Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

హైదరాబాద్‌ చుట్టూ 11 ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్స్‌

హైదరాబాద్‌ మహా నగరం చుట్టూ అత్యాధునిక వసతులు.. ఆధునిక హంగులతో ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌లను నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని చుట్టు పక్కల 11 చోట్ల వీటిని అభివృద్ధి చేసే దిశగా పురపాలక శాఖ ప్రతిపాదనలు తయారు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు, భాగస్వామం (పీపీపీ) పద్ధతిలో ఈ కాలనీలను ఏర్పాటు చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది.
నూతన మున్సిపాలిటీ చట్టంలోనూ..
ఇటీవల శాసనసభలో ఆమోదముద్ర పడ్డ పురపాలక చట్టం–2019లోను ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ పాలసీపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. దేశ రెండో రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ చారిత్రక ఉనికిని కాపాడుకుంటునే ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించాలని సర్కారు నిర్ణయించింది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా నగరంపై జనాభా తాకిడిని నివారించేందుకు శాటిలైట్‌ టౌన్‌షిప్‌లను వినియోగించుకోవాలని రాష్ట్ర సర్కారు భావిస్తోంది. ప్రస్తుతం ప్రతి చదరపు కిలోమీటరుకు 11 వేల జనాభా ఉండగా.. త్వరలోనే ఇది రెట్టింపయ్యే అవకాశముందని అంచనా. ఎడాపెడా జరిగే నగరీకరణ, వాహన విస్ఫోటనంతో కాలుష్య నగరంగా మారే అవకాశముందని ఆందోళన చెందుతోంది. ఈ క్రమంలోనే కాలుష్యరహిత నగరంగా చేయడమేగాకుండా.. పెట్టుబడులను ఆకర్షించేందుకు విస్తృతంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యంగా రోడ్లు, టౌన్‌షిప్‌లను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రపంచ శ్రేణి నగరాల సరసన నిలపాలని భావిస్తోంది.
50 నుంచి 100 ఎకరాల్లో..
వాక్‌ టు వర్క్‌ పద్ధతిలో వీటిని నిర్మించనున్నట్లు ఇటీవల ప్రవేశపెట్టిన పురచట్టంలో స్పష్టం చేసింది. హెచ్‌ఎండీఏ పరిధిలో 100 ఎకరాలు, హెచ్‌ఎండీఏ పరిధి బయట 50 ఎకరాల్లో వీటిని నిర్మించడానికి ప్రణాళిక తయారు చేస్తోంది.ఈ టౌన్‌ షిప్‌లలో రెసిడెన్షియల్, కమర్షియల్, ఆఫీస్, వినోద ఇతర్రతా అన్ని హంగులు ఉండేలా డిజైన్‌ చేయనుంది. ఈ మేరకు వీటిని నిర్మించడానికి ముందుకొచ్చే డెవలపర్లకు ప్రత్యేక రాయితీలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ల విధివిధానాలను త్వరలోనే ఖరారు చేయనున్నట్లు స్పష్టం చేసింది.
రీజినల్‌ రింగ్‌ రోడ్‌ చుట్టూ టౌన్‌షిప్‌
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రీజినల్‌ రింగ్‌రోడ్డును నిర్మించాలని భావిస్తున్న ప్రభుత్వం.. వాటి వెంట ఆధునిక వసతులతో కూడిన శాటిలైట్‌ టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఒకొక్క టౌన్‌షిప్‌కు కనీసం వెయ్యి ఎకరాల నుంచి 5 వేల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసేందుకు వీలుగా మున్సిపల్‌ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ, రోడ్లు భవనాల శాఖ ప్రతిపాదనలు తయారు చేస్తున్నాయి. ఇందులో భాగంగా మాడ్గుల మండలం నాగిల్ల పరిసరాల్లో టౌన్‌షిప్‌ రానుంది. అలాగే బీజాపూర్‌ మార్గంలో చేవెళ్ల–చెన్గొముల్‌ మధ్య ఇంకో టౌన్‌షిప్‌ నిర్మించేందుకు ప్రణాళిక తయారు చేశారు.శాటిలైట్‌ టౌన్‌ షిప్‌లలో గృహా, వాణిజ్యావసరాలకు వినియోగించుకోవాలని యోచిస్తున్నాయి.
శాటిలైట్‌ టౌన్‌షిప్‌లు ఏర్పాటుచేసే ప్రాంతాలివే..
– ముంబై జాతీయ రహదారి సమీపంలో
– ఆంధోల్‌ రోడ్డులో
– మెదక్‌ రోడ్డు నర్సాపూర్‌ పరిసర ప్రాంతాలు
– తూప్రాన్‌ పరిసర ప్రాంతం
– కరీంనగర్‌రోడ్డు ఆహ్మదీపురం పరిసర ప్రాంతం
– వరంగల్‌రోడ్డు యాదగిరిగుట్ట సమీపంలో
– విజయవాడరోడ్డు చౌటుప్పల్‌ దగ్గరలో
– నాగార్జునసాగర్‌ రోడ్డు నాగిళ్ల పరిసరాల్లో
– శ్రీశైలం రోడ్డు వెల్డండ సమీపంలో
– బెంగళూరు రోడ్డు బాలానగర్‌ పరిసర ప్రాంతం
– చేవెళ్ల పరిగి రోడ్డు చెన్గొముల్‌ మార్గం

Related Posts

Latest News Updates