Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

కరోనాతో ఇంటి ప్రాముఖ్యత పెరిగింది!

– 50–60 శాతం పెరిగిన ఇంటి వినియోగం
– ఇక గృహ నిర్మాణంలో ఆఫీస్‌ స్పేస్‌ కూడా ఉండాల్సిందే
– 50–100 చ.అ. పెరగనున్న గృహల విస్తీర్ణాలు
– ఇంట్లోనే ఇంటర్నెట్, సీటింగ్‌ వంటి వసతులు కూడా..
– రూ.40 లక్షల లోపు గృహాలకు డిమాండ్‌ ఎక్కువ
– జనప్రియ చైర్మన్‌ రవిందర్‌ రెడ్డి
తినడానికి తిండి, వేసుకోవటానికి దుస్తులు, ఉండటానికి ఇల్లు. ఈ మూడు లేనిదే మానవ జాతి మనుగడ సాగించలేదు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో ఆయా రంగాలకు తాత్కాలిక అనిశ్చితి ఏర్పడిందే తప్ప.. దీర్ఘకాలంలో వీటికి రెట్టింపు డిమాండ్‌ ఉండటం ఖాయం. కరోనా నేర్పిన పాఠంతో ఇక నుంచి ప్రజలు ఆహారం, వైద్య అవసరాల తర్వాత ఖర్చు పెట్టేది ఇళ్ల మీదే అంటున్నారు జనప్రియ ఫౌండర్‌ అండ్‌ చైర్మన్‌ రవీందర్‌ రెడ్డి. రియల్టీ రంగంలో మూడున్నర దశాబ్ధాల అనుభవం ఈయన సొంతం.
నివాస విభాగం మీద కరోనా ప్రభావం ఎంత వరకుంటుంది?
గృహ విభాగంలో కరోనాకు ముందు, కరోనా తర్వాత అని స్పష్టమైన విభజన ఏర్పడింది. కరోనా ప్రభావంతో రిటైల్, హాస్పిటాలిటీ, టూరిజం వంటి రంగాల్లో ఉద్యోగాల కోత ఉంది. దీంతో గృహ కొనుగోలుదారుల సంఖ్య తగ్గుతుంది. లాక్‌డౌన్‌ విషయంలో ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజలు క్రమక్రమంగా సాధారణ జీవనంలోకి మళ్లుతున్నారు. గతంలో మాదిరిగా వచ్చే 3–4 నెలల పాటు విరివిగా ఖర్చు చేయరు. తిండి, విద్య, వైద్యం గురించి సేవింగ్స్‌ చేస్తుంటారు. ఆ తర్వాత కావాల్సింది ఇల్లు. రియల్టీ మార్కెట్‌ జోష్‌లో ఉన్నప్పుడు అందరూ కొంటారు. డిమాండ్‌ ఉంటుంది కాబట్టి ధర కూడా ఎక్కువే ఉంటుంది. అదే ఇలాంటి అనిశ్చితి పరిస్థితుల్లోనే ఇళ్లు కొనడం కరెక్ట్‌. డెవలపర్లతో బేరమాడుకోవచ్చు. నగదు లభ్యత కోసం డెవలపర్లు కూడా మార్జిన్లను తగ్గించుకొని విక్రయించే అవకాశం ఉంటుంది.
కరోనా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో భవిష్యత్తులో గృహ నిర్మాణాలు ఎలా ఉంటాయి?
లాక్‌డౌన్‌తో సాధారణ రోజుల్లో కంటే ఇంటి వినియోగం 50–60 శాతం పెరిగింది. కరోనాకు శాశ్వత పరిష్కారం వచ్చే వరకూ గతంలో మాదిరిగా ప్రజలు సినిమాలకు, షికార్లకు విచ్చలివిడిగా వెళ్లరు. ఇంట్లో గడిపే సమయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొత్తగా రానున్న గృహ నిర్మాణాలు కూడా అందుకు తగ్గట్టుగా మార్పులు చెందాల్సిన అవసరం ఉంది. గతంలో నలుగురు సభ్యులున్న కుటుంబానికి 2 బీహెచ్‌కే సరిపోయేది. కానీ, భవిష్యత్తులో కష్టం. ఇంట్లో గడిపే సమయం పెరగడం, ఆఫీస్‌ పని కూడా ఇంట్లోనే చేస్తుండటంతో ఇంటి విస్తీర్ణం కూడా పెరగాలి. ప్రైవసీ, ప్రశాంత వాతావరణంతో పాటు వర్క్‌ చేసుకునేందుకు ఇంటర్నెట్, సీటింగ్, డెస్క్‌ వంటి ఆఫీస్‌ స్పేస్‌ వసతులను కూడా ఇంట్లోనే కల్పించాల్సి ఉంటుంది. గతంలో 750 చ.అ.లలో కూడా నిర్మించే 2 బీహెచ్‌కేలకు ఇక నుంచి 50–100 చ.అ. విస్తీర్ణం ఎక్కువ అవసరం ఉంటుంది.
గృహ కొనుగోలుదారుల్లో ఎంపికలో ఎలాంటి మార్పులుంటాయి?
కరోనాతో ప్రజలకు ఒక్క విషయం మాత్రం క్లియర్‌గా అర్థమైంది. ప్రధాన నగరంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి గృహ కొనుగోళ్లలో శివారు ప్రాంతాలకు, పచ్చని పరిసరాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ప్రజా రవాణా సౌకర్యాలుండే శివారు ప్రాంతాలలో ఇళ్లను ఎంచుకునే అవకాశముంది. కార్యాలయాలకు దగ్గరగా ఉండాలని భావించే వాళ్లు.. వర్క్‌ ఫ్రం హోమ్‌ ప్రాజెక్ట్‌లకు, శాటిలైట్‌ టౌన్‌షిప్‌లకు ప్రాధాన్యమిస్తారు. జన సమర్థత ఎక్కువగా ఉండే షాపింగ్‌ మాల్స్, థియేటర్స్‌ వంటి వాణిజ్య ప్రాంతాల్లో కాకుండా హై స్ట్రీట్‌ మార్కెట్ల వైపు జనం మొగ్గు చూపే అవకాశాలున్నాయి.
కరోనాతో ఇళ్ల రేట్లు ఏమైనా తగ్గుతాయా?
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నవి, కొత్తగా ప్రారంభం కానున్న ప్రాజెక్ట్‌లలో ధరలు తగ్గకపోవచ్చు. ఎందుకంటే ఆయా నిర్మాణాల పూర్తి కోసం అవసరమైన నిర్మాణ సామగ్రి ధరలు పెరుగుతున్నాయి. కూలీల కొరత కూడా ఉంది. దీంతో నిర్మాణ వ్యయం పెరిగే అవకాశముంది. కాకపోతే ఇప్పటికే పూర్తయి అమ్ముడుపోకుండా ఉన్న గృహాల (ఇన్వెంటరీ) ధరలు కొంత తగ్గే అవకాశముంది. కాకపోతే డెవలపర్లకు, కొనుగోలుదారులకు మధ్య జరిగే సంప్రదింపులను బట్టి ఈ నిర్ణయాలుంటాయి. నగదు లభ్యత కోసం తగ్గించే అవకాశాలున్నాయి. గతంలో 50–60 లక్షల గృహాలు కొందామనుకున్న వాళ్లు ఇప్పుడు రూ.40 లక్షల లోపు గృహాల కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తారు. హైదరాబాద్‌లో రూ.35–40 లక్షల గృహాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది.

Related Posts

Latest News Updates