సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. అయితే ఆ కలను కూడా ఎంపిక చేసి మరీ సాకారం చేసుకుంటున్నారు కొనుగోలుదారులు. అంటే ఒకప్పుడు రెండు పడక గదులు (2 బీహెచ్‌కే) ఫ్లాట్ల వైపు మొగ్గు చూపిన కస్టమర్లు.. ఇప్పుడు మూడు పడక గదులు (3 బీహెచ్‌కే) ఫ్లాట్ల వైపు మళ్లుతున్నారని దానర్థం. దేశంలోని ఆరు ప్రధాన నగరాలైన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, పుణెల్లో ఓ రియల్టీ సంస్థ సర్వే నిర్వహించింది.
హైదరాబాద్‌లో 2018లో ప్రారంభమైన మొత్తం గృహాలల్లో 47 శాతంగా ఉన్న 3 బీహెచ్‌కే ఫ్లాట్ల సంఖ్య.. 2019 తొలి త్రైమాసికం నాటికి 67 శాతానికి పెరిగాయి. అలాగే ధర విషయంలోనూ వృద్ధి కనిపించింది. ఏడాదిలో 3 బీహెచ్‌కే ధర రూ.9 లక్షలు పెరిగింది. 2018 క్యూ1లో రూ.92.2 లక్షలుగా ఉన్న 3 బీహెచ్‌కే ఫ్లాట్ ధర.. ఇప్పుడు కోటికి చేరింది.
విస్తీర్ణాలు కూడా పెరిగాయి..
ఇతర ప్రధాన నగరాలతో పోల్చుకుంటే ఒక్క హైదరాబాద్‌లోనే ఏడాదిలో 20 శాతం 3 బీహెచ్‌కే నిర్మాణాలు పెరిగాయి. ఇందుకు కారణం.. ఆఫీసు స్థలం అమ్మకం విక్రయించబడం, ఇతర మెట్రో నగరాలతో చూసుకుంటే ఇక్కడే స్థిరాస్తి ధరలు తక్కువగా ఉండటమే. సాధారణంగా భాగ్యనగరంలో 1,880 చ.అ.లుగా ఉండే 3 బీహెచ్‌కే విస్తీర్ణం… ఈ ఏడాది 1,990లకు పెరిగింది. ఆయా 3 బీహెచ్‌కే ఫ్లాట్ల నిర్మాణాలు కూడా ఎక్కువగా గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, కొండాపూర్, నార్సింగి, ముషిరాబాద్, అమీర్‌పేట్ ప్రాంతాల్లో ఉన్నాయి.