Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

30 లక్షల చ.అ. అమెజాన్‌ క్యాంపస్‌ హైదరాబాద్‌లో

ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ అతిపెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో బుధవారం ప్రారంభించింది. గచ్చిబౌలిలో 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని నిర్మించారు. ఆఫీస్‌ స్పేస్‌ 18 లక్షల చదరపు అడుగులు కైవసం చేసుకుంది. మొత్తం 15,000 మంది ఉద్యోగులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. 39 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేశారు. ప్రతిరోజు సగటున 2,000 మంది కార్మికులు నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ఈఫిల్‌ టవర్‌కు వినియోగించిన ఇనుము కంటే రెండున్నరెట్లు ఈ భవనానికి వాడారు. ఒకే సమయంలో 972 మంది వెళ్లగలిగేలా 49 లిఫ్టులున్నాయి. ఇవి సెకనుకు ఒక్కో అంతస్తును దాటతాయి. 86 మీటర్ల ఎత్తున్న ఈ భవనంలో విభిన్న రెస్టారెంట్లతో 24 గంటలూ నడిచే భారీ కెఫెటేరియా, హెలిప్యాడ్‌, 290 కాన్ఫరెన్స్‌ రూమ్స్‌ ఏర్పాటు చేశారు. నిర్మాణానికి రూ.1,400 కోట్లకుపైగా వెచ్చించినట్టు విశ్వసనీయ సమాచారం.
తొలుత హైదరాబాద్‌ నుంచే..
అమెజాన్‌కు యూఎస్‌ వెలుపల ఇది ఏకైక సొంత భవనం కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లో సంస్థకు 300 క్యాంపస్‌లు ఉన్నాయి. వీటన్నిటిలో భాగ్యనగరి కేంద్రమే అతి పెద్దది. అన్ని కేంద్రాల విస్తీర్ణం 4 కోట్ల చదరపు అడుగులు ఉంది. ఇక హైదరాబాద్‌లో కంపెనీకి ఎనమిది ఆఫీసులున్నాయి. 40 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇవి నెలకొన్నాయి. 2004లో భారత్‌లో అడుగుపెట్టిన అమెజాన్‌ తొలుత భాగ్యనగరి కేంద్రంగా కార్యకలాపాలను ప్రారంభించింది. టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, ఆపరేషన్స్‌ టీమ్స్‌తోపాటు కస్టమర్‌ సర్వీస్‌ ఆపరేషన్స్‌ ఇక్కడి నుంచి జరుగుతున్నాయి. కాగా, నూతన క్యాంపస్‌ను తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ ప్రారంభించారు.
ఎగుమతులకు ఊతం..
భారత్‌లో అమెజాన్‌కు 30 ఆఫీసులున్నాయి. 62,000 పైచిలుకు ఉద్యోగులున్నారు. వీరిలో 20,000కుపైగా హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. అలాగే దేశవ్యాప్తంగా 1.55 లక్షల మంది కాంట్రాక్టు సిబ్బంది ఉన్నారు. ఇప్పటి వరకు భారత్‌లో రూ.35,000 కోట్ల పెట్టుబడి పెట్టామని అమెజాన్‌ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అమిత్‌ అగర్వాల్‌ వెల్లడించారు. మరో రూ.3,500 కోట్లు ఫుడ్‌, రిటైల్‌లో ఖర్చు చేశామన్నారు. గ్లోబల్‌ రియల్‌ ఎస్టేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జాన్‌ షోట్లర్‌తో కలిసి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘గ్లోబల్‌ సెల్లింగ్‌ వేదిక ద్వారా ఇక్కడి చిన్న వర్తకులు విదేశాల్లో తమ ఉత్పత్తులు విక్రయించుకునే సౌలభ్యం కల్పించాం. ఇప్పటి వరకు రూ.7,000 కోట్ల విలువైన ప్రొడక్టులు ఎగుమతి అయ్యాయి. వచ్చే మూడేళ్లలో ఇది రూ.3,5000 కోట్లకు చేరుతుందని ఆశిస్తున్నాం. ఈ-కామర్స్‌ రంగంలో మందగమనం లేదు’ అని వివరించారు.

Related Posts

Latest News Updates