Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

2 బీహెచ్‌కే @ రూ.40 లక్షలు కుచ్చుటోపీ

కేసీఆర్‌ రెండు పడక గదులు (2 బీహెచ్‌కే) గృహాన్ని అందిస్తామని నమ్మించి రూ.40 లక్షలు ఎగనామం పెట్టాడో ఘనుడు. హైదరాబాద్‌ కలెక్టరేట్‌ ఆఫీసులో ఉద్యోగినని మాయమాటలు చెప్పి.. 31 మంది నుంచి రూ.40 లక్షల వరకూ వసూలు చేసి పారిపోయిన సంఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైంది.
బంజారాహిల్స్‌ దూద్‌ఖానా బస్తీలో నివసించే బి. కొటేష్‌ నాయక్‌ జీహెచ్‌ఎంసీలో స్వచ్చ ఆటో డ్రైవర్‌. 2017లో అక్టోబర్‌లో ఇతడి ఇంటి పక్కనే బంగారు సురేష్‌ కుమారాచారి అద్దెకు దిగాడు. తాను కలెక్టరేట్‌ సూపరింటెండెండ్‌గా పనిచేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. పంజగుట్ట ఐఏఎస్‌ క్వార్టర్స్‌ కూల్చిన ప్రాంతంలో 125 గజాల స్థలం తనకు జీవో 58, 59 కింద కేటాయించారని చెప్పాడు. ఆ స్థలాన్ని అమ్ముతానని ఇందుకు కొంత ఖర్చవుతుందని రూ.50 వేలు కావాలని కోటేష్‌ను అడిగాడు. నమ్మిన కోటేష్‌ రూ.50 వేలు చెల్లించాడు. అంతేకాకుండా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను కూడా తన ఆధీనంలో ఉన్నాయని, రూ.50 వేలకు చొప్పున విక్రయిస్తానని చెప్పడంతో 31 మంది నుంచి కోటేష్‌ రూ.15.50 లక్షలు వసూలు చేసి సరేష్‌ కుమారాచారికి ఇచ్చాడు. అంతేకాకుండా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పైరవీ కోసం ఖర్చవుతుందని చెప్పగా వారందరూ నుంచి రూ.2 వేల చొప్పున వసూలు చేసి రూ.70 వేలు ఇచ్చాడు.
కలెక్టరేట్‌లో అసలు సీన్‌..
ఈ ఏడాది జనవరి 2న బాధితులు అంతా సురేష్‌ కుమారాచారిని తమ స్థలాలు ఏవని నిలదీశారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పేరుతో మరొక 35 మంది నుంచి రూ.19.70 లక్షలు వసూలు చేయడంతో ఆ ఇళ్లు ఏవని వారు కూడా నిలదీశారు. ఈ విషయంలో సురేశ్‌ చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందని బాధితులు హైదరాబాద్‌ కలెక్టర్‌ ఆఫీసు వెళ్లి ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. అసలు సురేష్‌ కుమారాచారి అనే ఉద్యోగి లేడని తెలిసింది. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు బంజారాహిల్స్‌ పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం సురేశ్‌కుమారాచారి పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసులు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

Related Posts

Latest News Updates