రోజురోజుకూ పెరుగుతున్న ఈ–కామర్స్ వినియోగం, స్థిరపడుతున్న నిర్మాణ రంగం, పెరుగుతున్న స్థిరాస్తి లావాదేవీలు, వస్తువులు మరియు సేవల పన్ను (జీఎస్టీ), మేకిన్ ఇండియా, ఆర్థికాభివృద్ధి వంటి అనేక కారణాలతో దేశంలో గిడ్డంగుల పరిశ్రమ (వేర్‌హౌజ్) అభివృద్ధి చెందుతోంది. దేశంలోని ఏడు ప్రధాన నగరాలైన ముంబై, ఎన్సీఆర్, బెంగళూరు, చెన్నై, పుణె, హైదరాబాద్, అహ్మదాబాద్‌ల్లో వేర్‌హౌజ్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉంది.ప్రస్తుతం ఏడు ప్రధాన నగరాల్లో 62.1 కోట్ల చ.అ. గిడ్డంగుల స్థలం అందుబాటులో ఉండగా.. 2020 నాటికి 83.9 కోట్ల చ.అ. స్థలం అవసరముంటుంది. ఏడు నగరాల్లో ఏటా 1.7 కోట్ల చ.అ. వేర్‌హౌజ్ లావాదేవీలు జరుగుతున్నాయి. వేర్‌హౌజ్‌లో ఆటో, కెమికల్, ఫార్మాసూటికల్స్ రంగాలకు ఎక్కువ డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఈ–టెయిల్ విభాగంలో 1.4 కోట్ల చ.అ. స్థలం అందుబాటులో ఉండగా.. 2020 నాటికి 2.9 కోట్ల చ.అ. స్థలం అవసరముంటుంది. వ్యక్తిగత, సంస్థాగత పెట్టుబడిదారులు, హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ), ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ వంటి వారికి వేర్‌హౌజ్ మార్కెట్ మంచి పెట్టుబడి అవకాశంగా నివేదిక పేర్కొంది. అయితే పెట్టిన పెట్టుబడులకు అధిక రాబడి రావాలంటే మాత్రం పుణె నగరమే ఉత్తమం. ఇక్కడ ఏటా 22–24 శాతం లాభాలున్నాయట. దేశంలోని వేర్‌హౌజ్ మార్కెట్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.. భూమి లభ్యత, ధర, అద్దెలే. డిమాండ్–సరఫరాలను బట్టి స్థలం ధరలు, అద్దె విలువలనూ పెంచేస్తున్నారని ఓ నివేదిక వెల్లడించింది.నగరాల వారీగా చూస్తే..అహ్మదాబాద్‌లో అస్లాలీ, చన్గోడర్, నరోడా, రాజ్‌కోట్, కేడా వంటి ప్రాంతాల్లో వేర్‌హౌజ్ మార్కెట్‌కు గిరాకీ ఉంది. ప్రస్తుతమిక్కడ 60 లక్షల చ.అ. గిడ్డంగుల స్థలం అందుబాటులో ఉండగా.. 2020 నాటికి మరో 4 కోట్ల చ.అ. స్థలం అవసరముంటుంది. ఇందులో 3.4 కోట్ల చ.అ. స్థలం కేవలం తయారీ రంగానికే అవసరముంది. ముంబై, చెన్నై ఓడరేవు అనుసంధానం, జాతీయ ర హదారుల కారణంగా బెంగళూరు–ముంబై, బెంగళూరు–చెన్నై మార్గాల్లో వేర్‌హౌజ్ పరిశ్రమకు డిమాండ్ ఉంది. నీలమంగళ–డాబాస్పేట్, సౌక్య రోడ్, బిదాడీ, బొమ్మసంద్ర రోడ్లు వేర్‌హౌజ్ క్లస్టర్లుగా వృద్ధి చెందాయి. ప్రస్తుతమిక్కడ 7.7 కోట్ల చ.అ. వేర్‌హౌజ్ స్థలం అవసరం కాగా.. ఇందులో తయారీ రంగానికి 5.5 కోట్ల చ.అ., రిటైల్ విభాగానికి 2.2 కోట్ల చ.అ. స్థలం అవసరముంది. చెన్నైలో గ్రాండ్ సదరన్ ట్రంక్ రోడ్, పూనమల్లె హై రోడ్, చెన్నై తిరువళ్లూర్ రోడ్, జీఎన్టీ రోడ్/ఎన్‌హెచ్–16)లు వేర్ హౌజ్ క్లస్టర్లుగా వృద్ధి చెందాయి. ప్రస్తుమిక్కడ 1.5–2 కోట్ల చ.అ. వేర్ హౌజ్ స్థలం అందుబాటులో ఉంది. 2020 నాటికి 6.5 కోట్ల చ.అ. స్థలం అవసరం కాగా.. ఇందులో తయారీ రంగానికి 5.1 కోట్ల చ.అ., రిటైల్‌కు 1.4 కోట్ల చ.అ. స్థలం అవసరం. టెక్స్టైల్స్ హబ్ కారణంగా బీవండి, జవహర్లాల్ నెహ్రు పోర్ట్ ట్రస్ట్ (జేఎన్పీటీ) కారణంగా పన్వెల్లు వేర్‌హౌజ్ క్లస్టర్లుగా అభివృద్ధి చెందాయి. ముంబైలో 15.4 కోట్ల చ.అ. వేర్‌హౌజ్ స్థలం అవసరం కాగా.. ఇందులో తయారీ రంగానికి 12 కోట్ల చ.అ., రిటైల్‌కు 3.4 కోట్ల చ.అ. స్థలం అవసరం. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో గుర్గావ్–పటౌడి రోడ్, జమల్పూర్–పంచగోన్ రోడ్, బిలాస్పూర్– తురు రోడ్, బరోటాలతో పాటూ ఎన్‌హెచ్–8లోని దారుహెరా, ఎన్‌హెచ్–2లోని పల్వాల్ ప్రాంతాలు ప్రధాన గిడ్డంగుల క్లస్టర్లుగా చెప్పవచ్చు. ఎన్సీఆర్లో 22.3 కోట్ల చ.అ. గిడ్డంగుల స్థలం అవసరం కాగా.. ఇందులో తయారీ రంగానికి 18.7 కోట్ల చ.అ., రిటైల్‌కు 3.6 కోట్ల చ.అ. స్థలం అవసరముంది. పుణెలో చకాన్, తాలెగోన్, కురులి, చింబలీ ప్రాంతాలు వేర్‌హౌజ్ క్లస్టర్లుగా వృద్ధి చెందాయి. ఇక్కడ 4.5 కోట్ల చ.అ. వేర్‌హౌజ్ స్థలం అవసరం కాగా.. తయారీ రంగానికి 3.6 కోట్ల చ.అ., రిటైల్ రంగానికి 9 లక్షల చ.అ. స్థలం అవసరముంది.