Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

2022 నుంచి స్థలాలకు టైటిల్‌ గ్యారంటీ

దేశీయ రియల్‌ ఎస్టేట్‌ చరిత్రలో కొత్త శకం ఆవిష్కృతం కానుంది. 2022 నుంచి దేశవ్యాప్తంగా స్థలాలకు టైటిల్‌ గ్యారంటీ చట్టాన్ని అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే హర్యానాలో ప్రయోగాత్మకంగా ఈ చట్టాన్ని ప్రవేశపెట్టింది కూడా. భవిష్యత్తులో అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని యోచిస్తోంది.

టైటిల్‌ గ్యారంటీ వ్యయం భరించేది కేంద్రమే..
2011 యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూసంస్కరణల ముసాయిదా చట్టానికి మార్పులు, చేర్పులు చేసి.. కొత్త ముసాయిదాను రూపొందించాలని కేంద్ర నిర్ణయించింది. ఈ బాధ్యతను నీతి ఆయోగ్‌కు అప్పగించింది. టైటిల్‌ గ్యారంటీ చట్టం అమలుకు అవసరయ్యే వ్యయాన్ని కూడా కేంద్రమే భరించడానికి సిద్ధమైంది. భూ సర్వే, రెవెన్యూ సంస్కరణలకు నిధులను సమకూర్చేందుకు కేంద్రం ఇదివరకే అంగీకరించిన విషయం తెలిసిందే. భూ భారతి, మొదలు సమగ్ర భూ సర్వేకు కూడా నిధులను విడుదల చేసింది.
హర్యానా, మహారాష్ట్ర, రాజస్థాన్‌లో..
గతంలో జాతీయ భూ రికార్డుల నవీకరణ (ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ) కార్యక్రమాన్ని యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని స్థానంలోనే ఎన్‌డీఏ ప్రభుత్వం డిజిటల్‌ ఇండియా భూ రికార్డుల నవీకరణ ప్రొగ్రామ్‌ (డీఐఎల్‌ఆర్‌ఎంపీ)ను తీసుకొచ్చింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్ధేశం టైటిల్‌ గ్యారంటీ చట్టాన్ని అమలు చేయడం. ఈ నేపథ్యంలోనే గతేడాది హర్యానాలోని ఒక జిల్లాలో టైటిల్‌ గ్యారంటీని పైలెట్‌ ప్రాజెక్టుగా మొదలు పెట్టింది. అలాగే మహారాష్ట్ర, రాజస్థాన్‌లోని పట్టణ ప్రాంతాల్లోను ఈ విధానం అమలులో కొంత ముందడుగు పడింది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరడంతో టైటిల్‌ గ్యారంటీ చట్టంపై ఆశలు చిగురించాయి.
తెలంగాణ పరిస్థితి ఏంటి?
ఇదిలా ఉంటే టైటిల్‌ గ్యారంటీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కాస్త ముందడుగలోనే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే కేసీఆర్‌ సర్కారు రాష్ట్రంలో కొత్త రెవిన్యూ చట్టాన్ని తీసుకురావాడానికి నిపుణుల కమిటీ కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలనే ఉద్ధేశంతో టైటిల్‌ గ్యారంటీ చట్టాన్ని ప్రవేశపెట్టడమే ఉత్తమ మార్గమమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న భూ చట్టాలను అధ్యయనం చేస్తోంది. వచ్చే శాసనసభ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టానికి ఆమోదముద్ర వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం..
టైటిల్‌ గ్యారంటీతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం వస్తుంది. అయితే టైటిల్‌ గ్యారంటీని ప్రవేశపెట్టాలంటే హద్దులు, టైటిల్‌ క్లియర్‌ అవసరం. దీంతో భూసర్వే నిర్వహిస్తే తప్ప ఈ చట్టం అమలు సాధ్యం కాదు. 2022లోపు టైటిల్‌ గ్యారంటీని అందుబాటులోకి తీసుకురావాలని నీతి ఆయోగ్‌ సూచించడం కూడా మోడీ సర్కారు భూ సంస్కరణల వైపు మొగ్గు చూపడానికి కారణంగా కనిపిస్తోంది.

Related Posts

Latest News Updates