Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

111 జీవో ప్రాంతాల్లో.. పది శాతం కూడా నిర్మాణాలొద్దు

మూడేళ్లుగా ప్లాటు కొనేందుకు యత్నిస్తున్న లోకేష్‌ను ఓ రియల్టర్‌ ప్రకటన బాగా ఆకర్షించింది. శంషాబాద్‌లోని సర్కుడా గ్రామంలో సర్వే నంబరు 287లో ఆ లేఅవుట్‌ ఉంది. ప్లాటును ఇటీవలే వెళ్లి పరిశీలించాడు. అది జీవో 111 పరిధిలోకి వస్తుందని తెలిసి.. రియల్టర్‌ను ప్రశ్నించాడు. జీవో 111 ప్రకారం 10 శాతం స్థలంలో నిర్మాణం చేపట్టి.. మిగతా 90 శాతాన్ని ఖాళీగా, పచ్చదనం కోసం వదిలివేయవచ్చని అతను చెబుతున్నాడు…

 రియల్టర్‌ మాటలు నమ్మి అక్కడ స్థలంలో కొనుగోలు చేస్తే మాత్రం కష్టార్జితం బూడిదలో పోసిన పన్నీరు అవుతంది. ఎలాగంటరా!

ఈ ప్రత్యేక కథనం చదవండి..

దశాబ్దం పైగా జరుగుతున్న అక్రమం.. తక్కువ ధర అని కొని మోసపోయిన అమాయకులు.. పచ్చదనంలో నివసించొచ్చని ఆశపడి సొమ్ము తగలేసుకున్న బడాబాబులు.. చేతులు కాల్చుకున్న ఫ్రవాసాంధ్రులు, వ్యాపారులు, వృత్తి నిపుణులు.. కఠినమైన నిబంధనలు అమలవుతున్నప్పటికీ నేటికీ మోసపోతున్న కొనుగోలుదారులు.. 111 జీవో ప్రాంతంలో ప్లాట్లు కొనకూడదని.. ఎలాంటి నిర్మాణాలకు అనుమతివ్వకూడదని స్వయంగా కలెకృర్‌ చెప్పినా యథేచ్చగా ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. హడా మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేసేటప్పుడు సుమారు 44 శాతం భూములు 111 జీవోలో ఉన్నాయని తేలింది. 

1920లో ఏర్పాటైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌ సాగర్ల చుట్టూ గల 84 గ్రామాల్లో.. ఎలాంటి లేఅవుట్లు వేయకూడదు. నిర్మాణాల్ని చేపట్టకూడదు. రెసిడెన్షియల్‌ కాలనీలను అభివృద్ధి చేయకూడదని 111 జీవో నిబంధనలు స్పష్టంగా చెబుతూనే ఉన్నా.. రియల్టర్లు పట్టించుకోలేదు. లేఅవుట్లు వేస్తూనే ఉన్నారు. అమాయకుల్ని బురిడి కొట్టిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా బూమ్‌ సమయంలో పుట్టగొడుగుల్లా లేఅవుట్లు వెలిశాయి. అంతే జోరుగా ప్రజలకు అంటగట్టేశారు. కొందరు డెవలపర్లు తెలివిగా శంషాబాద్‌ విమానాశ్రయం చేరువలో ధర తక్కువలో ప్లాట్లు అంటూ విక్రయించారు. మరికొందరు పచ్చదనం పేరిట ప్రజల్ని నట్టేట్ట ముంచేశారు. వెయ్యి గజాల ప్లాటులో కనీసం వంద గజాల్లో ఇల్లు కట్టుకుని.. మిగతా స్థలాన్ని పచ్చదనానికి కేటాయించొచ్చని నమ్మబలుకుతూ కొనుగోలుదారుల్ని మోసం చేశారు. 500 గజాల ప్లాటులో యాభై గజాల్లో ఇల్లు కట్టుకుని మిగతా స్థలంలో గ్రీనరీని అభివృద్ధి చేయవచ్చని చెప్పి అమాయకులకు ప్లాట్లను అంటగట్టేశారు. 111 జీవోలో రిసార్టులను అభివృద్ధి చేస్తూ.. వాటి పక్కనే విల్లాల్ని విక్రయిస్తూ.. కోట్ల రూపాయల్ని దండుకుంటున్నారు. ప్రవాసాంధ్రులు, వ్యాపారులు, వృత్తి నిపుణులు, విశ్రాంత ఉద్యోగులు తదితరులు ఇక్కడ విల్లాలు కొన్న వారి జాబితాలో ఎక్కువగా ఉన్నారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు చేరువలో.. ధర తక్కువ కావడంతో సామాన్యులు సైతం.. అప్పొసొప్పొ చేసి ప్లాట్లను కొనేశారు. ఆలస్యంగా నిజం తెలుసుకుని వీరంతా ప్రస్తుతం లబోదిబోమంటున్నారు. పిల్లలు పెళ్లిళ్లకు పనికొస్తాయని భావించిన వారంతా.. ఈ ప్లాట్లను విక్రయించినా సొమ్ము రాదని తెలిసి సొమ్మసిల్లిపోతున్నారు. తమను మోసం చేసిన రియల్టర్లను, డెవలపర్లను కఠినంగా శిక్షించాలని ప్లాటు కొని మోసపోయిన వారంత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

111 జీవోలో కొనొద్దు

హిమాయత్‌, ఉస్మాన్‌ సాగర్‌ చుట్టుపక్కల పది కిలోమీటర్ల దూరంలో వేసే లేఅవుట్లను, విల్లాలను ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదు. ధర తక్కువ అని ఎవరైనా ఆశపెట్టడానికి ప్రయత్నించినా బోల్తా పడకండి. గేటెడ్‌ కమ్యూనిటీ అన్నా.. ఆధునిక విల్లాలన్నా.. హరిత భవనాలన్నా.. వీటికి ప్రభుత్వం నుంచి సరైన అనుమతుల్లేవన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఒకవేళ నేడు ఎలాగోలా ఇందులో కొనుగోలు చేసినా.. తర్వాత ప్రభుత్వం వీటిని కూల్చివేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. కాబట్టి, ఇందులో కొనకపోవడమే మేలని అధికారులు అంటున్నారు. 

– హడా మాస్టర ప్లాన్‌ ప్రకారం మీరు చెబుతోన్న ప్రాంతం బయో కన్జర్వేషన్‌ జోన్, 111 జీవో పరిధిలోకి వస్తుంది. చాలామంది రియల్టర్లు 111 జీవోను తప్పుగా అర్థం చేసుకోవడమే కాదు.. లోకేష్‌ లాంటి అమాయకుల్ని తప్పు దోవ పట్టిస్తున్నారు. 111 జీవో పరిధిలో వచ్చే ప్రాంతాల్లో..  లేఅవుట్లు వేయవచ్చని.. పది శాతం స్థలంలో నిర్మాణం చేపటి మిగతా 90 శాతం స్థలాన్ని ఖాళీగా వదిలిపెట్టొచ్చని ఎక్కడా పేర్కొనలేదు. కొంతమంది డెవలపర్లు బయో కన్జర్వేషన్‌ జోన్‌ పరిధిలో ఫామ్‌ హౌస్‌లు/రిసార్టులు కడుతూ మార్కెటింగ్‌ చేస్తున్నారు. పది శాతం స్థలంలో ఫామ్‌ హౌజ్‌/రిసార్ట్‌ కట్టి మిగతా 90 శాతం స్థలంలో పచ్చదనాన్ని అభివృద్ధి చేయవచ్చని చెబుతూ కొనుగోలుదారుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. బయో కన్జర్వేషన్‌ జోన్‌ పరిధిలో ఎలాంటి నిర్మాణ కార్యకలాపాల్ని అనుమతించరు. ముఖ్యంగా కాలనీలు వంటివి అభివృద్ధి చేయకూడదు. అసలు 111 జీవో పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో లేఅవుట్లు వేయడమే నిషిద్ధం. ఈ జీవోను కఠినంగా అమలు చేయాలనే పిటిషన్‌ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ జోన్‌లో వేసిన లేఅవుట్లను రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ రద్దు చేశారు. మొత్తం 84 గ్రామాల్లో ఎలాంటి నిర్మాణాలకు అనుమతించకూడదని గ్రామపంచాయతీలకు ఆదేశాలు జారీ చేశారు. 

Related Posts

Latest News Updates