జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ హైదరాబాద్‌లో 1500 ఎకరాల స్థలాన్ని అభివృద్ధి చేయడానికి వ్యూహాత్మక భాగస్వామి కోసం వెతుకుతోంది. శంషాబాద్‌లోని ఎయిర్పోర్ట్ సిటీలో కమర్షియల్, ఆఫీస్ భవనాలు, రిటైల్, హోటల్స్, లాజిస్టిక్, వేర్ హౌజ్ పార్క్‌ల వంటివి అభివృద్ధి చేస్తామని కంపెనీ తెలిపింది. ‘‘అభివృద్ధి పనుల కోసం వ్యూహాత్మక భాగస్వామి కోసం వెతుకుతున్నామని.. అలాగే ల్యాండ్‌ను డెవలపర్స్‌కు లేదా నేరుగా కంపెనీలకే అందిస్తామని వాళ్లే స్వయంగా నిర్మాణం చేపట్టుకోవచ్చని’’ జీఎంఆర్ ఎయిర్పోర్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ సీఈఓ అమన్ కపూర్ తెలిపారు.
10 లక్షల చ.అ.ల్లో బిజినెస్ పార్క్
జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎయిర్ పోర్ట్ సిటీలో బిజినెస్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తొలి దశలో 10 లక్షల చదరపు అడుగుల్లో 6 టవర్ల ఆఫీస్ స్పేస్‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. 3–4 ఏళ్లలో నిర్మాణం పూర్తవుతుంది. దీనికి దగ్గర్లోనే 19 ఎకరాల్లో రిటైల్ డెవలప్మెంట్ కూడా రానున్నట్లు సమాచారం.