలో ప్రత్యక్షంగా 3 లక్షల మందికి ఉద్యోగాలను కల్పిస్తామని ఏయూఆర్ఐసీ జాయింట్ ఎండీ గజానన్ పాటిల్ తెలిపారు.
జూన్ నుంచి హోయ్‌సంగ్ ఉత్పత్తులు మొదలు..
తొలి దశలో కొరియా, స్వీడన్, జర్మనీ దేశాలకు చెందిన పలు ఇంజనీరింగ్ కంపెనీలకు 5,07,164 లక్షల చ.మీ. (52 ప్లాట్లు) స్థలాన్ని కేటాయించాం. వీటి ద్వారా రూ.6 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దక్షిణ కొరియాకు చెందిన హోయ్‌సంగ్ కార్పొరేషన్ రూ.3 వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది. జూన్‌లో ప్లాంట్‌లో ఉత్పత్తుల తయారీ ప్రారంభమవుతుంది. దీంతో పాటూ రష్యాకు చెందిన నోవోలిపెట్స్క్ స్టీల్ (ఎన్ఎల్ఎంకే), చైనాకు చెందిన గౌంగ్డాంగ్ బెహీ మెడికల్ టెక్నాలజీ, జపాన్‌కు చెందిన ఫ్యూజీ సిల్వర్టెక్ వంటి కంపెనీలు ఆసక్తి ఉన్నాయి. త్వరలోనే రష్యాకు చెందిన 2 ప్రముఖ తయారీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోనున్నాం.
హైదరాబాద్ నుంచి ఐటీ కంపెనీలు..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఫార్మా కంపెనీలతో చర్చలు జరుపుతున్నాం. వీటితో పాటూ ఫుడ్ ప్రాసెసింగ్, ఇంజనీరింగ్, ఆటో మొబైల్ అపార అవకాశాలున్నాయి. ఇతర మెట్రో నగరాల్లోని కంపెనీలను ఆకర్షించేందుకు బెంగళూరు, ఢిల్లీల్లోనూ రోడ్ షోలను నిర్వహిస్తాం. స్కోడా, సిమెన్స్, బజాజ్, జాన్సన్ అండ్ జాన్సన్, క్రాప్ట్ అండ్ గ్రీవ్స్, పార్కిన్స్, లైబెహర్, లుపిన్ వంటి దిగ్గజ కంపెనీలు ఏయూఆర్ఐసీలో ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తిగా ఉన్నాయి. దేశంలోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)లో 33 శాతం, స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 15 శాతం మహారాష్ట్ర వాటా ఉంటుంది.
మౌలిక వసతుల కోసం రూ.7947 కోట్లు..
ఏయూఆర్ఐసీ మౌలిక వసతుల అభివృద్ధి కోసం కేంద్రం రూ.7947 కోట్ల నిధులను కేటాయించింది. 60 శాతం స్థలాన్ని పారిశ్రామిక అవసరాలకు, 40 శాతం స్థలాన్ని నివాస, వాణిజ్య, సోషల్–సాంస్కృతిక అవసరాలకు కేటాయించాం. ధర చ.మీ.కు రూ.3200. తొలి దశ అభివృద్ధి పనులు 90 శాతం మేర పూర్తయ్యాయి. 2022లో రెండో దశ మొదలవుతుంది. ఆన్లైన్ ద్వారా సింగిల్ విండోలో అనుమతులను జారీ చేస్తున్నాం. దరఖాస్తు చేసిన 10 రోజుల్లో అనుమతులు ఇస్తున్నాం. స్థల కేటాయింపు నుంచి మౌలిక వసతులు, నిర్మాణ, పరిశ్రమ అనుమతులు అన్నింటికీ ఒకే పర్మిషన్ ఇచ్చేందుకు వీలుగా కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చాం. రూ.4 వేల కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టే అల్ట్రా మెగా ప్రాజెక్ట్‌లకు 100 శాతం స్థూల ఎస్జీఎస్టీ, క్యాపెక్స్ ఇన్వెస్ట్మెంట్స్ రీఫండ్ ఉంటాయి.