అభివృద్ధి చెందిన ప్రాంతంలో అన్ని రకాల వసతులతో కూడిన ఇల్లు, అది కూడా బడ్జెట్లో దొరికితే? అంతకుమించిన ఆనందం ఏముంటుంది చెప్పండి! కానీ, గిరిధారి ఎగ్జిక్యూటివ్ పార్క్ నివాసితులకు ఈ ఆనందం సరిపోలేదు. డబ్బు ఆదాతో పాటూ పర్యావరణహితమైన ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. 715 కిలోవాట్ల సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. గృహ విభాగంలో దేశంలోనే ఇదే అతిపెద్ద ప్రాజెక్ట్.
10 టవర్ల మీద రూఫ్‌టాప్ సోలార్..
గిరిధారి హోమ్స్ కాళీమందిర్ సమీపంలో ఎనిమిదిన్నర ఎకరాల్లో ఎగ్జిక్యూటివ్ పార్క్ గేటెడ్ కమ్యూనిటీని నిర్మించింది. 12 టవర్లలో 518 గృహాలుంటాయి. గిరిధారి ఎగ్జిక్యూటివ్ పార్క్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రాజెక్ట్‌లోని 10 టవర్ల మీద 715 కిలోవాట్ల రూఫ్‌టాప్ సౌర విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ నుంచి నెలకు 85 వేల కిలోవాట్లు, ఏటా సుమారు 10.2 లక్షల యూనిట్లకు పైగా విద్యుత్‌ను ఉత్పత్తి అవుతుంది.
ప్రభుత్వం నుంచి సబ్సిడీ కూడా..
భవనం ఎలివేషన్ సోలార్ ప్యానెల్స్ మీద పడకుండా ఉండేందుకు టెర్రస్ మీద 11 ఫీట్ల ఎత్తులో ఏర్పాటు చేశారు. ఇందుకోసం 100 టన్నుల ఇనుము అవసరమైంది. మొత్తం 2,200 ప్యానెల్స్ ఉన్నాయి. ఇన్వెర్టర్లకు వైఫై అనుసంధానమై ఉంటుంది. దీంతో ప్రతి రోజూ ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుందనే రిపోర్ట్ వస్తుంది. సూర్యరశ్మి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను నేరుగా టీఎస్ఎస్పీడీసీఎల్ పవర్ గ్రిడ్‌కు అనుసంధానించారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు రూ.3.87 కోట్లు ఖర్చు కాగా.. ఇందులో రూ.1.16 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ వచ్చిందని, మిగిలిన సొమ్మును అసోసియేషన్ కార్పస్ ఫండ్ నుంచి కేటాయించారు. ఈ ప్రాజెక్ట్‌ను సికింద్రాబాద్‌కు చెందిన అవగ్ని రిన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్ ఇండియా డిజైన్ నిర్వహణ చేసింది. బొగిస్ సోలార్ మెస్సర్స్ టెక్నికల్ కన్సల్టెన్సీగా ఉంది.
ఐదేళ్ల పాటు నిర్వహణ వెండర్‌దే..
ఐదేళ్ల పాటు ప్లాంట్ నిర్వహణ బాధ్యత వెండర్‌దే. ఆ తర్వాత అసోసియేషన్‌లో నిర్ణయించి ప్రైవేట్ పార్టీకి ఇస్తుంది. నెలకు 3–4 సార్లు సోలార్ ప్యానెల్స్‌ను క్లాత్‌తో శుభ్రం చేస్తాం. ధుమ్ము, ధూళి చేరకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. 8 చెట్లు ఎంతైతే కాలుష్యాన్ని తగ్గిస్తాయో ఒక్క సోలార్ ప్యానెల్ చేస్తుంది. పర్యావరణపరంగాను చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. టెర్రస్ వాడుకోవచ్చు కూడా. ఇంటర్నెట్, డిష్ బాక్స్‌లను పెట్టుకోవచ్చు. చిన్న చిన్న ఫంక్షన్లను కూడా చేసుకోవచ్చు. సోలార్ ప్యానెల్స్ కింద అవసరమైన రూఫ్‌టాప్ గార్డెనింగ్ కూడా చేసుకోవచ్చు. దీంతో భవనం మరింత చల్లబడుతుంది. ఇంట్లో ఎలక్ట్రానిక్ ఉపకరణాల వినియోగం కూడా తగ్గుతుంది.
రూ.6 లక్షలు ఆదా..
గతంలో నెలకు రూ.12 లక్షల కరెంట్ బిల్లు వచ్చేది. కానీ, సోలార్ పవర్ ఏర్పాటు తర్వాత రూ.6–7 లక్షల మధ్య వస్తుంది. నెలకు సుమారు రూ.6 లక్షల వరకు ఆదా అవుతుంది. కుటుంబం వారీగా చూసుకుటే గతంలో ఒక్క ఫ్యామిలీకి రూ.1,200 కరెంట్ వస్తుండే.. కానీ, ఇప్పుడు రూ.400–500 మధ్య వస్తుంది. డబ్బు ఆదా చేయడమే కాకుండా, పర్యావరణాన్ని దోహదం చేసినట్టవుతుందని ఎగ్జిక్యూటివ్ పార్క్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యాదగిరి రెడ్డి కటిక తెలిపారు.
ఆదర్శంగా తీసుకోవాలి..
డెవలపర్ ఏమిస్తాడు? ప్రభుత్వం ఏం చేస్తుంది? అనే కస్టమర్లున్న ఈ రోజుల్లో పర్యావరణహితమైన పనులతో ఇతరులకు ఆదర్శంగా నిలిచింది ఎగ్జిక్యూటివ్ పార్క్ అసోసియేషన్. సహజ వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత గురించి ప్రసంగాలు కాకుండా ప్రాక్టికల్‌గా చేసి చూపించింది. దీన్ని ఇతర నివాసిత సంఘాలు ఆదర్శంగా తీసుకోవాలి. గిరిధారి అన్ని ప్రాజెక్ట్‌లలోనూ ఈ తరహా ఏర్పాటుకు కృషి చేస్తామని గిరిధారి హోమ్స్ ఎండీ ఇంద్రసేనా రెడ్డి తెలిపారు.