Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

27న తెలంగాణ సెక్రటేరియట్‌కు శంకుస్థాపన

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు కల సాకారం కానుంది. ఈనెల 27న కొత్త సచివాలయ నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే కొత్త సెక్రటేరియట్‌ ప్లాన్, డిజైన్స్‌కు కేసీఆర్‌ ఆమోదముద్ర కూడా వేసేశారు. కొత్త నిర్మాణం పూర్తయ్యే వరకూ సచివాలయ విభాగాలను బూర్గుల రామకృష్ణా రావు భవనంలోకి (బీఆర్‌కేఆర్‌ భవన్‌) తరలించనున్నారు.
సెక్రటేరియట్‌ ఏపీ, తెలంగాణ కేటాయింపులు..
నిజాం కాలంలో ట్యాంక్‌బండ్‌ సమీపంలో 25.5 ఎకరాల విస్తీర్ణంలో, 9.16 లక్షల చదరపు అడుగుల్లో సెక్రటేరియట్‌ను నిర్మించారు. ఇందులో 30 సచివాలయ విభాగాలుంటాయి. 2014లో సంయుక్త ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో ఈ సెక్రటేరియట్‌ను రెండు విభాగాలుగా విభజించారు. తెలంగాణ, ఏపీకి 42:58 నిష్పత్తిలో స్థలాన్ని కేటాయించారు. ఏపీకి 15.21 ఎకరాల స్థలం, 5.31 లక్షల చ.అ. బిల్టప్‌ ఏరియా, తెలంగాణకు 10.29 ఎకరాల స్థలం, 3.85 లక్షల చ.అ. బిల్టప్‌ ఏరియాను కేటాయించారు. మొత్తం 10 బ్లాక్స్‌ ఉండగా.. 4 బ్లాక్స్‌ తెలంగాణకు, 5 ఏపీకి కేటాయించారు. ఒక బ్లాక్‌ను ఎవరికీ కేటాయించలేదు. హెరిటేజ్‌ స్ట్రక్చర్‌గా అలాగే ఉంచేశారు.
15–20 రోజుల్లో కూల్చివేత..
సెక్రటేరియట్‌ను కూల్చేందుకు ప్రభుత్వం సరికొత్త టెక్నాలజీని వినియోగించాలని నిర్ణయించింది. కేవలం 15 నుంచి 20 రోజుల్లో అన్ని బ్లాక్స్‌ను కూల్చేసి.. చెత్తను తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు.
ప్రీ–ఫ్యాబ్‌తో కొత్త సచివాలయం..
కొత్త సచివాలయ డిజైన్స్‌ను ముంబైకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్‌ హఫీజ్‌ కాంట్రాక్టర్‌ రూపొందించారు. వాస్తు కన్సల్టెన్స్‌ కూడా కొత్త సచివాలయ డిజైన్స్‌ను ఓకే చేసినట్లు సమాచారం. తొలి దశలో రూ.400 కోట్ల నిర్మాణ వ్యయాన్ని అంచనా వేశారు. పీ–ఫ్యాబ్రికేటెడ్‌ టెక్నాలజీతో కొత్త సచివాలయాన్ని నిర్మిస్తామని.. ఇచ్చిన గడువు ఏడాదిలోగా నిర్మాణాన్ని పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.
గ్రీనరీకే అధిక ప్రాధాన్యం..
కొత్త సెక్రటేరియట్‌ నిర్మాణంలో గ్రీనరీకే అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రస్తుత సచివాలయం 25.5 ఎకరాల్లో విస్తరించి ఉన్న సెక్రటేరియట్‌ స్థలంలో 20 శాతం మాత్రమే కొత్త సచివాలయ నిర్మాణం కోసం వినియోగించనున్నారు. మిగిలిన స్థలాన్ని పార్కింగ్, కాన్ఫరెన్స్‌ హాల్, గ్రీనరీ, ఓపెన్‌ గ్రౌండ్‌ వంటి వాటికి వినియోగించనున్నారు. 10 లక్షల చదరపు అడుగుల్లో సెక్రటేరియట్‌ ఉంటుంది. 3–4 బ్లాక్స్‌ ఉంటాయి. ప్రతి బ్లాక్‌ 8–10 అంతస్తుల్లో ఉంటుంది.
ముందు టీబీ ఆసుపత్రి; ఆ తర్వాత బైసన్‌ పోలో
కేసీఆర్‌కు వాస్తు, జ్యోతిషశాస్త్రం, న్యూమరాలజీ వాటిపై బలమైన విశ్వాసం. ప్రస్తుత సచివాలయానికి వాస్తు దోషముందని పలువురు జ్యోతిష్య పండితులు చెప్పడంతో సెక్రటేరియట్‌ను పునఃనిర్మించాలని నిర్ణయించారు కేసీఆర్‌. ముందుగా ఎర్రగడ్డలోని టీబీ అండ్‌ ఛాతి ఆసుపత్రి ప్రాంతంలో నిర్మించాలనుకున్నారు. కానీ, సక్సెస్‌ కాలేకపోయింది. ఆ తర్వాత జింఖానా మైదానంలోని బైసన్‌ పోలో గ్రౌండ్స్‌లో నిర్మించాలని ప్రతిపాదించాడు. కానీ, కేంద్ర ప్రభుత్వం స్థల కేటాయింపునకు ససేమిరా చెప్పడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. దీంతో ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్‌ స్థానంలోనే కొత్త దాన్ని నిర్మించనున్నారు.
ఏపీ భవనాల్లోకి తరలిద్దామని..
వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం సెక్రటేరియట్‌ విభాగాలకు బీఆర్‌కేఆర్‌ భవనలోకి తరలించాలనుకోలేదు. ముందుగా ఏపీ భవనాల్లోకి తెలంగాణ సెక్రటేరియట్‌ను తరలించి.. తెలంగాణ సెక్రటేరియట్‌ను కూల్చేసి కొత్త వాటిని నిర్మించాలని నిర్ణయించారు. నిర్మాణం పూర్తయ్యాక.. ఏపీ భవనాలకు ఖాళీ చేసి.. కొత్త వాటిలోకి వెళ్లి, మళ్లీ ఏపీ భవనాలను కూల్చేసి వాటి స్థానంలో గ్రీనరీని పెంచాలని నిర్ణయించారు. కానీ, ఏపీ భవనాల్లోకి తెలంగాణ సెక్రటేరియట్‌ను తరలించి.. వాటిని కూల్చేసి, నిర్మాణ పనులు జరుగుతుంటే పక్కనే ఏపీ భవనాల్లో ఉన్న తెలంగాణ సెక్రటేరియట్‌ ఉద్యోగుల పనులకు అంతరాయంగా ఉంటుందని పలువురు నిపుణులు సీఎంకు సూచించారు. దీంతో తెలంగాణ సెక్రటేరియట్‌ను ఏపీ భవనంలో కంటే బీఆర్‌కేఆర్‌ భవన్‌లోకి తరలించాలని నిర్ణయించారు.

Related Posts

Latest News Updates