Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

2150 చ.అ. ఇళ్లూ.. పీఎంఏవై పరిధిలోకే!

అందుబాటు గృహాలు అనగానే విస్తీర్ణం తక్కువగా ఉండే చిన్న ఫ్లాట్లనే అభిప్రాయం చాలా మందికి ఉంటుంది. కానీ, ఇది గతం. కేంద్రం అందుబాటు గృహాల పరిధిని విస్తరించింది. మిడిల్‌ ఇన్‌కం గ్రూప్‌ (ఎంఐజీ)–1 కింద 160 చ.మీ., ఎంఐజీ–2 కింద 200 చ.మీ. కార్పెట్‌ ఏరియా ఫ్లాట్లనూ అఫడబుల్‌ హౌసింగ్‌ పరిధిలోకి చేర్చింది. దీంతో 2,150 చ.అ. విస్తీర్ణంలోని పే…ద్ద ఇళ్లు కూడా చవక గృహాల జాబితాలోకి చేరిపోయాయి. పైగా ఈ గృహ కొనుగోలుదారులకు క్రెడిట్‌ లింక్‌ సబ్సిడీ స్కీమ్‌ (సీఎల్‌ఎస్‌ఎస్‌) కింద రూ.2.35 లక్షల వరకూ వడ్డీ రాయితీని కూడా అందిస్తుంది.
గతంలో 30, 60 చ.మీ. కార్పెట్‌ ఏరియా ఉండే ఫ్లాట్లను మాత్రమే అందుబాటు గృహాలుగా పరిగణించేవారు. ప్రధాన్‌మంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) కింద వీటికి మాత్రమే వడ్డీ రాయితీలుండేవి. అయితే ఫ్లాట్ల విస్తీర్ణం తక్కువగా ఉండటంతో నిర్మాణానికి డెవలపర్లు, కొనుగోలుకు కస్టమర్లూ ఇద్దరూ ముందుకొచ్చేవారు కాదు. దీంతో అందుబాటు గృహాలు పెద్దగా సక్సెస్‌ కాలేకపోయాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం తాజాగా ఎంఐజీ గృహాల కార్పెట్‌ ఏరియాలను 33 శాతం పెంచింది. గతంలో 120 చ.మీ.లుగా ఉన్న ఎంఐజీ–1 కార్పెట్‌ ఏరియాని ప్రస్తుతం 160 చ.మీ.లుగా, అలాగే గతంలో 150 చ.మీ.లుగా ఉన్న ఎంఐజీ–2 కార్పెట్‌ ఏరియాను ప్రస్తుతం 200 చ.మీ.లకు విస్తరించింది. వాస్తవానికి కేంద్రం ఎంఐజీ గృహాల విస్తీర్ణాలను పెంచడం ఇది రెండోసారి. పీఎంఏఐవై పథకం ప్రారంభంలో ఎంఐజీ–1 గృహాల కార్పెట్‌ ఏరియా 90 చ.మీ., ఎంఐజీ–2 గృహాలకు 110 చ.మీ. కార్పెట్‌ ఏరియాలుండేవి. నగరాల్లో ఈ విస్తీర్ణాల్లోని గృహాలకు పెద్దగా ఆదరణ లేకపోవటంతో ఎంఐజీ–1 గృహాల కార్పెట్‌ ఏరియాను 120 చ.మీ.లకు, ఎంఐజీ–2ని 150 చ.మీ.లకు పెంచింది. రెండు సందర్భాల్లోనూ ఈడబ్ల్యూఎస్, ఎల్‌ఐజీ గృహాల కార్పెట్‌ ఏరియాల్లో, ఆదాయ పరిమితి, వడ్డీ రాయితీల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు.
నెల జీతం లక్ష, లక్షన్నరైనా సరే..
లింగబేధంతో సంబంధం లేకుండా ఎంఐజీ గృహాలను ఎవరైనా సరే కొనుగోలు చేయవచ్చు. కాకపోతే తొలిసారి గృహ కొనుగోలుదారులై ఉండాలి. ఏడాది వేతనం రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల లోపు అంటే నెలకు లక్ష వేతనం ఉన్నవారు రూ.30 లక్షల దాకా గృహ రుణం తీసుకొని రూ.2.35 లక్షల వడ్డీ రాయితీని పొందవచ్చు. మిగిలిన మొత్తంపై మార్కెట్లో ఉండే వడ్డీ రేటు ఉంటుంది. కాకపోతే వీళ్లు కేవలం ఎంఐజీ–1 కింద 160 చ.మీ. కార్పెట్‌ ఏరియా ఉండే గృహాలను మాత్రమే ఎంచుకోవాలి. అంటే 1,721 చ.అ. ఫ్లాట్లన్నమాట.
వార్షిక వేతనం 18 లక్షలైతే..
ఇక, ఏడాది వేతనం రూ.18 లక్షలు అంటే నెలకు లక్షన్నర వేతనం తీసుకునేవాళ్లు రూ.60 లక్షల దాకా రుణం తీసుకొని.. రూ.2.30 లక్షల వడ్డీ రాయితీని పొందవచ్చు. వీళ్లు 200 చ.మీ. అంటే 2,152 చ.అ. ఫ్లాట్ల కొనుగోలుకు మాత్రమే అర్హులు. ఎంఐజీ గృహా కొనుగోలుదారులకు వడ్డీ రాయితీ అవకాశం వచ్చే ఏడాది మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
వ్యక్తిగత ఇళ్లకు, పై అంతస్తు వేసినా సరే వడ్డీ రాయితీ..
పీఎంఏవై కింద సీఎల్‌ఎస్‌ఎస్‌ వడ్డీ రాయితీ పొందాలంటే కేవలం బిల్డర్లు కట్టే అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లనే కొనుగోలు చేయాల్సిన అవసరం లేదండోయ్‌.. వ్యక్తిగతంగా ఇల్లు కట్టుకున్నా లేక అప్పటికే ఉన్న ఇంటి పైన మరో అంతస్తు వేసుకున్నా సరే రూ.1.50 వరకూ వడ్డీ రాయితీ లభిస్తుంది. కాకపోతే ఆయా గృహాలు అందుబాటు గృహాల కార్పెట్‌ ఏరియా నిబంధనలకు లోబడి ఉండాలి. 30, 60 చ.మీ. కార్పెట్‌ ఏరియాలోని ఈడబ్ల్యూఎస్, ఎల్‌ఐజీ ఫ్లాట్లకు కూడా వడ్డీ రాయితీ ఉంటుంది. అయితే ఈ గృహాల కొనుగోలుకు కేవలం మహిళలే అర్హులు. కనీసం జాయింట్‌ ఓనర్‌గానైనా ఉండాలి. ఏడాది వేతనం రూ.6 లోపుండే మహిళలకు రూ.6 లక్షల రుణంపై 6.5 శాతం వడ్డీ రాయితీ ఉంటుంది. అంటే రూ.2.67 లక్షల మినహాయింపు లభిస్తుంది. అలాగే 30, 60 చ.మీ. ఫ్లాట్ల నిర్మాణానికి కేంద్రం జీఎస్‌టీ, ఆదాయ పన్ను రాయితీలను అందిస్తుంది. ప్రతి యూనిట్‌ మీద రూ.1.5 లక్షల వరకు వడ్డీ రాయితీతో పాటూ 80 ఐబీఏ సెక్షన్‌ కింద ఆదాయ పన్ను రాయితీ కూడా ఉంటుంది.

Related Posts

Latest News Updates