తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ చట్టంలో సవరణలు చేయనుంది. 200 చదరపు మీటర్లు (240 చదరపు గజాల) లోపు నిర్మించే నివాస భవనాల నిర్మాణాలకు అనుమతులు, మార్టిగేజ్ కూడా అవసరం లేదు. జస్ట్! డెవలపర్ లేదా ప్రాపర్టీ యజమాని స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే చాలు.. నిర్మాణ అనుమతులొచ్చినట్టే!!
ఈ తరహా స్వీయ ధ్రువీకరణ (సెల్ఫ్ డిక్లరేషన్) విధానాన్ని తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ (టీఎస్ఐ–పాస్)లో అమలు చేస్తున్న విషయం తెలిసిందే. సేమ్ ఇలాంటి విధానాన్నే స్థిరాస్తి రంగ అనుమతుల్లోనూ తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో నిర్మాణ అనుమతులు వేగవంతం కావటంతో పాటూ పట్టణ ప్రణాళిక విభాగంలో అవినీతికి చెక్ పట్టవచ్చని ప్రభుత్వ అభిప్రాయం.
ముందుగా జీహెచ్ఎంసీ పరిధిలో..
సెల్ఫ్ డిక్లరేషన్ నిబంధనలను మున్సిపల్ కార్పొరేషన్స్, జీహెచ్ఎంసీ చట్టంలో పొందుపర్చనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అనుమతి పొందిన లే అవుట్లలో నివాస భవనం నిర్మాణం కోసం స్వీయ ధ్రువీకరణ విధానాన్ని అమలు చేయనున్నారు. అయితే సదరు ప్రాపర్టీ యజమాని లేదా డెవలపర్ నివాస భవన నిర్మాణానికి సంబంధించి తను బాధ్యుడిగా, జవాబుదారుడిగా ఉంటానని ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది.
ఓసీ కూడా అవసరం లేదిక..
టీఎస్ఐ–పాస్ తరహాలోనే డాక్యుమెంట్ల పరిశీలన కోసం ఏడు రోజుల స్క్రూట్నీ విధానాన్ని కూడా నిర్మాణ రంగంలోకి తీసుకురానున్నారు. నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసిన ఏడు రోజుల్లోగా మున్సిపల్ విభాగం స్పందిచకపోతే.. డీమ్డ్ అనుమతిగా పరిగణించబడుతుంది. దీంతో పాటూ 200 చదరపు మీటర్ల లోపు ప్లాట్లకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) కూడా అవసరం లేదని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
అతిక్రమిస్తే మూడేళ్ల జైలు శిక్ష..
అక్రమ నిర్మాణాలు, నిర్మాణదారులపై ఉక్కుపాదం మోసేందుకు మున్సిపల్ విభాగాన్ని మరింత పటిష్టపరచనున్నారు. డెవలపర్ గానీ ప్రాపర్టీ యజమానీ గానీ అనుమతి తీసుకోకుండా నిర్మాణం చేస్తే 3 సంవత్సరాల పాటు జైలు శిక్ష లేదా భవన నిర్మాణ వ్యయంలో 10 శాతం జరిమానాను విధిస్తారు. సెక్షన్–250 ప్రతిపాదిత మున్సిపల్ చట్టం ప్రకారం.. ప్రాపర్టీ ఓనర్ చట్ట విరుద్ధంగా నిర్మాణాలను చేపట్టినట్లయితే లేదా మాస్టర్ ప్లాన్ అనుమతికి వ్యతిరేఖంగా నిర్మాణాలు ఉంటే సదరు ఓనర్లు, ప్రాపర్టీల మీద విచారణ జరిపి జైలు శిక్ష విధిస్తారు.